మూడు రోజులు వడగాడ్పులు

ABN , First Publish Date - 2022-03-18T07:56:43+05:30 IST

: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయ్‌. ఎంతలా అంటే.. ఇప్పుడు నడుస్తున్నది మార్చి నెలా.. ఏప్రిలా..

మూడు రోజులు వడగాడ్పులు

  • హెచ్చరించిన వాతావరణ శాఖ
  • మార్చిలో 10 డిగ్రీల మేర పెరిగిన ఉష్ణోగ్రతలు


హైదరాబాద్‌ సిటీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయ్‌. ఎంతలా అంటే.. ఇప్పుడు నడుస్తున్నది మార్చి నెలా.. ఏప్రిలా.. అని అనుమానం కలిగేంతలా..! మార్చి మొదలవడంతోనే.. ఎప్పుడూ లేనంతలా మండే ఎండలను మోసుకొచ్చింది. ఉదయభానుడు కూడా ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో అనూహ్య పెరుగుదల నమోదైందని, అందునా గడచిన నాలుగైదు రోజుల్లో 6 నుంచి 8 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పెరిగాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చెప్పింది. ఉత్తరాదిలోని పర్వత ప్రాంతాల నుంచి తీర ప్రాంతం దిశగా వీస్తున్న వేడి గాలులే ఉష్ణోగ్రతల అనూహ్య పెరుగుదలకు కారణమని వెల్లడించింది. రోజు రోజుకూ పెరిగిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలను చూస్తుంటే.. ఏప్రిల్‌ తొలి వారంలో ఉన్న భావన కలుగుతోందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఉదయం 8 గంటలకే సూర్యప్రతాపం మొదలైపోతోంది. ఆ భగభగలు సాయంత్రం 5 వరకూ కొనసాగుతుండడంతో.. ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. మధ్యాహ్న వేళ బయటకు వెళ్లే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. నెత్తిపై నిప్పులు కురుస్తుండడంతో.. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గురువారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరువలోకి వచ్చేసింది. బుధవారం 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. రోజు వ్యవధిలో ఒక డిగ్రీ పెరిగి 39.6కు చేరింది. 


ఈ నెల చివరకు అది 42 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వీటి ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. కాగా, జిల్లాల్లోనూ భానుడు ఉగ్రరూపం దాల్చాడు. నల్లగొండలో గురువారం అత్యధికంగా 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండగా.. సాయంత్రం 6 దాటినా వడగాడ్పులు తగ్గడం లేదు. రాత్రి ఉష్ణోగ్రతలూ పెరిగిపోవడంతో.. ప్రజలు మరింతగా ఇబ్బంది పడుతున్నారు. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. రాజస్థాన్‌లోని బార్మర్‌, జైసల్మేర్‌, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, అకోలా నగరాలు 40డిగ్రీల పైబడిన ఉష్ణోగ్రతలతో సలసలలాడుతున్నాయి. కాగా, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. తూర్పు ఈశాన్యదిశగా పయనించి గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలోని భూమధ్య రేఖ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇది 20 నాటికి వాయుగుండంగా.. 21కి తుఫానుగా బలపడనుంది. దీని ప్రభావంతో ఎండలు మరింత పెరుగుతాయని, వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.  

Read more