చైనా లోన్‌ యాప్‌లపై ఈడీ కొరడా

ABN , First Publish Date - 2022-09-17T08:37:50+05:30 IST

చైనా నియంత్రిత లోన్‌ యాప్‌లపై విచారణలో భాగంగా రూ.46.67 కోట్ల నిధులను స్తంభింపజేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శుక్రవారం వెల్లడించింది.

చైనా లోన్‌ యాప్‌లపై ఈడీ కొరడా

  • రూ. 46.67 కోట్లు ఫ్రీజ్‌ 
  • మనీలాండరింగ్‌ చట్టం కింద చర్యలు 

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): చైనా నియంత్రిత లోన్‌ యాప్‌లపై విచారణలో భాగంగా రూ.46.67 కోట్ల నిధులను స్తంభింపజేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శుక్రవారం వెల్లడించింది. ఈజ్‌బజ్‌, రోజర్‌ పే, క్యాష్‌ఫ్రీ, పేటీఎంల ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే ఖాతాల్లో వ్యాపార సంస్థలు ఉంచిన ఈ సొమ్మును నిలిపివేసినట్టు తెలిపింది. ఇటీవల ఈడీ అధికారులు చైనా నియంత్రిత ఇన్వెస్ట్‌మెంట్‌ టోకెన్‌ యాప్‌పై దాడులు నిర్వహించారు. అందులోభాగంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్నారు. ఈ నెల మొదట్లో బెంగళూరులోని రోజర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ సముదాయాల్లో సోదాలు చేశారు. ఆ తర్వాత ఈ నెల 14న యాప్‌-ఆధారిత టోకెన్‌ హెచ్‌పీజెడ్‌, దాని అనుబంధ సంస్థల్లో మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ, ముంబై, ఘజియాబాద్‌, లఖ్‌నవూ, గయాలో బహుళ సముదాయాల్లో సోదాలు నిర్వహించారు. విచారణలో భాగంగా హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్‌, ముంబై, పుణె, చెన్నై, జైపూర్‌, జోధ్‌పూర్‌లలో బ్యాంకులు, పేమెంట్‌ గేట్‌వేలకు చెందిన 16 చోట్ల తనిఖీలు నిర్వహించినట్టు ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది.


గురుగ్రామ్‌ కేంద్రంగా... 

చైనా లోన్‌ యాప్‌లతో పాటు పెట్టుబడులు స్వీకరించిన ఇన్వెస్ట్‌మెంట్‌ టోకెన్‌లపై ఈడీ తనిఖీలు నిర్వహించింది. గురుగ్రామ్‌కు చెందిన ఎంఎస్‌ జిలియన్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పెట్టుబడులు స్వీకరించడంలో కీలకపాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. ఎక్స్‌10 ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్న ఎంఎస్‌ మ్యాడ్‌-ఎలిఫెంట్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వివిధ రుణ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు కనుగొన్నారు. సుహుయ్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎంఎస్‌ నిమిషా ఫైనాన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఒప్పందంతో లోన్‌యా్‌పలు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. కాగా ఈడీ ఫ్రీజ్‌ చేసిన సొమ్ము తమ కంపెనీది కాదని పేటీఎం వివరణ ఇచ్చింది. నిబంధనల కు అనుగుణంగానే నగదు రహిత లావాదేవీలు జరిగినట్టు క్యాష్‌ఫ్రీ తెలిపింది. అనుమానాస్పద సంస్థలను గుర్తించి ఏడాది క్రితమే బ్లాక్‌ చేశామని రోజర్‌పే ప్రతినిధి వెల్లడించారు. 

Read more