వరద సాయంపై సర్కారు వైఫల్యం

ABN , First Publish Date - 2022-07-18T09:06:13+05:30 IST

వరద సాయంపై సర్కారు వైఫల్యం

వరద సాయంపై సర్కారు వైఫల్యం

ఎలాంటి నష్టం జరగలేదనడం హాస్యాస్పదం..

వరద ప్రాంతాల్లో సీఎల్పీ బృందం పరిశీలన 

ఇళ్లు కోల్పోయిన వారికి ‘డబుల్‌’ ఇళ్లివ్వాలి 

పంట నష్టంపై అంచనాలు రూపొందించాలి

సోనియాపై ఈడీ వేధింపులను వ్యతిరేకిస్తూ.. 

ఈ నెల 21, 22 తేదీల్లో నిరసనలు: భట్టి 

రాహుల్‌ సిరిసిల్ల సభ వాయిదాపడే అవకాశం!


హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరద సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. విపత్తు సమాచారం ముందే ఉన్నా.. నివారణ చర్యలు తీసుకోవడంలో, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందన్నారు. దీంతో  ప్రాణ, ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఎలాంటి నష్టం జరగలేదంటూ పాలకులు ప్రకటించడం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరద పరిస్థితులు, పోడు భూముల సమస్య, రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర తదితర అంశాలపై చర్చించేందుకు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అధ్యక్షతన ఆదివారం ఇక్కడి ఓ హోటల్‌లో కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం భట్టి విక్రమార్క మీడియాకు వివరాలు వెల్లడించారు. ముంపు ప్రాంతాల్లో సీఎల్పీ, కాంగ్రెస్‌ ముఖ్యనేతల బృందం పర్యటించాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. వరదల కారణంగా జరిగిన పంట నష్టాన్ని అధికారులతో వెంటనే అంచనా వేయించి.. నివేదికలను కేంద్రానికి పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి  డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలన్నారు. నిరాశ్రయులై పునరావాస కేంద్రాలకు చేరిన వారికి తిరిగి వెళ్లేటప్పుడు రూ.25వేల చొప్పున సాయం చేయాలన్నారు. 


పంప్‌హౌస్‌ మునకతో ప్రజలపై భారం

కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌ నీట మునగడంతో ప్రజలపై ఆర్థిక భారం తప్పదని భట్టివిక్రమార్క అన్నారు. ప్రభుత్వం వెంటనే రుణమాఫీని వడ్డీతో సహా అమలు చేసి రైతులకు కొత్త రుణాలు లభించే ఏర్పాట్లు చేయాలన్నారు. సోమవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్‌ ఎంపీలు విభజన హామీల సాధన కోసం గళం విప్పుతారని చెప్పారు. పోడు భూముల సమస్యలను పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారన్నారు. ఆదివాసీలకు పోడు పట్టాలు వచ్చే వరకు కాంగ్రెస్‌ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈడీ విచారణ పేరుతో సోనియా, రాహుల్‌ గాంధీలపై కేంద్రం వేధింపులకు పాల్పడుతోందని, ఈ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 21, 22 తేదీల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర తెలంగాణ నుంచీ వెళుతున్న నేపథ్యంలో ఆ యాత్ర విజయవంతానికి కార్యాచరణ రూపొందించనున్నట్లు భట్టివిక్రమార్క తెలిపారు. 


తొలిరోజే వరదలపై వాయిదా తీర్మానం: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో వరద నష్టంపై పార్లమెంటు సమావేశాల తొలి రోజునే వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. వరదల్లో మరణించిన జర్నలిస్టు కుటుంబానికి పార్టీ తరఫున రూ.లక్ష  అందించనున్నట్లు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో చనిపోయిన ఇద్దరు సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున సాయం చేయాలని డిమాండ్‌చేశారు. జాతీయ రాజకీయాలపై సమీక్షల్లో తలమునకలైన సీఎం కేసీఆర్‌.. వర్షాలను ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచనే చేయలేదన్నారు. వరద ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నాయకులు సహాయక చర్యలు చేపట్టడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ గడప దాటి పరిశీలనకు వెళ్లారని పేర్కొన్నారు.


వరద బాధితులను ఆదుకోవడంలో తమ పార్టీ నేతలు తలమునకలుగా ఉన్న నేపథ్యంలో సిరిసిల్లలో తలపెట్టిన రాహుల్‌సభపైనా సమావేశంలో చర్చించినట్లు  వెల్లడించారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీతో చర్చించి సభ వాయిదాపై ప్రకటన చేస్తామని తెలిపారు.ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పంట నష్టమే జరగలేదని కేటీఆర్‌ అంటున్నారని, దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయానికి ఆటంకం కలిగే అవకాశం ఉందన్నారు. 

Updated Date - 2022-07-18T09:06:13+05:30 IST