అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలు

ABN , First Publish Date - 2022-10-14T09:21:55+05:30 IST

సమాజంలోని అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందడంలో జియోస్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలు

జియోస్పేషియల్‌ సదస్సులో గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 


హైదరాబాద్‌, అక్టోబరు 13: సమాజంలోని అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందడంలో జియోస్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు అన్ని రంగాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు. ఐక్యరాజ్యసమితి, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నాలు గు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ జియోస్పేషియల్‌ సదస్సు ముగింపు వేడుకల్లో ఆమె  ప్ర సంగించారు. ప్రపంచ దేశాలు మరింత పురోగతి సాధించేందుకు, గిరిజనులతో పాటు సమాజంలో ని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఈ టెక్నాలజీ ఉపయోగపడతుందని తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు. అమృతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా అంతర్జాతీయ సదస్సుకు భారత్‌ వేదిక కావడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వైద్యం, ఉన్నత విద్య, పర్యావరణం, మౌలిక వసతులు, రక్షణతో పాటు మానవాళి వికాసానికి అవసరమైన అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు ఈ టెక్నాలజీ తోడ్పడుతుందన్నారు. స్మార్ట్‌ సిటీలు, నమామి గంగ, జలజీవన్‌ మిషన్‌తో పాటు డిజిటల్‌ ఇండియా సాధనకు జియోస్పేషియల్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుందని తెలిపారు. పర్యాటక రంగ  పురోగతికి, వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఈ టెక్నాలజీ దోహదపడుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జియోస్పేషియల్‌ శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీని మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు సదస్సులో ఫ లవంతమైన చర్చలు జరిపారని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్‌ చెప్పారు. వందకు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముగింపు వేడుకల్లో ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టీఫాన్‌, జియోస్పేషియల్‌ కాంగ్రెస్‌ అడ్వయిజరీ కమిటీ సారథి టిమ్‌ ట్రైనర్‌, సర్వే జనరల్‌ ఆఫ్‌ ఇండియా సునీల్‌ కుమార్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖ కార్యదర్శి అజయ్‌ తదితరులు మాట్లాడారు. 

Read more