దసరాకు సచివాలయ ప్రారంభం లేనట్టే!

ABN , First Publish Date - 2022-09-29T07:42:30+05:30 IST

రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవం దసరా రోజున జరిగే పరిస్థితి కనిపించడం లేదు. సచివాలయం ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినా.

దసరాకు సచివాలయ ప్రారంభం లేనట్టే!

పనులు పూర్తవడానికి మరో 3 నెలలు

రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవం దసరా రోజున జరిగే పరిస్థితి కనిపించడం లేదు. సచివాలయం ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినా.. ఇంకా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడేలా ఉంది. పనులు జరుగుతున్న తీరును బట్టి చూస్తే.. భవనాల సముదాయం పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయా భవనాలకు సంబంధించి వెలుపలి పనులు పూర్తి కావచ్చినా.. అంతర్గతంగా చాలా పనులు పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నూతన సచివాలయం పనులు ప్రారంభమై మూడేళ్లు కావస్తోంది. 2019 ఆగస్టులో సచివాలయ ఉద్యోగులను ఖాళీ చేయించి బీఆర్కే భవన్‌తోపాటు అందుబాటులో ఉన్న ఇతర భవనాలకు తరలించారు. ఆ తర్వాత కూల్చివేత పనులు చేపట్టారు. రూ.617కోట్ల అంచనా వ్యయంతో 26 ఎకరాల్లో 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం ఏడు అంతస్తుల్లో నూతన సచివాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. అయితే, ఇటీవల నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. ఆశించినంత వేగంగా జరగడం లేదని అధికారులపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం మంత్రి ప్రశాంత్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల వేగం పెంచాలని సూచించారు. కానీ, పనులు పూర్తయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Updated Date - 2022-09-29T07:42:30+05:30 IST