చంద్రబాబు కుటుంబంపై అసభ్య పోస్టులు

ABN , First Publish Date - 2022-09-30T08:49:22+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబసభ్యులపై సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టు పెట్టిన వైసీపీ కార్యకర్తకు ఖమ్మం తెలుగు యువత నాయకులు దేహశుద్ధి చేశారు.

చంద్రబాబు కుటుంబంపై అసభ్య పోస్టులు

వైసీపీ కార్యకర్తకు ఖమ్మం తెలుగుయువత దేహశుద్ధి

ఖమ్మం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబసభ్యులపై సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టు పెట్టిన వైసీపీ కార్యకర్తకు ఖమ్మం తెలుగు యువత నాయకులు దేహశుద్ధి చేశారు. ఏపీలోని కృష్ణాజిల్లా ఘంటసాల ప్రాంతానికి చెందిన వైసీపీ కార్యకర్త కోదాటి నర్సింహ.. తన అత్తగారి స్వస్థలమైన ఖమ్మం నగరంలోని టేకులపల్లి కాలనీలో నివాసముంటున్నాడు. ఆర్‌ఎంపీగా పనిచేసే నర్సింహ.. తరచూ తన స్వగ్రామానికి వెళ్లి అక్కడ వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం చంద్రబాబు కుటుంబంపై సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా ఒక పోస్టు పెట్టాడు. విషయం తెలుసుకున్న ఖమ్మం తెలుగు యువత నాయకులు.. అతడికి ఫోన్‌ చేసి ఎందుకు పెట్టావని ప్రశ్నించగా.. దురుసుగా సమాధానమిచ్చాడు. దీంతో కోపోద్రిక్తులైన తెలుగుయువత గురువారం ఉదయం ముస్తఫానగర్‌లో ఉన్న నర్సింహను కలిసి.. పోస్టింగ్‌ పెట్టినందుకు క్షమాపణ చెప్పాలని కోరారు. అప్పుడు కూడా నర్సింహ అగౌరవంగా మాట్లాడడంతో టీడీపీ ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యదర్శి కేతినేని హరీ్‌షతో పాటు టీడీపీ, తెలుగుయువత నాయకులు నల్లమల రంజిత్‌, నున్నా నవీన్‌చౌదరి, వక్కంతుల వంశీ తదితరులు అతడికి దేహశుద్ధి చేశారు. దీంతో నర్సింహ అక్కడినుంచి పరారయ్యాడు. ఈ విషయంపై ఖమ్మం టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, ఆయన కుటుంబంపై ఎవరైనా తప్పుడు పోస్టింగ్‌లు పెడితే తెలంగాణ టీడీపీ నాయకులు ఊరుకోబోరని హెచ్చరించారు. తప్పుడు పోస్టింగ్‌లు పెట్టిన వారిపైనా, అతడిని సమర్థించిన వారిపైనా పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read more