ప్రముఖ హిందూత్వవాది గుజ్జుల నర్సయ్య ఇకలేరు

ABN , First Publish Date - 2022-09-25T07:50:38+05:30 IST

ఆరు దశాబ్దాల పాటు అనేక వేదికలపై హిందూత్వ వాణిని వినిపించిన ప్రముఖ విద్యావేత్త, ఏబీవీపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు, వేలాదిమందికి గురుతుల్యులైన గుజ్జుల నర్సయ్య (80) ఇకలేరు.

ప్రముఖ హిందూత్వవాది గుజ్జుల నర్సయ్య ఇకలేరు

  • విద్యావేత్తగా, సీనియర్‌ ఆర్‌ఎ్‌సఎస్‌ నేతగా నర్సయ్యకు గుర్తింపు
  • అసోం సీఎం హేమంత బిశ్వశర్మ, బండి సంజయ్‌కి గురువు
  • నేడు హనుమకొండ హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు
  • తెలుగు విద్యార్థుల్లో జాతీయవాద బీజాలు నాటారు: కిషన్‌ రెడ్డి 
  • నర్సయ్య మృతి జాతీయవాదులకు తీరనిలోటు: బండి సంజయ్‌

హనుమకొండ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆరు దశాబ్దాల పాటు అనేక వేదికలపై హిందూత్వ వాణిని వినిపించిన ప్రముఖ విద్యావేత్త, ఏబీవీపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు, వేలాదిమందికి గురుతుల్యులైన గుజ్జుల నర్సయ్య (80) ఇకలేరు. శనివారం సాయంత్రం 4గంటలకు హనుమకొండలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నర్సయ్యకు భార్య రాజ్యలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆయన శిష్యులే. ఇటీవల హనుమకొండలో జరిగిన బీజేపీ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమానికి హాజరైన హిమంత బిశ్వశర్మ గుజ్జుల నర్సయ్యకు పాదాభివందనం చేశారు. నర్సయ్య భౌతికకాయానికి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం హనుమకొండ పద్మాక్షిగుడి సమీపంలోని హిందూ స్మశానవాటికలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. బాల్యం నుంచే నర్సయ్య ఆర్‌ఎ్‌సఎస్‌ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నారు. హిందూత్వపై అనేక సభల్లో అనర్గళంగా మాట్లాడేవారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గూడెంలో 1942లో నర్సయ్య జన్మించారు. 1952లో  ఆర్‌ఎ్‌సఎ్‌సల స్వయం సేవక్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు. 1967లో ఏబీవీపీ కార్యకర్తగా నర్సయ్య విద్యారంగంలో ప్రవేశించారు. 1981లో ఇంగ్లిష్‌ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టి వివిధ చోట్ల పనిచేసి 2001లో ఉద్యోగ విరమణ చేశారు. గుజ్జుల నర్సయ్య మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ దిగ్ర్భాంతి, విచారం వ్యక్తం చేశారు. తెలుగునాట విద్యార్థుల్లో జాతీయవాద భావజాల వ్యాప్తికి బీజాలు నాటిన మహానీయుడు నర్సయ్య అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. నర్సయ్య మరణం జాతీయ వాదులకు తీరని లోటు అని బండి సంజయ్‌ అన్నారు. 

Read more