ఉచితాలకు కళ్లెం!

ABN , First Publish Date - 2022-10-05T08:42:55+05:30 IST

ఆర్థిక వ్యవస్థపైనా, ఎన్నికల ఫలితాలపైనా పెనుప్రభావం చూపుతున్న ప్రజాకర్షక పథకాలు, శుష్క వాగ్దానాలకు కళ్లెం వేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలకమైన ముందడుగు వేసింది.

ఉచితాలకు కళ్లెం!

హామీలు ఎలా అమలు చేస్తారు?.. పార్టీలకు ఎన్నికల కమిషన్‌ ప్రశ్న

వాటికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు..?

మరిన్ని అప్పులు చేస్తారా..?

ఆర్థిక స్థిరత్వంపై తాయిలాల ప్రభావమెంత?

ముందుగానే ప్రొఫార్మా సమర్పించాలి

ఎన్నికల కోడ్‌లో సవరణకు ఈసీ ప్రతిపాదన

18లోగా అభిప్రాయాలు చెప్పండి

గుర్తింపు పొందిన పార్టీలన్నిటికీ లేఖ

ఆర్థిక పరిస్థితిపై సీఎస్‌లు, కేంద్ర ప్రభుత్వం

సమాచారమివ్వాలని సూచన

ఆ పరిమితులకు లోబడే.. 

హామీలు ఉండాలని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక వ్యవస్థపైనా, ఎన్నికల ఫలితాలపైనా పెనుప్రభావం చూపుతున్న ప్రజాకర్షక పథకాలు, శుష్క వాగ్దానాలకు కళ్లెం వేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలకమైన ముందడుగు వేసింది. వీటిని ఎలాగైనా నియంత్రించాలని సుప్రీంకోర్టు మొదలుకొని మేధావుల వరకు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో తాను మౌన ప్రేక్షక పాత్ర పోషించరాదని భావిస్తోంది. ఇలాంటి వాగ్దానాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌-ఎంసీసీ)ని సవరించాలని నిర్ణయించింది. దీనిప్రకారం.. ఇచ్చే ‘ఉచిత’ హామీలను ఎలా అమలు చేస్తారు.. ఇందుకు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి.. అన్నిటికీ మించి అందుకు ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుతారు..


ఆర్థిక రంగంపై వాటి అమలు ప్రభావం.. మొదలైన అంశాలను రాజకీయ పార్టీలు ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. నిర్దిష్ట వివరాలతో కూడిన ప్రామాణిక ప్రొఫార్మాను కమిషన్‌కు సమర్పించాలని ప్రతిపాదించింది. ప్రతిపాదిత సవరణలపై ఈ నెల 18వ తేదీలోపు తమ తమ అభిప్రాయాలను తెలియజేయాలని గుర్తింపు పొందిన అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఈసీ మంగళవారం లేఖ రాసింది.  వ్యవసాయ రుణాలను రద్దు చేస్తామని హామీ ఇస్తే.. ఇది రైతులందరికీ వర్తిస్తుందా.. లేక కేవలం చిన్న, మధ్యతరహా రైతులకే రద్దుచేస్తారా.. వాటికి నిధులు ఎక్కడ నుంచి సమకూరుస్తారు.. అభివృద్ది వ్యయంలో ఎంత మేరకు కేటాయిస్తారో పార్టీలు వివరించాల్సి ఉంటుందని కమిషన్‌ వర్గాలు తెలిపాయి. ‘ప్రస్తుత  ఎన్నికల కోడ్‌లోని మార్గదర్శకాల ప్రకారం ఉచిత హామీల హేతుబద్ధత, వాటికి ఎలా నిధులు సమకూర్చుతారో పార్టీలు డిక్లరేషన్‌ ఇస్తున్నాయి. అయితే ఈ డిక్లరేషన్లు మొక్కుబడిగా, అస్పష్టంగా ఉంటున్నాయి. ఓటర్లు ఆకళింపు చేసుకుని ఎవరిని ఎన్నుకోవాలో నిర్ణయించుకునేందుకు అవసరమైన సమాచారం వాటిలో ఉండడం లేదు.


కొన్ని ఉచిత హామీలు, తాయిలాలు స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణను ప్రభావితం చేస్తున్నాయి. ఎన్నికల సమరంలో పార్టీలు, అభ్యర్థులకు సమాన అవకాశాల కల్పనపైనా వీటి ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై కమిషన్‌ మౌనముద్ర వహించరాదని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌, ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండేలతో కూడిన కమిషన్‌ నిర్ణయించింది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.


ఆర్థిక పర్యవసానాలు చెప్పాలి..

