సమాన ఆదాయ పంపిణీ తక్షణ అవసరం

ABN , First Publish Date - 2022-09-25T07:45:16+05:30 IST

‘‘పేదరిక నిర్మూలన, అందరికీ సమానంగా ఆదాయ పంపిణీ తక్షణం అవసరమైన అంశాలు.

సమాన ఆదాయ పంపిణీ తక్షణ అవసరం

  • అసమానతలు పెరిగితే సవాళ్లు తప్పవు
  • ఐఎస్‌బీలో చంద్రబాబు ఫొటో పెట్టాలి
  • స్థలం కోసం ప్రభుత్వం తరఫున నేనూ పోరాడాను
  • ఐఎస్‌బీలో లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో జస్టిస్‌ ఎన్వీ రమణ

హైదరాబాద్‌ (బిజినెస్‌), హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘పేదరిక నిర్మూలన, అందరికీ సమానంగా ఆదాయ పంపిణీ తక్షణం అవసరమైన అంశాలు. అసమానతలు పెరిగితే.. ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది. అసమానతలు పెరిగితే సామాజిక, రాజకీయ ఆర్థిక పరంగా సవాళ్లు ఎదురవుతాయి. సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే సమస్యలను పరిష్కరించాలంటే.. అన్ని రంగాల్లోని అందరి సాయం అవసరం’’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. శనివారం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన లీడర్‌షిప్‌ సమ్మిట్‌-2022 ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  వ్యాపారమంటే కేవలం సంపద సృష్టించడమే కాదని, అది ఆర్థికపరమైన విముక్తి అని పేర్కొన్నారు. వ్యాపార మోడళ్లను రూపొందించేటప్పుడు దామాషా ప్రకారం సంపద పంపిణీ అయ్యే విధంగా చూడాలని ఐఎస్‌బీ విద్యార్థులకు సూచించారు. తనకు బిజినెస్‌పై అవగాహన లేదని, కానీ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కారణంగా ఉన్న వనరులను ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలుసన్నారు. ప్రపంచంలోనే ఒక ప్రముఖ బిజినెస్‌ స్కూల్‌గా ఐఎస్‌బీ నిలిచిందని చెప్పారు. ఇన్నోవేషన్‌, ఇంక్యుబేషన్‌కు హైదరాబాద్‌ అపార అవకాశాలను కల్పిస్తోందన్నారు. నిరంతర కృషి కారణంగా తెలంగాణ పెట్టుబడుల ఆకర్షణకు రోల్‌ మోడల్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఇందుకు ప్రత్యేక అభినందనలు తెలపాలని ఆయన అన్నారు. 


ప్రజల న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నాను

ఐఎ్‌సబీ క్యాంప్‌సలో ప్రపంచలోని ప్రముఖుల ఫొటోలు, గొప్ప వ్యాపారవేత్తల ఫొటోలు ఏర్పాటు చేయడాన్ని జస్టిస్‌ ఎన్వీ రమణ అభినందించారు. అయితే ఐఎస్‌బీ ఏర్పాటుకు ఎంతో కృషి చేసిన మాజీ సీఎం చంద్రబాబు ఫొటోను కూడా పెట్టుకోవాలని సూచించారు. ఐఎ్‌సబీకి అప్పటి ప్రభుత్వం 250 ఎకరాలు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలయిందని, ఆ సమయంలో తాను ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. వివిధ సంస్థలు, వ్యవస్థల సహకారంతో కోర్టులో ప్రభుత్వం తరఫున న్యాయపోరాటం చేసి గెలిచామన్నారు. ఈ కేసులో అప్పటి హైకోర్టు జడ్జి జస్టిస్‌ పి.సుదర్శన్‌ రెడ్డి చాలా అద్భుతమైన తీర్పును వెలువరించారన్నారు.


తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరూ? అన్నట్లుగా.. హైదరాబాద్‌లో నల్సార్‌ విశ్వవిదాయ్యలం, ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌, ఐఎస్‌బీ ఏర్పాటులో తన ప్రమేయం కూడా ఉన్నందుకు సంతోషంగా ఉంద ని పేర్కొన్నారు. తాను సీజేఐగా ఉన్నప్పుడు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై దృష్టి సారించానని, న్యాయవ్యవస్థలో ఖాళీగా ఉన్న స్థానాలు భర్తీ చేసేందుకు కృషి చేశానని తెలిపారు. ప్రజల న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. సదస్సులో మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఎండీ రాజీవ్‌ కుమార్‌, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్‌, ఐఎస్‌బీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read more