పూల జాతరకు వేళాయె...

ABN , First Publish Date - 2022-09-25T05:39:56+05:30 IST

బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ యావత్‌ తెలంగాణలో మహిళలు గొంతెత్తి పాడుకుంటూ ఆటలాడుకునే తొమ్మిది రోజుల ఆడంబర పర్వానికి ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా మహిళలు, ముఖ్యంగా వివాహితలు పుట్టింటిలో ఉండి సరదాగా గడిపే బతుకమ్మ సంబరాలు అశ్వయుజ శుద్ధ అమావాస్య రోజైన ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.

పూల జాతరకు వేళాయె...

నేటి నుంచే బతుకమ్మ సంబురం
మహిళా లోకానికి అత్యంత ఇష్టమైన వేడుక
విశిష్ట తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక
తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో శ్రీకారం
నగరంలో ముస్తాబైన చారిత్రక వేయిస్తంభాల ఆలయం
ఇంటింటా బతుకమ్మ సందడి
పూల కొనుగోళ్లతో సందడిగా మారిన జంక్షన్లు


హనుమకొండ కల్చరల్‌, సెప్టెంబరు 24: బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ యావత్‌ తెలంగాణలో మహిళలు గొంతెత్తి పాడుకుంటూ ఆటలాడుకునే తొమ్మిది రోజుల ఆడంబర పర్వానికి ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు.  చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా మహిళలు, ముఖ్యంగా వివాహితలు పుట్టింటిలో ఉండి సరదాగా గడిపే బతుకమ్మ సంబరాలు అశ్వయుజ శుద్ధ అమావాస్య రోజైన ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పల్లెల్లో, పట్నాల్లో ప్రతిచోటా పూల పరిమళాలు గుభాళించనున్నాయి. మహిళలంతా జట్టుగా అందంగా పేర్చిన పూల బతుకమ్మలతో ఒకచోట చేరి సరదా కబుర్లు, చిన్ననాటి జ్ఞాపకాలను వలెల వేసుకుంటూ ఆడి పాడుకునే ఆట విడుపు పర్వం నేడు ప్రారంభం కానుంది. బంగారు పూవులా/బతుకమ్మలని పేర్చి/మంగళమ్మని నిను మధ్యన నిలిపి/రంగు గుమ్మడి పూవులు/గౌరమ్మ రాశిగా అర్పింతురు.. అన్న బతుకమ్మ పాటలోనే ఈ విశిష్ట పర్వదిన సంప్రదాయం తొణికిసలాడుతుంది.

హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల దేవాలయం, ఎక్సైజ్‌ కాలనీలోని శ్రీవెంకటేశ్వర ఆలయం, ఏకశిలాపార్కు సమీపంలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయం, రెవెన్యూ కాలనీలోని రామాలయం, రాగన్నదర్వాజలోని పెద్ద కోవెల తదితర ప్రాంతాలు తొలినాటి బతుకమ్మలకు వేదికలుగా నిలువనున్నాయి.

బతుకమ్మ ఎవరు?
కాకతీయుల ఆరాధ్య దేవత కాకతమ్మ, కాకతమ్మను తీరొక్క పూలతో మహిళలంతా పూజింపగా ఆ దేవత పూలతో నిండిపోయింది. అదే ఆచారం ఈనాటికి పూలతోనే బతుకమ్మను పేర్చి బతుకమ్మ.. బతుకునివ్వమ్మా.. అంటూ ఆరాధించడం ప్రారంభమైంది. బతుకమ్మ పర్వానికి మొదలు తొమ్మిది రోజులు కన్నెలు ఆడుకునే బొడ్డెమ్మ పర్వానికి కూడా బతుకమ్మ పాటలే పాడుకుంటుండటం విశేషం. ఈనాటికీ కాకతీయ వంశస్థులు బస్తర్‌, ఛత్తీ్‌సగఢ్‌ తదితర ప్రాంతాల్లో అటు కాకతమ్మను, ఇటు బతుకమ్మను కొలుస్తూనే ఉండటం గమనార్హం.

