మక్తల్‌ నుంచి మద్నూర్‌ వరకు..!

ABN , First Publish Date - 2022-10-02T10:13:55+05:30 IST

భారత్‌ జోడో కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో 375 కిలోమీటర్ల మేర రాహుల్‌ గాంధీ పాదయాత్రకు టీపీసీసీ ప్రణాళికను సిద్ధం చేసింది.

మక్తల్‌ నుంచి మద్నూర్‌ వరకు..!

తెలంగాణలో 375 కి.మీ. రాహుల్‌ పాదయాత్ర

హైదరాబాద్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): భారత్‌ జోడో కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో 375 కిలోమీటర్ల మేర రాహుల్‌ గాంధీ పాదయాత్రకు టీపీసీసీ ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రూట్‌ మ్యాప్‌నూ రూపొందించింది. దీనికి అనుగుణంగా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ డీజీపీ మహేందర్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు కోరారు. డీజీపీ కార్యాలయంలో శనివారం ఆయనను కలిసిన వారు.. రాహుల్‌ పాదయాత్ర ప్రతిపాదిత రూట్‌ మ్యాప్‌ను, అనుమతి కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ప్రతిపాదిత రూట్‌ మ్యాప్‌ ప్రకారం రాహుల్‌ గాంధీ.. కర్ణాటకలోని రాయచూర్‌ నుంచి కృష్ణా నది దాటి మక్తల్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. అక్టోబరు 24న తెలంగాణలోకి ప్రవేశించనున్న ఆయన.. సుమారు 15 రోజుల పాటు పాదయాత్ర చేస్తారు. మక్తల్‌, దేవరకొండ, మహబూబ్‌నగర్‌ టౌన్‌, జడ్చర్ల, షాద్‌ నగర్‌, శంషాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ పాతబస్తీలోకి ప్రవేశిస్తారు. ఆరాంఘర్‌, చార్మినార్‌, అఫ్జల్‌గంజ్‌, మొజాంజాహీ మార్కెట్‌, గాంధీభవన్‌, నాంపల్లి దర్గా, విజయ్‌నగర్‌ కాలనీ, పెన్షన్‌ ఆఫీసు, నాగార్జున సర్కిల్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, పటాన్‌చెరు వరకు, ఆ తర్వాత ముత్తంగి వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా పాదయాత్ర చేస్తారు. అక్కడి నుంచి సంగారెడ్డి క్రాస్‌ రోడ్స్‌, జోగిపేట, శంకరంపేట్‌, మద్నూర్‌ల మీదుగా మహారాష్ట్రలోకి రాహుల్‌ ప్రవేశిస్తారు. 


రూట్‌ మ్యాప్‌ను పరిశీలించిన మహారాష్ట్ర బృందం 

 టీపీసీసీ ప్రతిపాదిత రూట్‌ మ్యాప్‌ను మహారాష్ట్ర సీఎల్పీ నేత బాలాసాహెబ్‌ థోరట్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృదం శనివారం పరిశీలించింది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ నివాసంలో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్‌ తదితర నేతలతో ఈ బృందం సమావేశమై.. రూట్‌ మ్యాప్‌పై చర్చించింది. అనంతరం మీడియాతో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్‌ యాత్ర తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ప్రవేశించనుందని, ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పార్టీ నేతలతో సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నామని తెలిపారు. కర్ణాటకలోనూ మహారాష్ట్ర, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పర్యటించాలన్న అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 

 

ఎస్టీలకు న్యాయం చేయాలి: జీవన్‌ రెడ్డి 

రాష్ట్రంలోని గిరిజనులకు జనాభా ప్రాతిపథికన రిజర్వేషన్‌ను అమలు చేయాలంటూ 2017లోనే శాసనసభలో ప్రతిపాదించానని, అప్పుడే అమలు చేయకపోవడంతో ఐదేళ్లుగా విద్య, ఉద్యోగాల్లో 4 శాతం మేరకు రిజర్వేషన్‌ను వారు నష్ట పోయారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఈ ఐదేళ్లుగా గిరిజనులు నష్టపోయిన 4శాతం రిజర్వేషన్‌ మేరకు సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించి వారికి తగిన న్యాయం చేయాలన్నారు.  


నేడు బోయినిపల్లిలో గాంధీ జయంతి 

మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం బోయినిపల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో టీపీసీసీ వేడుకలను నిర్వహిస్తోంది. రేవంత్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. గాంధీభవన్‌లో గాంధీ చిత్రపటానికి, లాల్‌ బహుదూర్‌ శాస్త్ర జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కాంగ్రెస్‌ నేతలు నివాళిని అర్పించనున్నారు. 


యాత్రలో అంతా భాగస్వాములు కావాలి: రేవంత్‌రెడ్డి 

తెలంగాణలో రాహుల్‌ గాంధీ నిర్వహించే పాదయాత్రలో ప్రజాసంఘాలు, సోషలిస్టు పార్టీల నాయకులు సహా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. డీజీపీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని డీజీపీని కోరామని, దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. Read more