ఐదేళ్లు దాటినా గొర్రెలు రావాయె!

ABN , First Publish Date - 2022-08-19T08:02:23+05:30 IST

గొర్రెల పంపిణీ పథకం అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిన ఈ పథకం..

ఐదేళ్లు దాటినా గొర్రెలు రావాయె!

2019 మే నాటికే పథకం పూర్తిచేయాలని లక్ష్యం.. ఇప్పటికీ కొలిక్కి రాని వైనం


ఇంకా 3,70,507 మందికి అందని గొర్రెలు

ఇప్పటికే కేంద్రం నుంచి 3,950 కోట్ల రుణం

నిధులు సర్దుబాటు చేయలేక సర్కారు సతమతం

ఏళ్లుగా ఎదురుచూస్తున్న గొల్ల, కురుమలు


హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): గొర్రెల పంపిణీ పథకం అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిన ఈ పథకం.. ఐదేళ్లయినా కొలిక్కి రాలేదు. మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాలకు మాంసం ఎగుమతి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రత్యేక గొర్రెల అభివృద్ధి పథకం’ అమల్లోకి తెచ్చింది. ఆచరణలో మాత్రం విఫలమైంది. రెండేళ్లలోనే పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన పథకం.. ఐదేళ్లు దాటినా పూర్తవలేదు. జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ) నుంచి ఇప్పటికే రూ.3,950 కోట్లు రుణం తీసుకోగా.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేయకపోవడంతో గొర్రెల పంపిణీ పథకం అర్ధాంతరంగా నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మంది లబ్ధిదారులు గొర్రెల కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు.


రెండో విడత గొర్రెల పంపిణీని త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తరచూ ప్రకటిస్తున్నారు. కానీ, ‘త్వరలో’ అంటే ఎప్పుడనేది మూడేళ్లుగా తేలడం లేదు. 2021లో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలో మాత్రం రెండో విడత (లిస్టు-బి)లో ఉన్న లబ్ధిదారులకు (కేవలం హుజూరాబాద్‌ నియోజకర్గానికి చెందిన వారికి) గొర్రెలు పంపిణీ చేశారు. అలాగే మొదటి విడతలో డీడీలు తీసి.. పెండింగ్‌ ఉన్న 21,738 మంది లబ్ధిదారులకు కూడా పంపిణీ చేశారు. ఈ రెండు ప్రత్యేక సందర్భాల్లో మినహా పూర్తిస్థాయిలో గొర్రెల పంపిణీ చేపట్టిన దాఖలాలు లేవు. హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,109 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న 7,61,895 మందిని ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. లిస్టు-ఏ (మొదటి విడత)లో 3,67,020 మందికి, లిస్టు-బి (రెండో విడత)లో 3,64,984 మందికి 20+1 (20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు) చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, మొదటి విడతలో 3,17,504 మందికే గొర్రెలు పంపిణీ చేశారు. ఆ తర్వాత నిలిపివేశారు. 28 వేల మంది డీడీలు చెల్లించి ఎదురుచూస్తున్నారని ఆందోళనలు చేపట్టడంతో నిరుడు మరో 21,738 మందికి పంపిణీ చేశారు. ఇక రెండో విడత (లిస్టు-బి)లో కేవలం 52,146 మందికే గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు. మొత్తం కలిపి ఐదేళ్లలో 3,91,388 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసింది. ఇంకా 3,70,507 మందికి ఇవ్వాల్సి ఉంది.  


రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యం

వాస్తవానికి గొర్రెల పంపిణీ పథకాన్ని రెండేళ్లలోనే పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2017 జూన్‌ నుంచి 2018 మే వరకు మొదటి విడత, 2018 జూన్‌ నుంచి 2019 మే వరకు రెండో విడత గొర్రెల పంపిణీని పూర్తిచేస్తామని ప్రకటించింది. 2017 ఏప్రిల్‌ 11నజీవో నంబరు-52 విడుదల చేసింది. పథకాన్ని పకడ్బందీగా చేపట్టేందుకుగాను కలెక్టర్లకు అధికారాలు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్‌ డైరెక్టర్‌ను నోడల్‌ అధికారిగా నియమించింది. తొలుత యూనిట్‌ విలువ (20 గొర్రెలు, ఒక పొట్టేలు)ను రూ.1.25 లక్షలుగా నిర్ణయించింది. తాజాగా రూ.1.75 లక్షలకు పెంచింది. 25 శాతం వాటా ధనాన్ని లబ్ధిదారుడు చెల్లిస్తే.. 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేలా పథకానికి రూపకల్పన చేసింది. రెండేళ్లలో పంపిణీ పూర్తిచేయాల్సి ఉండగా.. ఐదేళ్లు గడిచినా గొర్రెల పంపిణీ పూర్తవలేదు. 18 ఏళ్లు నిండిన వారికే ఈ పథకం వర్తిస్తుందనే నిబంధన ఉంది. కానీ, ఐదేళ్లలో చాలామంది వయసు 18 ఏళ్లు దాటిపోయింది. వారిని కూడా లబ్ధిదారులుగా చేర్చాలని, కొత్తగా సభ్యత్వ, లబ్ధిదారుల నమోదు చేపట్టాలని గొల్ల, కురుమలు డిమాండ్‌ చేస్తున్నారు.


నిధుల కొరత.. అవినీతి!

సగం మంది గొల్ల, కురుమలకు గొర్రెలు పంపిణీ చేసి, మరో సగం మందిని విస్మరించడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేయకపోవడమే! గొర్రెల పంపిణీ పథకాన్ని రూ.5 వేల కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ‘జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ)’ ఢిల్లీ నుంచి 10.50 శాతం వడ్డీ కింద రూ.3 వేల కోట్లు రుణం తీసుకోవాలని, సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించాలని, లబ్ధిదారుని వాటాధనం కింద రూ.1,000 కోట్లు వసూలు చేయాలని నిధుల ప్రణాళిక రచించింది. ‘ఎన్‌సీడీసీ’ నుంచి రూ.3,950 కోట్ల రుణం తీసుకుంది. లబ్ధిదారులు కూడా వాటాధనం చెల్లించారు. ఇప్పటివరకు ఈ పథకంపై రూ.4,964 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఎన్‌సీడీసీ నుంచి తీసుకున్న అప్పు, లబ్ధిదారుల వాటాధనంతో కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇంకా 3.70 లక్షల మంది లబ్ధిదారులు మిగిలి ఉన్నారు. పెరిగిన యూనిట్‌ ధర ప్రకారం చూస్తే.. మరో రూ.5 వేల కోట్లు ఈ ఫథకానికి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో, అప్పుల ఊబిలో కూరుకపోవడంతో ఈ పథకానికి నిధులు సర్దుబాటు చేయలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు గొర్రెల పంపిణీ పథకంలో అంతులేని అవినీతి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిసా తదితర రాష్ట్రాల నుంచి గొర్రెలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, గొర్రెల కొనుగోళ్లలో రీ-సైక్లింగ్‌ జరగడం, నాణ్యత లేని గొర్రెలు, చిన్నపిల్లలు కొనడం, కొనకున్నా.. కొన్నట్లు చూపించడం, దళారులు, కాంట్రాక్టర్ల చేతుల్లోకి వ్యవస్థంతా వెళ్లిపోవడం, అక్రమ రవాణా చేయడంతో గొర్రెల పంపిణీ పథకం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా చేతివాటాన్ని ప్రదర్శించడం, కాంట్రాక్టర్లు, దళారులతో కుమ్మక్కవడంతో పథకం దారితప్పింది. వెటర్నరీ అఽధికారులు పెద్దఎత్తున సొమ్ము చేసుకున్నారు. కొందరిపై కేసులు నమోదు చేశారు. ఈ దందా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో పాటు నిధుల కొరత కారణంగా గొర్రెల పంపిణీ పథకానికి తాత్కాలికంగా బ్రేక్‌ వేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. 

Read more