రైతుల్లేని వేదిక!

ABN , First Publish Date - 2022-03-18T08:17:42+05:30 IST

తెలంగాణ ఏర్పాటయ్యాక ఏఈవో(వ్యవసాయ విస్తరణాధికారుల) వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది.

రైతుల్లేని వేదిక!

  • పాఠాలు, శిక్షణలు, భేటీలెక్కడ? విత్తనాలు, పనిముట్లూ లేవు
  • 572 కోట్లతో 2,601 భవనాలు.. మౌలిక వసతులు కరవు
  • పలుచోట్ల తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు
  • మందుబాబులు, అసాంఘిక చర్యలకు అడ్డాగా కొన్ని వేదికలు
  • వేదికల వైపు కన్నెత్తి చూడని ఏఈవోలు, అన్నదాతలు
  • కొన్నిచోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశాలకు వినియోగం
  • వేదికలను ఆటంబాంబు అన్న సీఎం.. చాలాచోట్ల తాళాలే


హైదరాబాద్‌, న్యూస్‌ నెట్‌వర్క్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఏర్పాటయ్యాక ఏఈవో(వ్యవసాయ విస్తరణాధికారుల) వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒకరు చొప్పున ఏఈవోలను నియమించింది. క్లస్టర్‌ పరిధిలో కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర బిందువుగా రైతు వేదికలు నిర్మించాలని సంకల్పించింది. వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏఈవో) ప్రత్యేక గది, కంప్యూటర్‌ గది, సమావేశ మందిరం, విత్తనాలు, యాంత్రీకరణ పనిముట్లు ఉంచటానికి వేర్వేరు గదులతో రైతు వేదికకు రూ.22 లక్షల చొప్పున వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికలను నిర్మించారు. అయితే గదుల్లో కంప్యూటర్లు, విత్తనాలు, పనిముట్లు లేవు. మైకులు, కుర్చీలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు సహా మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించినా ఆచరణ సాధ్యం కాలేదు. అక్కడ వ్యవసాయశాఖ అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించకపోవటం, క్లస్టర్‌ ఇన్‌చార్జులుగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు... క్రాప్‌బుకింగ్‌ ఇతరత్రా పనుల్లో నిమగ్నం కావటంతో రైతు వేదికల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో రైతులు కూడా ఆ వైపు వెళ్లడం లేదు. ఫలితంగా రూ. 572 కోట్లు వెచ్చించ్చి నిర్మించిన రైతు వేదికల్లో పలు భవనాలకు తాళాల కప్పలు వేలాడుతున్నాయి. 


సమున్నత లక్ష్యం.. ఆచరణ లేదు

వాస్తవానికి రైతు వేదికల ఆవిర్భావం వెనుక సమున్నత లక్ష్యం ఉంది. వ్యవసాయశాఖలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు, వ్యవసాయ ప్రణాళికలు రూపొందించేందుకు, రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు, పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలపై చర్చించేందుకు, విత్తనాలు, ఎరువుల లభ్యతను పరిశీలించేందుకు, వ్యవసాయ పనిముట్లను అందుబాటులో ఉంచేందుకు ఈ వేదికలను నిర్మించారు. 2020 అక్టోబరు 31న జనగామ జిల్లా కొడకండ్లలో తొలి రైతు వేదికను ఆర్భాటంగా ప్రారంభించారు. వరంగల్‌ జిల్లాలో 59 వేదికలను ప్రారంభించిన రోజు తెరిచారు. ఆ తర్వాత తాళాలే కనిపిస్తున్నాయి. ఊరికి దూరంగా   నిర్మించటం, విద్యుత్తు సౌకర్యం కల్పించకపోవటం,  ఏడాదికి రూ.24 లక్షల నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం ఇవ్వకపోవడం సమస్యగా మారాయి. మెదక్‌ జిల్లాలో కొన్నిచోట్ల ధాన్యం బస్తాల నిల్వకు ఉపయోగించుకున్నారు. చిలపచేడు రైతు వేదికలో ఇప్పటికీ ధాన్యం బస్తాలు, గోనె సంచులు ఉన్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లాలోని వేదికల్లో 25 చోట్ల విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వలేదు. 


