పాలిటెక్నిక్‌ పేపర్‌ లీకేజీలో నలుగురి అరెస్టు

ABN , First Publish Date - 2022-02-16T08:28:48+05:30 IST

పాలిటెక్నిక్‌ చివరి సంవత్సరం ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడిన నలుగురు నిందితులను అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు.

పాలిటెక్నిక్‌ పేపర్‌ లీకేజీలో నలుగురి అరెస్టు

అబ్దుల్లాపూర్‌మెట్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ చివరి సంవత్సరం ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడిన నలుగురు నిందితులను అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, డీవీఆర్‌, రిజిస్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 8, 9న పాలిటెక్నిక్‌ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షల సందర్భంగా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం పరిధిలోని స్వాతి ఇంజనీరింగ్‌ కళాశాలలో పరీక్ష ప్రారంభానికి 20 నిమిషాల ముందుగానే పేపర్లు లీకయ్యాయి. దీన్ని డిప్లొమా బోర్డు అధికారులు గుర్తించి విచారణ చేపట్టారు. ఆ మేరకు స్వాతి కళాశాల సూపరింటెండెంట్‌ సముద్రాల వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ గిద్ద కృష్ణమూర్తి, లెక్చరర్‌ కృష్ణమోహన్‌ల ఫోన్‌ వాట్సప్‌ ద్వారా పరీక్ష పత్రాలు లీకైనట్లు గుర్తించారు. కళాశాలకు గుర్తింపు రావాలని, ఉత్తీర్ణత పెరగాలనే అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో కళాశాల సిబ్బంది ఒప్పుకొన్నారు. ఆ మేరకు పరీక్షల పరిశీలకుడిగా వచ్చిన మందా వెంకట్‌రామ్‌రెడ్డితో చేతులు కలిపి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయా తేదీల్లో జరగనున్న పరీక్షల రోజు ఆలస్యంగా కళాశాలకు రావాలని కళాశాల ఉద్యోగులు పరిశీలకుడితో మాట్లాడుకున్నారు. ఇలా 20 నిమిషాల ముందుగానే ప్రశ్న పత్రాలను కృష్ణమూర్తి, కృష్ణమోహన్‌ కళాశాల విద్యార్థులకు ఫోన్‌ వాట్సాప్స్‌ ద్వారా పంపించారు. తర్వాత ఇతర కళాశాల విద్యార్థులకు కూడా లీక్‌ చేశారు.

Read more