వణుకుడు సమస్యకు సరికొత్త చికిత్స

ABN , First Publish Date - 2022-03-23T08:44:59+05:30 IST

ప్రపంచంలోనే తొలిసారిగా..

వణుకుడు సమస్యకు సరికొత్త చికిత్స

ప్రపంచంలోనే తొలిసారిగా కిమ్స్‌లో ఆటో గైడ్‌ విధానంలో డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ సర్జరీ

హైదరాబాద్‌ సిటీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే తొలిసారిగా.. ఆటోగైడ్‌ పద్ధతిలో డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యూలేషన్‌ (డీబీఎస్‌) శస్త్ర చికిత్సను కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు నిర్వహించారు. పార్కిన్సన్‌ వ్యాధి తరహా లక్షణాలతో బాధపడుతున్న యువకుడికి ఊరట కల్పించారు. హైదరాబాద్‌కు చెందిన అభినయ్‌ (32) అనే యువకుడికి ఆరేళ్ల క్రితం కుడి చేతిలో వణుకు మొదలైంది. క్రమంగా ఆ వణుకు బాగా పెరిగి.. టీకప్పు కూడా చేతిలో పట్టుకోలేనంతగా ముదిరింది. చివరకు నడవలేని పరిస్థితుల్లో ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. కిమ్స్‌ ఆస్పత్రిలో న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ మానస్‌ పాణిగ్రాహిని సంప్రదించగా.. అతని మెదడులో ఉన్న సమస్యను సరిచేయడానికి డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ సర్జరీ చేయాలని చెప్పారు. ఈ సర్జరీ చేసేటప్పుడు.. మెదడులో ఈ సమస్యకు కారణమైన నిర్ణీత భాగాన్ని వైద్యుడే కచ్చితత్వంతో గుర్తించి, ఆ ప్రాంతంలో సూక్ష్మ ఎలకోట్ర్డుల ద్వారా విద్యుత్తు ప్రేరేపణ కలిగిస్తాడు. ఏ మాత్రం తేడా వచ్చినా విపరిణామాలుంటాయి. ఈ సర్జరీల్లో కచ్చితత్వం సాధారణంగా 0.8 మిల్లీమీటర్ల నుంచి 1.2 మిల్లీమీటర్ల దాకా ఉంటుంది. కానీ, తొలిసారి.. కిమ్స్‌ వైద్యులు కృత్రిమ మేధ సాయంతో స్టెల్త్‌ ఆటోగైడ్‌ రోబో ద్వారా 0.2 మిల్లీమీటర్ల కచ్చితత్వంతో ఈ సర్జరీ చేయగలిగారు.  మెదడులో గుర్తించడం, ఇతర భాగాలకు  ఇబ్బందులు ఏర్పడకుండా ఆ భాగానికి సురక్షితంగా వెళ్లే మార్గాన్ని నిర్ణయించడం వంటి పనులన్నీ ఆటోగైడ్‌ రోబో  నిర్వహించింది.   

Read more