రంగారెడ్డి జిల్లా గండిపేటలో 1000 ఎకరాలపై కన్ను

ABN , First Publish Date - 2022-09-21T07:08:30+05:30 IST

రంగారెడ్డి జిల్లా గండిపేటలో రూ.వేల కోట్ల విలువజేసే 1000 ఎకరాల వివాదాస్పద భూమి ధరణిలో నిషేధిత జాబితాలో ఉందని.

రంగారెడ్డి జిల్లా గండిపేటలో 1000 ఎకరాలపై కన్ను

  • ధరణిలో నిషేధిత జాబితాలోని భూమి అది
  • ప్రగతిభవన్‌తో సంబంధమున్న ‘రియల్‌’
  • పైరవీతో జాబితా నుంచి బయటకు
  • రాష్ట్రంలో భూ దందా సృష్టికర్త కేసీఆరే
  • ఫిలిప్పీన్స్‌ సంస్థకు భూ రికార్డుల నిర్వహణ
  • ప్రాజెక్టుల్లో కమీషన్ల కంటే రోజూ ధరణి 
  • ద్వారా దండుకుంటున్నదే ఎక్కువ: ఈటల

హైదరాబాద్‌, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా గండిపేటలో రూ.వేల కోట్ల విలువజేసే 1000 ఎకరాల వివాదాస్పద భూమి ధరణిలో నిషేధిత జాబితాలో ఉందని.. ప్రగతిభవన్‌తో సంబంధమున్న రియల్‌ ఎస్టేట్‌ మాఫియా పైరవీతో ఆ భూమి నిషేధిత జాబితా నుండి మారిపోయిందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సంచలన ఆరోపణ చేశారు. రాష్ట్రంలో భూదందా రూపకర్త, సృష్టికర్త, సీఎం కేసీఆరేనని.. రాజధాని చుట్టుపక్కల వేల కోట్లు విలువజేసే భూములను అధికార పార్టీ ముఖ్యుల బినామీలు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఒక భూమిలో కొంతభాగాన్ని రిజిస్ట్రేషన్‌ చేసి మిగతాభాగాన్ని కంప్యూటర్‌లో బ్లాక్‌ చేస్తున్నరు. బేరం కుదిరితే ఓపెన్‌ అవుతది.. లేదంటే క్లోజ్‌ అవుతది... ఇదీ ప్రతిరోజు జరుగుతున్న దందా.. ప్రాజెక్టుల్లో దండుకునే కమిషన్‌ల కంటే ధరణి ద్వారా పెద్దఎత్తున దందా జరుగుతోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఐసీలో నిక్షిప్తం చేయాల్సిన భూ రికార్డుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే నాలుగు సంస్థలను మార్చి, ఇప్పుడు ఫిలిప్పీన్స్‌ కంపెనీ చేతుల్లో పెట్టిందని దుయ్యబట్టారు. ధరణిని రైతుల కోసం పెట్టారా లేక.. వేల కోట్లు విలువజేసే భూమిని కేసీఆర్‌ కుటుంబసభ్యులు, ఆయన బానిసలు కొట్టేయడానికి పెట్టారా? అని నిలదీశారు. ధరణి లోపాలపుట్ట అని.. అసైన్డ్‌ భూములను వివాదాస్పద జాబితాలో పెట్టారని.. దేవాదాయ, వక్ఫ్‌, మాన్యం భూములు వేల ఎకరాలను బినామీల పేరిట దండుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.


వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..

ధరణిలో తప్పుల కారణంగా సోమవారం ఒక్కరోజే నాలుగు జిల్లాల్లో నలుగురు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారని ఈటల ఆవేదన వెలిబుచ్చారు. రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చిన కేసీఆర్‌, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే 2020 నవంబరులో ధరణిని తీసుకువచ్చారని మండిపడ్డారు. ధరణి కారణంగా భూసమస్యలు పెద్ద ఎత్తున తలెత్తాయని.. సర్వే నంబర్లు తప్పుగా పేర్కొనడం.. పట్టాభూముల్ని అటవీ భూములుగా మార్చడం.. యజమానుల పేర్లు మారిపోవడం వంటి సమస్యలు పెరిగాయని పేర్కొన్నారు. రికార్డుల్లో తప్పులు సవరించాలని, తమకు న్యాయం చేయాలని గత రెండేళ్లుగా 24 లక్షల మంది రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతుంటే కేవలం 6 లక్షల దరఖాస్తులు మాత్రమే పరిష్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికీ 18 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నై. తమ భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. ఒక మహిళా తహశీల్దార్‌పై పెట్రోలు పోసి తగులబెట్టాల్సిన నీచమైన చరిత్రకు కేసీఆరే కారణమని ఈటల ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలు వివాదాస్పద భూముల జాబితాలో ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని.. లేనిపక్షంలో పరిపాలన చేతగాదంటూ ప్రజలకు క్షమాపణ చెప్పి పదవి నుంచి వైదొలగాలని ఈటల సీఎంను డిమాండ్‌ చేశారు. 

Read more