దివ్యాంగుడిని కౌన్సెలింగ్‌లో పాల్గొననీయండి

ABN , First Publish Date - 2022-10-14T09:13:59+05:30 IST

ఒక చేయి సరిగా లేని ఓ దివ్యాంగుడికి నీట్‌- 2022 ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ), కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ, ఇతర ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

దివ్యాంగుడిని కౌన్సెలింగ్‌లో పాల్గొననీయండి

 ఎన్‌ఎంసీ, హెల్త్‌ వర్సిటీలకు హైకోర్టు ఆదేశాలు 

క చేయి సరిగా లేని ఓ దివ్యాంగుడికి నీట్‌- 2022 ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ), కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ, ఇతర ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఎంబీబీఎస్‌ చేసే విద్యార్థులకు రెండు చేతులు సరిగా ఉండాలని పేర్కొంటున్న ఎన్‌ఎంసీ నిబంధన వల్ల తాను అవకాశం కోల్పోతున్నానని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన ఒమర్‌ సలీం అహ్మద్‌ అనే విద్యార్థి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది అవినాశ్‌ దేశాయి వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ అన్ని దశల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చారని, ల్యాబ్‌ పరీక్షలు సహా 12వ తరగతిలో ఉత్తమ గ్రేడ్‌ సాధించారని తెలిపారు. నీట్‌లో దివ్యాంగుల కోటాలో 113వ ర్యాంకు సాధించారని చెప్పారు. రెండు చేతులు సరిగా ఉండాలన్న నిబంధనను కొట్టేసి, ఎంబీబీఎస్‌ చదవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదిస్తూ ఎంబీబీఎస్‌ కోర్సు ఒక వ్యక్తికి సంబంఽధించిన విషయం కాదని, అందులో సమాజ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉంటాయని తెలిపారు.వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఎంబీబీఎస్‌ చదివిన డాక్టర్లు అందరూ సర్జన్‌లు కాదనే విషయాన్ని గుర్తించాలని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌కు ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీచేసింది.  

Updated Date - 2022-10-14T09:13:59+05:30 IST