గోల్‌మాల్‌ కేరాఫ్‌ ఉపాధి హామీ

ABN , First Publish Date - 2022-08-11T07:39:00+05:30 IST

కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులకు నిబంధనల గండం వచ్చిపడింది.

గోల్‌మాల్‌ కేరాఫ్‌ ఉపాధి హామీ

నిబంధనలకు నీళ్లు.. చెరువుల్లో పూడికతీతతో లాభమెంతో చెప్పరు

వర్క్‌ ఆర్డర్‌ లేకుండానే పనులు.. ఒకే పనిని ముక్కలుగా చేసి అనుమతులు

సీసీ రోడ్లు కాంట్రాక్టులకిచ్చి చేయిస్తారు.. 40ు దాటుతున్న మెటీరియల్‌ ఖర్చు 

5 జిల్లాల్లోని 12 గ్రామాల్లో పరిస్థితిది.. 47 పనుల్లో ఏదీ సవ్యంగా లేదు

ఖర్చు పెట్టిందంతా రికవరీ పెట్టండి.. అధికారులపై చర్యలు తీసుకోండి

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశం.. ఇరు ప్రభుత్వాల మధ్య మరో చిచ్చు?


హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులకు నిబంధనల గండం వచ్చిపడింది. తెలంగాణలో ఉపాధి హామీ పనులు నిబంధనల ప్రకారం జరగడం లేదని గత జూన్‌ నెలలో రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ప్రతినిధి బృందం తేల్చింది. ఈ బృందం ఐదు జిల్లాల్లోని 12 గ్రామాల్లో నాలుగు రోజుల పాటు పర్యటించి 47 పనులను పరిశీలించింది. 77 పేజీల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతీ చెరువులో ఏటా పూడిక తీస్తున్నారని, పని జరగక ముందు ఎలా ఉండేది? జరిగిన తర్వాత ఎంత అభివృద్ధి చోటు చేసుకుంది? అనే లెక్కలు వేయడం లేదని, దాంతో చెరువుల్లో జరిగే పూడిక పనులు అవినీతిగానే భావిస్తున్నామని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇక చెరువు పూడిక పనులు చేయొద్దని ఆదేశించారు. ఈ పనులకు సంబంధించి ఆడిటింగ్‌, విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై తక్షణ చర్యలు చేపట్టి పూర్తి నివేదికను సమర్పించాలని చెప్పారు. పక్కదారి పట్టించిన నిధులను వసూలు చేయాలని కేంద్రం రాష్ట్రానికి నిర్దేశించింది. కేంద్ర బృందం కామారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, జనగాం, హన్మకొండ జిల్లాల్లో జూన్‌ 9 నుంచి 12 వరకు పర్యటించింది. వర్క్‌ ఆర్డర్లు ఇవ్వకుండానే పనులు చేయించారని, ఉపాధి హామీ చట్టం నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ల ద్వారా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారని గుర్తించింది. కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టిన పనుల నిధులను వెనక్కి రాబట్టాలని ఆదేశించింది. గ్రామాల్లో కల్లాల ఏర్పాటు, మొక్కలకు ట్రీగార్డుల ఏర్పాటు ఉపాధి హామీ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ఎవరి అనుమతితో ఈ పనులు చేపట్టారో చెప్పాలని నిలదీసింది. ఆ పనులకు ఖర్చు చేసిన మొత్తాన్ని అధికారుల నుంచి కక్కించాలని ఆదేశించింది.


అధికారుల పర్యటనలో సీసీరోడ్లు, రోడ్డు పక్కన నాటినమొక్కలు, వైకుంఠ ధామాలు, హార్టికల్చర్‌ ప్లాంటేషన్లు, చెరువుల పూడికతీత, నర్సరీలు, కంపోస్టు తయారీ, పంచాయతీ భవనాల నిర్మాణాలు, ధాన్యం ఆరబోసే కల్లాల నిర్మాణాలు తదితర పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టినట్లు గుర్తించారు. వీటిలో చాలావరకు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినట్లు తేల్చి నివేదిక ఇవ్వడంతో కేంద్రం ఈ నిధుల రికవరీకి ఆదేశించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే అంశమే. ఇప్పటికే ధాన్యం సేకరణ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉప్పు నిప్పు పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు కీలకమైన ఉపాధి హామీ నిధులకు కూడా కేంద్రం కొర్రీలు వేయడంతో భవిష్యత్తులో ఈ అంశంపైనా ప్రభుత్వాల మధ్య యుద్ధం తప్పదని భావిస్తున్నారు.   


