పాలమూరుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేం

ABN , First Publish Date - 2022-10-05T09:12:05+05:30 IST

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రెండో దశ పర్యావరణ అనుమతులు ఇవ్వడానికి కేంద్రం నిరాకరించింది.

పాలమూరుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేం

  • నిబంధనలు ఉల్లంఘించి పనులు చేపట్టారు
  • అంతర్రాష్ట్ర విభాగం క్లియరెన్స్‌ అవసరం
  • సమస్యల పరిష్కారానికి ఏంచేస్తారో చెప్పలేదు 
  • కోర్టు కేసులు కూడా తేలాల్సి ఉంది..
  • రాష్ట్ర దరఖాస్తును పక్కనపెట్టిన కేంద్ర కమిటీ

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రెండో దశ పర్యావరణ అనుమతులు ఇవ్వడానికి కేంద్రం నిరాకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న దరఖాస్తును కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు చెందిన ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ (ఈఏసీ) పక్కనపెట్టింది. రెండో దశ అనుమతుల కోసం ఈఏసీకి రాష్ట్ర సర్కారు దరఖాస్తు చేయడంతో... సెప్టెంబరులో వర్చువల్‌ విధానంలో కమిటీ సమావేశం జరిగింది. ఇందులో పలు అంశాలు ముడిపడి ఉన్నందున ప్రస్తుతానికి పర్యావరణ అనుమతి ఇవ్వలేమని పేర్కొంటూ మంగళవారం రాత్రి నిర్ణయాన్ని వెలువరించింది. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, నల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీటిని అందించడానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 60 రోజుల్లో రోజుకు 1.5 టీఎంసీల నీటిని తరలించేలా 90 టీఎంసీలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్‌లో 8.51 టీఎంసీలు, ఏదులలో 6.55 టీఎంసీలు, వట్టెంలో 16.74 టీఎంసీలు, కరివెనలో 17.34 టీఎంసీలు, ఉద్ధండాపూర్‌లో 16.03 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పంప్‌హౌ్‌సల నిర్మాణం ఒకటే జరగాల్సి ఉంది.


 వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి పొందడానికి వీలుగా ప్రజాభిప్రాయ సేకరణ జరపడానికి కేంద్రం 2017 అక్టోబరులోనే ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. గతేడాది ఆగస్టులో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి.. సుదీర్ఘ విరామం అనంతరం పర్యావరణ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు పెట్టింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు తరలించిన 80 టీఎంసీలకు బదులుగా... సాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలకు బచావత్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన వెసులుబాటుతో దక్కిన 45 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకు కేటాయించుకుంటూ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి పలు అంశాలు అసంపూర్తిగా ఉన్న కారణంగా దరఖాస్తును పక్కనపెట్టినట్లు ఈఏసీ స్పష్టం చేసింది. నీటి కేటాయింపుల అంశం అంతరాష్ట్ర అంశాలతో ముడిపడి ఉందని, దీనికి కేంద్ర జలవనరుల సంఘంలోని అంతరాష్ట్ర విభాగం క్లియరెన్స్‌ తీసుకోవాలని పేర్కొంది. అలాగే ప్రజాభిప్రాయ సేకరణలో లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలను ప్రతిపాదించలేదని తెలిపింది. అదేవిధంగా ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో ఉన్న రెండు కేసులపై తుది తీర్పు రావాల్సి ఉందని ఈఏసీ పేర్కొంది. అంతేగాక రెండో దశ అనుమతులు తీసుకోకుండానే పనులు చేశారని, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని ఎన్జీటీ నేతృత్వంలోని కమిటీ తేల్చిన విషయాన్ని ఈఏసీ ప్రస్తావించింది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకున్న చర్యల నివేదికలో పేర్కొన్న అంశాలకు, బడ్జెట్‌ కేటాయింపులకు మధ్య తేడాను గుర్తించినట్లు ఈఏసీ స్పష్టంచేసింది. ఆయా అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని, అప్పటివరకు పర్యావరణ అనుమతులను వాయిదావేస్తున్నామని తెలిపింది.

Updated Date - 2022-10-05T09:12:05+05:30 IST