మేనిఫెస్టోల రూపకల్పన హక్కు రాజకీయ పార్టీలకు ఉందని కమిషన్‌ సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే కొన్ని హామీలు, తాయిలాల వల్ల తలెత్తే అవాంఛనీయ ప్రభావాన్ని పట్టించుకోకుండా ఉండలేమని తేల్చిచెప్పింది. ఉచిత హామీల ద్వారా ఏ విధంగా మార్పులు తీసుకొస్తామో పార్టీలు విధిగా తెలియజేయాల్సి ఉంటుందని తెలిపింది. వాటి వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక విపరిణామాలు ఎలాంటివో ఓటర్లు ముందుగానే అధికారికంగా తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. అందుకే ప్రతిపాదిత ప్రామాణిక ప్రొఫార్మాపై అభిప్రాయాలు చెప్పాలని గుర్తింపు పొందిన పార్టీలన్నిటినీ కోరినట్లు వెల్లడించింది. ‘సంపూర్ణ వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను సమర్పించడం తప్పనిసరి చేస్తే.. సదరు హామీల వల్ల సమీప భవిష్యత్‌లో, దీర్ఘకాలికంగా ఆర్థిక సుస్థిరత ఏ మేరకు ప్రభావితమవుతుందనే అంశంపై ఆరోగ్యకరమైన చర్చకు ఆస్కారం ఉంటుంది.


స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎ న్నికల నిర్వహణకు ఇది అవసరం కూడా. సదరు ఉచిత హామీల అమలుకు ఆదాయం ఎలా సమకూర్చుకుంటారు.. అదనపు పన్నులు వేస్తారా.. వేస్తే ఎలాంటివి? వ్యయాన్ని హేతుబద్ధీకరిస్తారా? ఇందుకోసం కొన్ని పథకాలకు కోతపెడతారా? ఆహామీలు అమలు చేస్తే ఇప్పటికే తీసుకున్న అప్పుల చెల్లింపులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..? మరిన్ని అప్పులు తెస్తారా? ద్రవ్య జవాబుదారీ-బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితిపై దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది.. ఇలాంటివన్నీ పార్టీలు ప్రామాణిక ప్రొఫార్మాలో తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ఉచిత హామీల అమలు ఎవరికి వర్తిస్తుం ది.. కొన్ని వర్గాలు.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) కుటుంబాలకేనా.. అందరికీ వర్తిస్తుందా? మొత్తంగా ఎంత మందికి వర్తిస్తుంది..? ఎంత ఖర్చవుతుంది..? అందుబాటులో ఉన్న నిధులెన్ని..? అదనపు వ్యయం కోసం వనరులు సమకూర్చుకోవడానికి అనుసరించే మార్గాలేమిటి.. రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక సుస్థిరత.. ఇవన్నీ ప్రొఫార్మాలో పొందుపరచాలి.


అలాగే  ఆర్థిక పరిస్థితి సమాచారాన్ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ఆర్థిక కార్యదర్శి తప్పనిసరిగా బహిర్గతం చేయాలి. వారు పేర్కొన్న ఆర్థిక పరిమితుల ఆధారంగానే పార్టీలు తమ హామీల అమలు ప్రామాణికతపై నివేదించాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేసింది. ఈ నెల 18లోపు ఎలాంటి స్పందనా లేకపోతే.. ఈ విషయంపై చెప్పడానికి సదరు పార్టీల వద్ద ఏమీ లేదని భావించాల్సి ఉంటుందని కమిషన్‌ పేర్కొంది.


‘రూ.2వేలు ఉన్న పెన్షన్‌ను మూడు వేలు చేస్తాం’ అని మేనిఫెస్టోలో చెబుతారు. దానిని నమ్మిన జనం ఓట్లు వేసి గెలిపించాక... ‘నాలుగు విడతల్లో పెంచుతూ పోతాం’ అని మెలిక పెడతారు.

‘అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాం’ అని ప్రకటిస్తారు. రైతులు ఓట్లు వేసి అధికారం అప్పగించిన తర్వాత... సవాలక్ష నిబంధనలతో వడపోతలు మొదలు పెడతారు.

ఎన్నికల కమిషన్‌ తాజాగా రూపొందించిన నిబంధనలే అమలులోకివస్తే.... ఇలాంటి అస్పష్ట హామీలకు కాలం చెల్లినట్లే. ‘ఒక హామీ ఇస్తే’... అది ఎవరికి, ఎలా అమలు చేస్తామో పార్టీలో చెప్పి తీరాల్సిందే! హామీల అమలుకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా సహకరిస్తుందో చెప్పాలని పార్టీలను ఈసీ ఇది వరకే ఆదేశించింది. ఇప్పుడు అవే నిబంధనలను మరింత విస్తృతంగా, విస్పష్టంగా రూపొందించింది.

Read more