గో రక్షక్‌ సభ్యులపై దాడి

ABN , First Publish Date - 2022-02-23T13:58:54+05:30 IST

గోవులను కబేళాకు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న గో రక్షక్‌ సభ్యులపై దుండగులు దాడి చేశారు. భయంతో సమీపంలోని ఆలయంలోకి

గో రక్షక్‌ సభ్యులపై దాడి

 గోవుల తరలింపును అడ్డుకోవడంతో ఘటన 

ఆందోళనకు దిగిన గోరక్షక్‌ సభ్యులు, బీజేపీ నేతలు


హైదరాబాద్/సరూర్‌నగర్‌/చంపాపేట్‌: గోవులను కబేళాకు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న గో రక్షక్‌ సభ్యులపై దుండగులు దాడి చేశారు. భయంతో సమీపంలోని ఆలయంలోకి పరుగు తీసినా వదలకుండా తల్వార్లతో వెంటపడి భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో కర్మన్‌ఘాట్‌లోని ఇన్నర్‌ రింగురోడ్డు గాయత్రీనగర్‌ సమీపంలో ఉద్రిక్తత ఏర్పడింది. దుండగులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ టెంపుల్‌ ఎదుట ఆందోళనకు దిగాయి. గోవులను వ్యానులో తరలిస్తున్నట్టు తెలుసుకున్న గోరక్షక్‌ సభ్యులు మంగళవారం రాత్రి 9 ప్రాంతంలో గాయత్రీనగర్‌ సమీపంలో వాహనాన్ని అడ్డుకున్నారు. గోవులను తరలిస్తున్న వారికి, గోరక్షక్‌ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. మరికొందరు బొలేరో వాహనంలో అక్కడకు చేరుకుని గోరక్షక్‌ సభ్యులకు చెందిన వాహనాన్ని ఢీ కొట్టారు. వారిపై దాడికి పాల్పడ్డారు. దుండగులు కర్రలు, తల్వార్లతో వెంట పడడంతో గో రక్షక్‌ సభ్యులు కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ ఆలయంలోకి పరుగులు తీశారు.


ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, ఇతరులు వారిని అడ్డుకోవడంతో దుండగులు గోవులతో పాటు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పలు హిందూ సంఘాల నాయకులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆలయం వద్దకు అధిక సంఖ్యలో చేరుకుని ఆందోళన చేశారు. దుండగులను అరెస్టు చేయాలని ఇన్నర్‌ రింగురోడ్డుపై బైఠాయించారు. గోరక్షక్‌ సమితి ప్రతినిధి కొలిశెట్టి శివకుమార్‌, బీజేపీ అర్బన్‌, రూరల్‌ జిల్లాల అధ్యక్షులు నర్సింహారెడ్డి, రంగారెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనలో పాల్గొన్నారు. ఉన్నతాధికారులు సిబ్బందితో అక్కడకు చేరుకుని రాత్రి 12 ప్రాంతంలో ఆందోళనకారులను చెదరగొట్టి పలువురిని అరెస్ట్‌ చేశారు.

Read more