పండుగ పూట పస్తులేనా?

ABN , First Publish Date - 2022-09-29T05:34:38+05:30 IST

ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ ఉపాధ్యాయులు (సీఆర్‌టీలు) పండుగ పూట కూడా పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఇతర విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సీఆర్‌టీలు నెలనెలా వేతనాలు పొందుతుండగా వీరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వేతనాలు ఎప్పుడు వస్తాయోనని ప్రతీ నెలా ఎదురుచూడాల్సి వస్తోంది. ఇప్పటికే సీఆర్‌టీలకు ఐదునెలలుగా వేతనాలు రావడం లేదు. ఆర్థికంగా వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆసలే దసరా పండుగ.. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొత్తబట్టలు కొనడం, పిండివంటలు చేయడం వంటివాటికి డబ్బవసరం ఉంటుంది. కానీ వేతనాలు రాకపోవడంతో సీఆర్‌టీల కుటుంబాల్లో పండుగ సంతోషమే లేకుండా పోయింది. వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని ఆయోమయ పరిస్థితిలో సీఆర్‌టీలు కొట్టుమిట్టాడుతున్నారు.

పండుగ పూట పస్తులేనా?

కష్టాల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులు
ఐదు నెలలుగా రాని జీతాలు.. పీఆర్‌సీ బకాయిలూ పెండింగ్‌
రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో సమానంగా సీఆర్‌టీల విధులు
అయినా వివక్ష చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం
ఏళ్లు గడుస్తున్నా రెగ్యులర్‌ కానీ సర్వీస్‌


ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ ఉపాధ్యాయులు (సీఆర్‌టీలు) పండుగ పూట కూడా పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఇతర విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సీఆర్‌టీలు నెలనెలా వేతనాలు పొందుతుండగా వీరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వేతనాలు ఎప్పుడు వస్తాయోనని ప్రతీ నెలా ఎదురుచూడాల్సి వస్తోంది. ఇప్పటికే సీఆర్‌టీలకు ఐదునెలలుగా వేతనాలు రావడం లేదు. ఆర్థికంగా వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆసలే దసరా పండుగ.. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొత్తబట్టలు కొనడం, పిండివంటలు చేయడం వంటివాటికి డబ్బవసరం ఉంటుంది. కానీ వేతనాలు రాకపోవడంతో సీఆర్‌టీల కుటుంబాల్లో పండుగ సంతోషమే లేకుండా పోయింది. వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని ఆయోమయ పరిస్థితిలో సీఆర్‌టీలు కొట్టుమిట్టాడుతున్నారు.


హనుమకొండ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) :
సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 39 ఉన్నాయి. ఈ ఆశ్రమ పాఠశాలల్లో ఏళ్లతరబడి రెగ్యులర్‌ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో 2003లో కాంట్రాక్టు ఉపాధ్యాయుల నియామకాలు ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయుల కొరత వల్ల బోధన కుంటుపడకుండా ఉండేందుకు, విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌టీలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 200 మంది కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ ఉపాధ్యాయులను నియమించారు. వీరిలో హనుమకొండ జిల్లాలో 12 మంది, వరంగల్‌ జిల్లాలో 26మంది, జనగామ జిల్లాలో 27 మంది మహబూబాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 82 మంది, ములుగు జిల్లాలో 51 మంది, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 46 మంది పని చేస్తున్నారు.

చిన్నచూపు
సీఆర్‌టీలు రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో సమానంగా, ఒక్కో పాఠశాలలో అం తకన్నా ఎక్కువగానే విధులను నిర్వహిస్తున్నారు. అన్ని సబ్జెక్టులను బోధిస్తున్నవీరు.. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 100 శాతం ఫలితాలను తీసుకురావడంలో వీరు ముఖ్యభూమికి పోషిస్తున్నారు. అలాగే పాఠశాలలకు సంబంధించిన ఇతరత్రా కార్యకలాపాల్లో కూడా వీరు పాలుపంచుకుంటున్నారు. అయినా సీఆర్‌టీలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపుచూస్తోంది. వీరికి నెలనెలా సక్రమంగా వేతనాలు ఇవ్వకపోగా వెట్టి చాకిరి చేయిస్తోంది. వీరికి పాఠశాలలు పనిచేసిన రో జులకే వేతనాలు లెక్కకట్టడంతో ఏటా సీఆర్‌టీలు 45 రోజుల వేతనాలను కోల్పోవలసి వస్తోంది. అంటే ఒక్కో సీఆర్‌టీ గరిష్టంగా రూ.40వేల నుంచి రూ.45వేలను నష్టపోతున్నారు. అంతేకాక ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగభద్రత లేదు. యేటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రెన్యూవల్‌ అయితే తప్పా వీరి సర్వీస్‌ పొడిగింపు ఉండదు.

అత్తెసరు వేతనాలు
సీఆర్‌టీలకు 2022 వేతన సవరణ ప్రకారం 30 శాతం వేతనాలు పెరిగాయి. ప్రస్తుతం సీఆర్‌టీల్లో నెలకు స్కూల్‌ అసిస్టెంట్‌కు రూ.28,977, ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు రూ.21,255 చెల్లిస్తున్నారు. ఇంతకు ముందు 10వ పీఆర్‌సీలో 50శాతం మేరకు స్కూల్‌ అసిస్టెంట్‌కు నెలకు రూ.22,290, ఎస్‌జీటీలకు రూ. 16,350 ఇచ్చేవారు. సీఆర్‌టీలకు గత విద్యా సంవత్సరం పీఆర్‌సీ 30 శాతం బకాయిలు జూన్‌ 2021 నుంచి ఏప్రిల్‌ 2022 వరకు చెల్లించాల్సి ఉంది. ఒక్కో సీఆర్‌టీకి సుమారు రూ.2లక్షల వరకు పీఆర్‌సీ బకాయిలు రావలసి ఉంది. ఇప్పటి వరకు ఈ బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. అలాగే గత విద్యా సంవత్సరం ఏప్రిల్‌, మే నెలలకు, సంబంధింది, ఈ విద్యా సంవత్సరం పునఃప్రారంభం అయిన తర్వాత జూన్‌ నుంచి ఇప్పటివరకు 5 నెలల వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

వివక్ష?
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీలు), సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్‌టీలకు 12 నెలలకుగాను వేతనాలు చెల్లిస్తూ.. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న వారికి 10.5 నెలలకే వేతనాలు చెల్లిస్తున్నారు. సీఆర్‌టీలు ఏళ్లతరబడి పనిచేస్తున్నా వారి సర్వీ్‌సను రెగ్యులర్‌ చేయడం లేదు. ఈ విషయమైన గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని సీఆర్‌టీలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తమకు రావలసిన పీఆర్‌సీ బకాయిలతో పాటు వేతన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.

నెలన్నరోజుల వేతనాలు వచ్చాయి..
- ప్రేమకళ, హనుమకొండ డీటీడబ్ల్యువో

సీఆర్‌టీవోలకు సంబంధించిన గత విద్యా సంవత్సరానికి (2021) సం బంధించిన నెలన్నర రోజుల (ఏప్రిల్‌, మే) వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలోనే ఇవి సీఆర్‌టీలకు అందుతాయి. మిగతా నెలలకు సం బంధించిన వేతనాల బడ్జెట్‌ విడుదల కాలేదు. పీఆర్‌సీ బకాయిల విషయంలోనూ అంతే. ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేయగానే వేతనాలు, పీఆర్‌సీ బకాయిల చెల్లింపు జరుగుతుంది.

Read more