తెరపైకి మళ్లీ ‘గ్రానైట్‌ కేసు’

ABN , First Publish Date - 2022-02-19T06:45:55+05:30 IST

కరీంనగర్‌లోని గ్రానైట్‌ కంపెనీల అక్రమాల డొంక

తెరపైకి మళ్లీ ‘గ్రానైట్‌ కేసు’

  • నిరుడు సీబీఐకి బీజేపీ నేత ఫిర్యాదు
  • విచారణ ప్రారంభించిన దర్యాప్తు సంస్థ
  • విజిలెన్స్‌ నివేదిక ఇవ్వాలన్న సీబీఐ 

 

 హైదరాబాద్‌/కరీంనగర్‌/కాకినాడ/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లోని గ్రానైట్‌ కంపెనీల అక్రమాల డొంక కదులుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో చోటుచేసుకున్న కరీంనగర్‌ గ్రానైట్‌ మాఫియాపై సీబీఐ తాజాగా దృష్టి సారించింది. రూ.750 కోట్ల కుంభకోణం అంతుచూడడానికి రంగం సిద్ధం చేస్తోంది. అప్పట్లో జరిగిన ఈ కుంభకోణం వెనుక  అధికార టీఆర్‌ఎ్‌సకు చెందిన కీలక నేత హస్తం ఉందని బీజేపీ జాతీయ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు పేరాల శేఖర్‌రావు నిరుడు నవంబరు 1న గ్రానైట్‌ కంపెనీల అక్రమ మైనింగ్‌, రవాణాపై సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.


రైల్వే, నౌకాయాన శాఖల అధికారులతో కుమ్మక్కయ్యి పలు సంస్థలు గ్రానైట్‌ అక్రమ రవాణా చేశాయని ఆయన ఫిర్యాదు చేశారు. గ్రానైట్‌ గనుల తవ్వకాల్లో, రవాణాలో కూడా భారీగా అక్రమాలు జరిగాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. దీంతో ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని సీబీఐ డైరెక్టర్‌.. విశాఖపట్నంలోని సీబీఐ ఏసీబీ విభాగాన్ని ఆదేశించారు. దీంతో మైనింగ్‌ కంపెనీలు, షిప్పింగ్‌ ఏజెన్సీలకు సీబీఐ మూడు వారాల కిందట నోటీసులు జారీ చేసింది. ఎంత సరుకు పోర్టు నుంచి ఎగుమతి చేశారు? పర్మిట్లు ఉన్నాయా? అపరాధ రుసం ఎందుకు చెల్లించలేదు? వంటి ప్రశ్నలతో నోటీసులు ఇచ్చారు.


2011-2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్‌ నుంచి కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టుల ద్వారా నుంచి వేల కోట్లలో గ్రానైట్‌ ఎగుమతులు జరిగాయి. దొంగ లెక్కలతో సరుకును ఎగుమతి చేసి షిప్పింగ్‌ ఏజెన్సీలు రూ.వందల కోట్ల మోసానికి పాల్పడ్డాయి. ప్రధానంగా 2011 నుంచి 2013 మధ్యలో కొన్ని లక్షల టన్నుల గ్రానైట్‌ రాయి కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతైంది. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గనులశాఖ దర్యాప్తు నిర్వహించింది. రాజమండ్రి విజిలెన్సు అధికారులు అప్పట్లో ఈ వ్యవహారాన్ని గుర్తించగా.. విచారణ జరిపిన రాష్ట్ర మైనింగ్‌ శాఖ అక్రమ రవాణాను నిర్ధారించింది. ఐదురెట్ల జరిమానా విధిస్తూ మైనింగ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


దీంతో కరీంనగర్‌ గ్రానైట్‌ కంపెనీలు మొత్తం రూ.744.66 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఈ జరిమానాను తగ్గించాలని గ్రానైట్‌ వ్యాపారులు అప్పట్లో ప్రభుత్వం వద్ద రివిజన్‌ పిటిషన్‌ వేసి పైరవీ చేశారు. నాటి ప్రభుత్వం రూల్‌ 26ను పట్టించుకోకుండా అక్రమంగా తరలించిన గ్రానైట్‌కు చెల్లించాల్సిన నార్మల్‌ సీనరేజ్‌ ఫీజు రూ.124.94 కోట్లకు తోడు వన్‌టైం పెనాల్టీ అంటే మరో 124.94 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది ఏజెన్సీల్లో కొందరు జరిమానా చెల్లించగా మరికొందరు పాక్షికంగా డబ్బు కట్టారని సమాచారం. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ మాజీ సభ్యుడు శేఖర్‌రావు నవంబరు 1న చేసిన ఫిర్యాదుకు సీబీఐ స్పందించి విచారణకు ఆదేశించింది. కరీంనగర్‌ ప్రాంతం నుంచి కాకినాడ పోర్టు ద్వారా ఖనిజాల అక్రమ రవాణాకు సంబంధించి 2013లో ఆంధ్రప్రదేశ్‌ విజిలెన్స్‌ విభాగం రూపొందించిన అప్రైజల్‌ నివేదికను అందించాలని ఫిర్యాదుదారు శేఖర్‌ రావుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది.


Read more