కుటుంబ పాలన అంతానికి గూండాయిజం రజాకార్లలా మంత్రులు..

ABN , First Publish Date - 2022-08-15T09:21:54+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనను తరిమికొట్టేందుకు అవసరమైతే గూండాయిజం కూడా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

కుటుంబ పాలన అంతానికి గూండాయిజం రజాకార్లలా మంత్రులు..

తెలంగాణలో దేశభక్తుల రాజ్యం రావాలి

ఈడీని వాడితే.. కేసీఆర్‌ను ఎప్పుడో లోపలేసేవాళ్లం

వెంకట్‌రెడ్డి టచ్‌లో ఉన్నారనలేదు: సంజయ్‌


మోత్కూరు/గుండాల/హైదరాబాద్‌, ఆగస్టు 14: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనను తరిమికొట్టేందుకు అవసరమైతే గూండాయిజం కూడా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణలో దేశభక్తుల రాజ్యం రావాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 12వ రోజైన ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో జరిగిన సభలో సంజయ్‌ మాట్లాడారు. ఒక్క కాంగ్రెస్‌ కుటుంబం వల్ల దేశానికి స్వాతంత్య్రం రాలేదని, ముస్లిమేతర సమాజం వల్లనే స్వరాజ్యం వచ్చిందన్నారు. మోదీ వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాల వల్ల నిజమైన చరిత్ర తెలుస్తోందని చెప్పారు. రైతులకు రెండు పంటలకు కలిపి రూ.40 వేల ఎరువుల సబ్సిడీని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని తెలిపారు. సీఎం కేసీఆర్‌ రైతు రుణమాఫీ అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ ఇచ్చిన 2.40లక్షల ఇళ్లను కట్టించడం లేదన్నారు. ఎనిమిదేళ్లలో పంట నష్టపోయిన ఒక్క రైతుకైనా పరిహారం ఇచ్చారా..? అని ప్రశ్నించారు. గుండాల మండలంలో సిద్దిపేట జిల్లా గౌరవెల్లి నిర్వాసితులతో సంజయ్‌ మాట్లాడారు.


టీఆర్‌ఎ్‌సలో ఒక్కరు కూడా మిగలరు..

కేంద్ర ప్రభుత్వం ఈడీని(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) వాడుకోవాలనుకుంటే సీఎం కేసీఆర్‌ను ఎప్పుడో లోపల వేసేదని.. అలా చేస్తే టీఆర్‌ఎ్‌సలో ఒక్కరూ మిగలరని, అంతా జైలుకు పోతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు 2014, 2018లో ఇచ్చిన అఫిడవిట్లను పరిశీలిస్తే వారు అవినీతికి పాల్పడి ఎంత సంపాదించారో అర్థమవుతుందన్నారు. ఈడీ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని చెప్పారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద సంజయ్‌ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతూ రజాకార్లను తలపిస్తున్నారని అన్నారు. ఎంపీ వెంకట్‌రెడ్డి టచ్‌లో ఉన్నారని తానెప్పుడూ అనలేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పారిపోయాయన్నారు. కమ్యూనిస్టులు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎటువైపు పోతారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు మంచోళ్లేగానీ, నాయకులే అమ్ముడు పోయేటోళ్లని విమర్శించారు. తన పాదయాత్రకు భయపడే కొత్త పింఛన్లు, చేనేత బీమా పథకాలు వచ్చాయని తెలిపారు. చాక్‌పీసులు కొనలేని, పారిశుధ్య కార్మికులు, స్వీపర్లను నియమించుకోలేని దుస్థితిలో సర్కారు బడులు ఉన్నాయని అన్నారు. తాము అధికారంలోకి వస్తే విలేకరులను ఆదుకుంటామని చెప్పారు. విపక్ష ఎమ్మెల్యేలే కాదు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలోనూ అభివృద్ధి లేదని సంజయ్‌ విమర్శించారు.


కేసీఆర్‌ ఎరకు ఆశపడ్డ డీజీపీ: రఘునందన్‌

సీఎం కేసీఆర్‌ వేసిన ఎరకు ఆశపడి డీజీపీ మహేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. కీలక కేసుల్లో ఆయన చూసీచూడనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి సేవలను ప్రభుత్వం మరో రూపంలో వినియోగించుకుంటుందంటూ సీఎం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ తన వ్యక్తిగత భద్రత అధికారి నుంచి తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన ఘటనపై ఏం చెబుతారని డీజీపీని నిలదీశారు. మంత్రికి తానే తుపాకీ ఇచ్చినట్లు మహబూబ్‌నగర్‌ ఎస్పీ చెప్పిన మాట నిజమే అయితే.. వెంటనే ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌పై కేసు నమోదు చేయాలని, తుపాకీని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాలని డిమాండ్‌ చేశారు. ఫైర్‌ చేసిన తుపాకీని ఎందుకు సీజ్‌ చేయలేదని డీజీపీని ప్రశ్నించారు. శ్రీనివా్‌సగౌడ్‌ను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని, హైకోర్టు సిటింగ్‌ జడ్జి చేత విచారణ కోరాలని డిమాండ్‌ చేశారు.

Read more