పెద్దపల్లి జిల్లాలో ఎలిగేడు సహా కొన్ని వేదికలకు బోర్‌ కనెక్షన్‌ ఇవ్వలేదు. ఆదిలాబాద్‌ జిల్లాలో కొన్ని వేదికలు మందుబాబులకు అడ్డాగా మారాయి. నిర్మల్‌ జిల్లాలో కొన్నిచోట్ల భవనాలకు ప్రహరీలు లేవు. వికారాబాద్‌ జిల్లాలో 99 వేదికలు నిర్మించినా నాలుగైదు చోట్లనే తాగునీరు, మరుగుదొడ్లు, కరెంటు సదుపాయం కల్పించారు. జగిత్యాల జిల్లాలో 71 వేదికలు నిర్మించారు. ఫర్నీచర్‌ సమకూర్చినా మరుగుదొడ్లు, ఫ్యాన్లు, తాగునీరు ఏర్పాటుచేయలేదు. కామారెడ్డి జిల్లాలో 104 వేదికలు నిర్మించినా తాళాలు వేసి ఉంచుతున్నారు. ములుగు జిల్లాలోని వేదికల్లో 30 చోట్ల మరుగుదొడ్లు నిర్మించినా నీటి వసతి కల్పించలేదు. మంగపేట, వాజేడు, తాడ్వాయి, వెంకటాపూర్‌, ఏటూరునాగారం మండలాల్లో 15 వేదికల ప్రాంగణాల్లో మరుగుదొడ్లకు తలుపులు బిగించలేదు. నిజామాబాద్‌ జిల్లాలో 20 చోట్ల కరెంటు, నీటి సమస్య ఉంది. ఏఈవోలు అప్పుడప్పుడు మీటింగ్‌లు పెడుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 86 వేదికలు నిర్మిస్తే అన్నీ ఊరిబయట ఉన్నాయి. రన్నింగ్‌ వాటర్‌ లేదు. టాయిలెట్లు వినియోగంలో లేవు. నారాయణపేట జిల్లాలో 77 వేదికలన్నీ గ్రామాలకు దూరంగా ఉండడంతో వాటర్‌ పైపులైన్‌ వేయటం ఇబ్బందిగా మారింది. టాయిలెట్లు, నీటి వసతి లేదు.


సిరిసిల్ల జిల్లాలో నిర్వహణ ఖర్చులు మంజూరుకాలేదు. బోయినపల్లి, గర్జనపల్లి, బోనాల గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్నాయి. మూత్రశాలలు లేక మహిళా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్‌ జిల్లాలో కుంటాల, లోకేశ్వరం, కడెం తదితర మండలాల్లో సదుపాయాలు కల్పించలేదు. నిర్వహణ ఖర్చులను తమ వేతనాల నుంచి ఇస్తున్నామని ఏఈవోలు చెబుతున్నారు. హనుమకొండ జిల్లాలో అటెండర్లు, స్వీపర్లు లేరు. నిర్వహణ ఖర్చుల కింద ఇచ్చే మొత్తం కరెంటు బిల్లులకే సరిపోవటంలేదని ఏఈవోలు చెబుతున్నారు. పలుచోట్ల ఫర్నీచర్‌ ఎత్తుకుపోయారు. నల్లగొండ జిల్లాలో 140 రైతు వేదికలు నిర్మించారు. అయినా ఈవోలు గ్రామ పంచాయతీలకు వెళ్తున్నారు. మిషన్‌ భగీరథ కాంట్రాక్టర్లు... రైతు వేదికలు ఊరికి దూరంగా ఉన్నాయని పైపులైన్లు వేయటంలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పర్యటనలున్నపుడు తాళాలు తీస్తున్నారు. మహబూబాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ప్రతి మంగళవారం సదస్సులు నిర్వహిస్తున్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 143 వేదికలు నిర్మించినా గ్రామాల్లో ఉన్నవాటికి తాళాలు వేసి ఉంచుతున్నారు. ఇక్కడ మందు బాబులకు అడ్డాలుగా మారాయి. సిద్దిపేట జిల్లాలో అడపాదడపా సదస్సులు నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరిలో చాలాచోట్ల మరుగుదొడ్లు, నీటి వసతి కల్పించలేదు. ఖమ్మం జిల్లాలో తల్లాడ మండలంలోని ఎనిమిది వేదికలకు రూ. 40 వేల కరెంటు బిల్లు బకాయి ఉంది. వనపర్తి జిల్లాలో యాసంగిలో ధాన్యం నిల్వలకు వినియోగించారు. గద్వాల జిల్లాలో పలుచోట్ల టీఆర్‌ఎస్‌ నేతలు పార్టీ సమావేశాలకు వినియోగిస్తున్నారు. భూపాలపల్లిలోని 45 వేదికల్లో  26 ప్రారంభించలేదు. 


రైతు వేదిక ఓ ఆటంబాంబు

‘‘మీ అందరి దగ్గర స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. రైతులందరూ రైతు వేదికల్లో కూర్చోండి. ముఖ్యమంత్రిగా నేను మాట్లాడుతా. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతడు. వ్యవసాయశాఖ కార్యదర్శి లేకపోతే చీఫ్‌ సెక్రటరీ మాట్లాడుతడు. పంటల సాగుపై ఓ సందేశం ఇస్తరు. వందల మంది రైతులు ఆ రైతు వేదికలో కూర్చొని వినాలె. అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌ రావు ఉన్నడు.. శాస్త్రవేత్తలు పాఠాలు చెప్తరు. వరి పంట వేస్తే, మొక్కజొన్న వేస్తే, అల్లం వేస్తే ఏంజేయాలె? అనేది చెప్తరు. ప్రతి రైతు వేదికలో కొద్దిరోజుల్లో టీవీలు పెడతం. ఒకదగ్గరి నుంచి మాట్లాడితే.. అన్నివేదికల్లో అధికారులు మాట్లాడేది కనిపించేలా ఏర్పాట్లు చేస్తం. రైతు వేదిక ఒక ఆటంబాంబు. ఇదొక అద్భుతమైన శక్తి. రైతువేదికలు... రైతులను అద్భుతంగా తీర్చిదిద్దుతాయి.’’

 -2020 అక్టోబరు 31 తేదీన కొడకండ్లలో రైతువేదికను ప్రారంభంలో సీఎం కేసీఆర్‌  వ్యాఖ్యలివి! 

Updated Date - 2022-03-18T08:17:42+05:30 IST