ఏడాదిలో 17,867 కోట్లు

ABN , First Publish Date - 2022-06-07T08:24:49+05:30 IST

‘‘గత ఏడాది కాలంలో రాష్ట్రానికి రూ.17,867 కోట్ల పెట్టుబడులు కొత్తగా వచ్చాయి. 3,938 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.

ఏడాదిలో 17,867 కోట్లు

రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులివి

3,939 పరిశ్రమలు.. 96 వేల మందికి ఉపాధి

నిరుడు రాష్ట్ర తలసరి ఆదాయం 2,78,833

10 వేల ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు

ఎనిమిదేళ్లలో కేంద్రం పైసా రాయితీ ఇవ్వలేదు

అయినా పారిశ్రామిక రంగంలో 

మనం దూసుకెళుతున్నాం: మంత్రి కేటీఆర్‌

పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక విడుదల

రాయితీలు విడుదల చేయాలని 

కేటీఆర్‌కు పారిశ్రామికవేత్తల వినతి


హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ‘‘గత ఏడాది కాలంలో రాష్ట్రానికి రూ.17,867 కోట్ల పెట్టుబడులు కొత్తగా వచ్చాయి. 3,938 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటి ద్వారా 96,863 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి’’ అని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వివరించారు. గత ఏడాదిలో తెలంగాణ జీఎ్‌సడీపీ రూ.11.54 లక్షల కోట్లుగా నమోదైందని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 19.1 శాతం పెరిగిందని చెప్పారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,78,833గా ఉండగా, దేశ తలసరి ఆదాయం రూ.1,49,848 మాత్రమేనని వివరించారు. పరిశ్రమల శాఖ గత ఏడాదిలో సాధించిన వృద్ధిపై 2021-22 వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్‌ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ సగటుతో పోలిస్తే ఆర్థికాభివృద్ధితో పాటు అనేక అంశాల్లో తెలంగాణ ఎన్నో రెట్లు ముందంజలో ఉందన్నారు. టీఎ్‌సఐపాస్‌ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ గత ఎనిమిదేళ్లలో రూ.2.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 16.48 లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన పారిశ్రామిక అనుకూల విధానాలతో గత ఎనిమిదేళ్లలో అనేక జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయన్నారు.


గత ఏడాది టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో కొత్తగా 13 పారిశ్రామిక పార్కులు ప్రారంభమయ్యాయని, వాటిలో 526 పరిశ్రమలకు 810 ఎకరాలను కేటాయించామని అన్నారు. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా రంగంలో పెట్టుబడులకు అనేక విదేశీ కంపెనీలు సైతం ఆసక్తిగా ఉన్నాయని, రూ.6,400 కోట్ల పెట్టుబడులతో 215 ప్రతిపాదనలు అందాయని వివరించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల సంఖ్య పెరిగిందని, రైతు బంధు, రైతు బీమా, మిషన్‌ కాకతీయ, గొర్రెల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లాలో కనీసం 500 ఎకరాలను కేటాయిస్తున్నామని చెప్పారు.


కేంద్రం సహకారం లేకపోయినా..

రాష్ట్రాల హక్కులను హరిస్తూ సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తోందంటూ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విరుచుకుపడ్డారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అన్న ప్రాథమిక సూత్రాన్ని కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. కేంద్రానికి అత్యధిక పన్నులు చెల్లిస్తున్న తొలి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని, అయినా, రాష్ట్రాభివృద్ధికి ఢిల్లీ పెద్దలు చేస్తున్నదేమీ లేదని విమర్శించారు. పరిశ్రమలకు రాయితీలు అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని తప్పుబట్టారు. నోట్ల రద్దు వంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా, కొవిడ్‌లాంటి మహమ్మారి విరుచుకుపడినా, కేంద్రం నుంచి పైసా సహకారం లేకపోయినా తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. ఈ సందర్భంగా, పలు కొత్త పరిశ్రమలు తమ పెట్టుబడులకు సంబంఽధించి ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, కమిషనర్‌ కృష్ణ భాస్కర్‌, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, ఎండీ వెంకట నర్సింహారెడ్డి, పారిశ్రామికవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


పరిశ్రమలు మూత పడుతున్నాయి

మా సమస్యలను పరిష్కరించండి..

కేటీఆర్‌కు పారిశ్రామికవేత్తల వినతి

రాష్ట్రంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రి కేటీఆర్‌ను కోరారు. వార్షిక నివేదిక విడుదలకు ముందు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొవిడ్‌ తర్వాత రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. బ్యాంకు రుణాలు చెల్లించలేక, కొత్త రుణాలు అందక పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం క్రియాశీలంగానే స్పందిస్తున్నా.. రాయితీలను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు చెల్లించాల్సిన పాత రాయితీలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.



Updated Date - 2022-06-07T08:24:49+05:30 IST