మెటీరియల్‌కు ఎక్కువ ఖర్చు పెట్టారు

కామారెడ్డి జిల్లా ఐలాపూర్‌లోని ఊర చెరువును పలుమార్లు తవ్వారు. ఒకేసారి కాకుండా నాలుగు ముక్కలుగా ప్రతిపాదనలు చేశారు. 2020-21లో ఏకకాలంలో మూడు ముక్కల పనులు చేయించారు. పై అధికారుల వరకు వెళ్లకుండా కింది స్థాయిలోనే ఆమోదం పొందేందుకు పనిని మూడు ముక్కలు చేసి, రూ.30.96 లక్షలు ఖర్చు చేశారు.  నాలుగు ముక్కలకు కలిపి 40.89 లక్షలు చెల్లించారు. నిధుల్లో 60% కూలీల వేతనాలకు, 40% మెటీరియల్‌కు ఖర్చు చేసి పథకం ఉద్దేశాన్ని పక్కదారి పట్టించినట్లు తేల్చారు.  అదే గ్రామంలో మొక్కలు నాటడం, ట్రీగార్డుల ఏర్పాటుకు వెచ్చించిన రూ.4.25 లక్షలను తిరిగి చెల్లించాలని ఆదేశించారు. మాచరెడ్డిలో గుట్టలపై కాకుండా మైదాన ప్రాంతాల్లో కందకాలు తవ్వి నిధులు వృథా చేశారని, రూ.34.11 లక్షలు రికవరీ చేయాలని, సంబంధిత అధికారిపై చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. 

ఫ నల్గొండ జిల్లా రహ్మత్‌పూర్‌లో చెరువు పూడిక పనులు నిలిపేసి రూ.2.05 లక్షలు రికవరీ చేయాలని ఆదేశించారు. పోచంపల్లి చెరువు పూడికతీతకు సంబంధించి రూ.6.79 లక్షలు తిరిగి చెల్లించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా మునిగిపల్లిలో చెరువు పూడికతీతకు వెచ్చించిన రూ.7.88 లక్షలు, కల్లం కోసం పెట్టిన 1.7 లక్షలు, మొక్కలు, ట్రీగార్డులకు పెట్టిన రూ.9.36 లక్షలు రికవరీ చేయాలని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చౌటపల్లి చెరువు పూడిక పనులు ఆపి, రూ.6.98 లక్షలు రికవరీ చేయాలని, నాగిలిగొండలో కల్లం కోసం వెచ్చించిన రూ.1.41 లక్షలు రికవరీ చేయాలని సూచించారు.


హన్మకొండ జిల్లా కరుణాపురంలో ఫామ్‌ పాండ్‌కు వెచ్చించిన రూ.3.34 లక్షల రికవరీకి ఆదేశించారు. జనగాం జిల్లా దర్దపల్లిలో చెరువుకు పెట్టిన 1.26 లక్షలు, కాంట్రాక్టర్‌ ద్వారా నిర్మించిన సీసీ రోడ్డు వ్యయం రూ.19.95 లక్షలు, కల్లం వ్యయం రూ.1.69 లక్షలు రికవరీ చేయాలన్నారు. అధికారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. ధర్మపురం చెరువుకు ఖర్చు చేసిన రూ.10.46 లక్షలు, వర్క్‌ ఆర్డరు లేకుండానే కాంట్రాక్టర్‌ ద్వారా సీసీ రోడ్డు నిర్మాణానికి వెచ్చించిన రూ.24 లక్షలు, ట్రీగార్డులకు పెట్టిన రూ.8.66 లక్షల రికవరీకి ఆదేశించారు. దేవరుప్పల చెరువుకు ఖర్చు చేసిన రూ.6.24 లక్షలు, కల్లానికి పెట్టిన రూ.1.86 లక్షల రికవరీ చేయాలని నిర్దేశించారు. 

Read more