కస్తూర్బాలో బాలిక మృతి

ABN , First Publish Date - 2022-09-08T09:16:05+05:30 IST

సరైన సమయంలో చికిత్స లభించి ఉంటే ఆ బాలిక ప్రాణాలు నిలిచేవా? సిబ్బంది పర్యవేక్షణ లోపమే మృతికి కారణమా? ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని మృతిచెందడంతో ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కస్తూర్బాలో బాలిక మృతి

  • తలనొప్పిగా ఉందంటూ స్నేహితులకు చెప్పి నిద్రలోకి
  • ఉదయం నోట్లో నుంచి నురగలు... ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 7: సరైన సమయంలో చికిత్స లభించి ఉంటే ఆ బాలిక ప్రాణాలు నిలిచేవా? సిబ్బంది పర్యవేక్షణ లోపమే మృతికి కారణమా? ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని మృతిచెందడంతో ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ గురుకులంలో ఎనిమిదో తరగతి చదువుతున్న నాగోసే ఐశ్వర్య (13) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. తనకు తలనొప్పిగా ఉందంటూ ఐశ్వర్య సోమవారం రాత్రి సహచర విద్యార్థులకు చెప్పి పడుకుంది. మరుసటి రోజు ఉదయం ఆమె ఎంతకూ నిద్రలేవకపోవడంతో పక్కనున్న విద్యార్థులు లేపారు. ఆమె ముక్కులోంచి నురగ వస్తుండటంతో సిబ్బంది వచ్చి వైద్యం చేశారు.


 అనంతరం మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యుడు తెలిపారు. కాగా చిన్నారి మృతిపై తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు బుధవారం పాఠశాల ఎదుట నాలుగు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటలకు అదనపు కలెక్టర్‌ రాజేశం ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారుల డిమాండ్‌ మేరకు ఎస్‌వో స్వప్న, ఏఎన్‌ఎం భారతి, రాత్రి డ్యూటీలో ఉన్న టీచర్‌ శ్రీలతను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థిని కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. నష్టం పరిహారం కింద రూ.15లక్షలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. 

Updated Date - 2022-09-08T09:16:05+05:30 IST