Etala Rajender: కేసీఆర్‌కు తెలంగాణతో బంధం తెగిపోయింది

ABN , First Publish Date - 2022-12-10T03:26:01+05:30 IST

సీఎం కేసీఆర్‌కు తెలంగాణతో బంధం తెగిపోయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

Etala Rajender: కేసీఆర్‌కు తెలంగాణతో   బంధం తెగిపోయింది

పార్టీలో తెలంగాణ పదం రద్దుతోనే పోయింది

రాష్ట్రాన్ని చక్కదిద్దలేనోళ్లు దేశాన్ని బాగుచేస్తారా?

ఉద్యమకాలంలో అటుకులు తిన్న కేసీఆర్‌కు

ఇప్పుడు వేల కోట్లు ఎలా వచ్చాయి?: ఈటల

నల్లగొండ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌కు తెలంగాణతో బంధం తెగిపోయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. తన పార్టీ పేరులో తెలంగాణ పదాన్ని రద్దు చేసుకుని.. ఇక్కడి ప్రజలతో బంధాన్ని కేసీఆర్‌ స్వయంగా తెంచుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని చక్కదిద్దే సత్తాలేని కేసీఆర్‌ దేశాన్ని బాగు చేస్తారా? అని ఎద్దేవా చేశారు. శుక్రవారం నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివా్‌సగౌడ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగోస-బీజేపీ భరోసా యాత్రను ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్షాలపై దాడులు చేస్తూ సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ నేతలు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడబలుక్కొని తెలంగాణ సెంటిమెంటును లేవనెత్తుతున్నారని, దీన్ని ఎవరూ నమ్మరని అన్నారు. ప్రజలు తిప్పి కొడతారని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సురక్షితంగా, సుభిక్షంగా పాలించే సత్తా బీజేపీకే ఉందని అన్నారు. ఈ విషయాన్ని తాజాగా గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయన్నారు. తెలంగాణలోనూ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీకే సాధ్యమని, కేసీఆర్‌ పార్టీని ఓడించే సత్తా బీజేపీకే ఉందని తెలిపారు. ఉద్యమ కాలంలో అటుకులు తిని ఉపవాసం ఉన్న కేసీఆర్‌కు ఇప్పుడు రూ.వేల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కనుమరుగైన రాజకీయ నేతలకు పునరావాస కేంద్రంగా మారడం తప్ప బీఆర్‌ఎస్‌ పార్టీ చేసేదేమీ ఉండదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.వి. సుభాష్‌ హైదరాబాద్‌లో విమర్శించారు.

Updated Date - 2022-12-10T03:26:02+05:30 IST