గోదావరి వరదకు పగ్గాలు

ABN , First Publish Date - 2022-09-08T08:33:03+05:30 IST

గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతుండటం... వరదతో మునుపటికన్నా నష్టం తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది.

గోదావరి వరదకు పగ్గాలు

భద్రాచలం వెంట కరకట్టలు, రక్షణ చర్యలు

16 వేల కుటుంబాలకు సురక్షిత ఇళ్లు 

మొత్తం రూ.1000 కోట్ల కేటాయింపు!

హైదరాబాద్‌, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతుండటం... వరదతో మునుపటికన్నా నష్టం తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది.   భద్రాచలం పరిసర ప్రాంతాల్లో గోదావరి వెంట 40 కిలోమీటర్ల దాకా వరద ముప్పు ఉందని, కేవలం 7.5 కిలోమీటర్ల మేరకే కరకట్టలు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం.. వెనువెంటనే కీలకమైన ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ప్రధానంగా ఏపీలో విలీనమైన ఏటపాక వద్ద కరకట్టలు లేకపోవడంతో గోదావరి వరద తో భద్రాచలంతో పాటు పరిసర ప్రాంతాలు నీటమునిగాయి. 102 గ్రామాలు వరద ముప్పున ఉన్నాయని తేల్చారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో బుధవారం సీఎంవో కార్యదర్శి (నీటిపారుదల) స్మితాసభర్వాల్‌ జలసౌధలో అధికారులతో సమావేశమయ్యారు.


ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ(జనరల్‌) సి.మురళీధర్‌, ఈఎన్‌సీ(ఓ అండ్‌ ఎం) నాగేంద్రరావుతో ఆమె సమీక్ష నిర్వహించారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో వరదతో పాటు స్థానికంగా ప్రవహించే నదులపై అధ్యయనం చేసి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను సిద్ధం చేయాలని ఆదేశించారు.  తాజాగా గోదావరికి 24.50 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో అశ్వాపురం, భద్రాచలం, బూర్గం పహాడ్‌, దుమ్ముగూడెం, పినపాక 102 గ్రామాల్లో, 16 వేల ఇళ్లు నీటమునిగాయని అధికారులు వివరించగా... సురక్షితంగా ఉండేలా 16 వేల ఇళ్లు నిర్మించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.  భద్రాచలం వద్ద వరద నివారణ, పునర్నిర్మాణం వంటి చర్యలకు రూ.1000 కోట్లు కేటాయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ నిధులతో పనులను చేపట్టాలన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులను 2023 మార్చి కల్లా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని స్మితాసభర్వాల్‌ ఆదేశించారు. కాంట్రాక్టర్లు, అధికారులతో పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. వాస్తవానికి సీఎం ఆదేశాలతో సీతారామ ప్రాజెక్టు ఏరియల్‌ సర్వే చేయాల్సి ఉండగా... వాతావరణం అనుకూలించకపోవడంతో జలసౌధలో సీతారామపై సమీక్ష చేపట్టారు.


Updated Date - 2022-09-08T08:33:03+05:30 IST