గనులు అన్వేషించండి.. అమ్మండి

ABN , First Publish Date - 2022-09-10T08:50:37+05:30 IST

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అపారమైన గనులు, ఖనిజాలున్నాయని, వీటిని అన్వేషించి..

గనులు అన్వేషించండి.. అమ్మండి

రాష్ట్రాలను కోరిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అపారమైన గనులు, ఖనిజాలున్నాయని, వీటిని అన్వేషించి.. వేలం వేసి విక్రయించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్ని రాష్ట్రాలను కోరారు. గనుల శాఖ మంత్రుల రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ప్రారంభమైంది. 11 రాష్ట్రాల గనుల శాఖల మంత్రులు, 26 రాష్ట్రాలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి జోషి మాట్లాడుతూ.. ఖనిజ రంగాన్ని ‘ఆత్మ నిర్భర్‌’గా మార్చడంతోపాటు దేశంలో సుస్థిరమైన గనుల రంగ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ రంగంలో కేంద్రం చేపట్టిన సంస్కరణలతో 2014లో 572 మిలియన్‌ టన్నులున్న ఉత్పత్తి 2022లో 800 మిలియన్లకు చేరుకుందని తెలిపారు. వచ్చే ఏడాదిలో 900 మిలియన్‌ టన్నుల ఉత్పత్తిని సాధిస్తామన్నారు. ఖనిజ సంపద ఉన్న చోట అన్వేషణకు కేంద్రం వెంటనే అనుమతులిస్తుందని తెలిపారు. ఈ రంగంలో ఇంతవరకు ప్రభుత్వ సంస్థలే అన్వేషణ చేపట్టేవని, ఇప్పుడు ప్రైవేటు సంస్థలకూ అనుమతులు ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల సహకారంతో గనులు, ఖనిజాలను అన్వేషించాలని కోరారు. ప్రస్తుతం దేశ జీడీపీలో గనులు, ఖనిజాల నుంచి ఆదాయం 1శాతం లోపే ఉందని, దీన్ని 2030 నాటికి 2.5 శాతానికి పెంచాలని ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా నిర్దేశించారని చెప్పారు. కాగా గనుల మంత్రిత్వ శాఖ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు తెలిపేందుకు వర్చువల్‌ వెబ్‌సైట్‌ ‘ది మైనింగ్‌ ఎరేనా’ను జోషి ప్రారంభించారు. మైనింగ్‌ లేకుంటే ప్రపంచమేలేదని, సిమెంట్‌, స్టీల్‌కు ఈ రంగం కీలకమని  ప్రహ్లాద్‌ జోషి అన్నారు. కాగా, థర్మల్‌ విద్యుత్తులో వాడే బొగ్గు దిగుమతులను వచ్చే ఏడాది నుంచి నిలిపివేయనున్నట్టు ప్రకటించారు. 


‘జైహింద్‌’ నినాదం పుట్టిన గడ్డ ఇదీ.. 

ప్రహ్లాద్‌ జోషి హైదరాబాద్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అనుచరుడైన ఆబిద్‌ హసన్‌ సఫ్రానీ పుట్టిన గడ్డ హైదరాబాద్‌ అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలను ఏకం చేసిన ‘జైహింద్‌’ నినాదాన్ని ఆబిద్‌ హసన్‌ ప్రారంభించారని కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. స్వాతంత్య్రం ఇచ్చేందుకు నిజాం నిరాకరించడంతో హైదరాబాద్‌కు ఏడాది ఆలస్యంగా స్వాతంత్య్రం వచ్చిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. 

Updated Date - 2022-09-10T08:50:37+05:30 IST