రేపటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2022-10-05T09:30:53+05:30 IST

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసే బియ్యాన్ని ఈ నెల ఆరో తేదీ (గురువారం) నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది.

రేపటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసే బియ్యాన్ని ఈ నెల ఆరో తేదీ (గురువారం) నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. గతంలో మాదిరిగానే ఈ నెలలో కూడా ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని పొడిగిస్తారనే సమాచారం లేకపోవటంతో 5 కిలోల చొప్పున పంపిణీ చేయాలని డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఆదేశాలు జారీచేసింది. కానీ పీఎంజీకేఏవై పథకాన్ని మరో మూడు నెలలపాటు కేంద్రం పొడిగించింది. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో కూడా ఆహార భద్రత కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో ఉచిత బియ్యం పంపిణీ చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కేంద్రమిచ్చే 5 కిలోలు, రాష్ట్రమిచ్చే 5 కిలోలు కలిపి మొత్తం 10 కిలోల చొప్పున వినియోగదారులకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బతుకమ్మ, దసరా పండుగలకు ముందుగానే, రెగ్యులర్‌ షెడ్యూలు ప్రకారం ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తుందని పేద ప్రజలు ఎదురుచూశారు. కానీ పండుగ తర్వాత పంపిణీ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్‌ జారీచేయటంతో నిరాశకు గురయ్యారు. ఐదో తేదీన దసరా పండుగ పూర్తయిన తర్వాత... ఆరో తేదీ నుంచి రాష్ట్రంలో బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది.

Read more