ప్రచారంలో మరోగాధ

19వ శతాబ్దం చివరిలో, 20వ శతాబ్దం ఆరంభంలో కొన్ని ప్రాంతాల్లో కరువు కాటకాలు, భయంకరవ్యాధులు సోకి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వాటి బారిన పడకుండా కాపాడి తమ బతుకులు చల్లంగా చూడమని ప్రజలంతా దేవతను పూజించారని, ఆ దేవతే బతుకమ్మ అయిందనేది ప్రజల విశ్వాసం. ఆ బతుకమ్మను ఏయేటి కాయేడు స్వచ్ఛమైన ప్రకృతి నుంచి లభించే తంగేడు, గునుగు, కట్ల పూలు, రుద్రాక్ష, చామంతి, బంతి లాంటి రకరకాల పూలతో అందంగా పేర్చుతూ ఆడంబరంగా నిష్టంగా జరుపుకుంటుండటం ఆనవాయితీ.

ప్రత్యేక ఆకర్షణగా పాటలు
బతుకమ్మ పాటల్లో లక్ష్మీ, సీత, అనసూయ, శశిరేఖ, సత్యభామ తదితర పుణ్యస్త్రీల గాధలు విరివిగా ఉన్నాయి. వరంగల్‌ నగరంలోని భద్రకాళి, చారిత్రక వేయిస్తంభాల ఆలయ ప్రాంగణం.. ఇంకా నగరంలోని అనేక కాలనీలలోని ఆలయాలు ఎనిమిది రోజుల బతుకమ్మ ఆటలకు వేదికలైతే.. చివరి రోజు ఘనంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ వేళ మాత్రం చెరువు గట్ల వద్దకుపోయి, ఆటలాడి, వాయనాలు అందించుకొని బతుకమ్మలను నిమజ్జనం చేయటం తెలంగాణ మహిళ ఆచారంగా బాసిల్లుతోంది. మహిళల చేతులే సాధనాలుగా చప్పట్లే గుండె చప్పుళ్లుగా అందంగా పూలను అలంకరించి వినసొంపైన జానపదాలతో తెలంగాణ బతుకమ్మ సంబరం ఆవిష్కృతం కానుంది.

బతుకమ్మను పేర్చడం ఇలా..
బతుకమ్మను వెదురుపల్లెంలోని, ఇత్తడి పల్లెంలోగాని పేర్వడం ఆనవాయితీ. గుమ్మడి ఆకులను పేర్చి పల్లెం కంటే ఎక్కువగా ఉన్న ఆకులను కత్తిరించాలి. దానిపై మొదటివరుస గుండ్రంగా తంగేడు పూలను పేరుస్తారు. తరువాత గునుగు పూల వరుస పేరుస్తారు. గునుగు పూలకు రకరకాల రంగులు అద్ది ఇంకా అందుబాటులో ఉన్న అనేకపూలతో బతుకమ్మను అందంగా పేరుస్తారు. పేర్చిన బతుకమ్మలను పూజ గదిలో అలికి ముగ్గుపెట్టి వాటిపై పీటలు వేసి బతుకమ్మను ఉంచుతారు. తల్లి పిల్లా బతుకమ్మలను పేర్వడం ఆనవాయితీ.

తంగేడు మయం

గ్రామీణ ప్రాంతాల నుంచి తరలివచ్చిన తంగేడు, గునుగు పూలతో నగరమంతా తంగేడు మయమైంది. మహిళలు బతుకమ్మలను పేర్చేందుకు ప్రధానంగా తంగేడు పూలనే వాడటం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో హనుమకొండలో విరివిగా తంగేడు పూల అమ్మకాలు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జోరుగా కొనసాగాయి. వీనితోపాటు ఇతర పూల అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. చామంతి రేటు రెండింతలు పెంచి అమ్మకాలు చేపట్టారు. హనుమకొండ చౌరస్తా, టైలర్‌స్ట్రీట్‌ ప్రాంతాలు పూల కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ కనిపించాయి.

ఘనంగా బొడ్డెమ్మల నిమజ్జనం
బతుకమ్మ పర్వానికి తొమ్మిది రోజుల ముందు పెళ్లికాని పిల్లలు పేర్చుకొని ఆటలాడిన బొడ్డెమ్మ వేడుకలు శనివారంతో పరిసమాప్తం అయ్యాయి. బొడ్డెమ్మలను సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు. అదే విధంగా నగరంలోని పలు ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోనూ బొడ్డెమ్మల నిమజ్జనోత్సవం నిర్వహించారు.

Updated Date - 2022-09-25T05:39:56+05:30 IST