మెడికల్‌ కాలేజీల్లో విధులకు డుమ్మా!

ABN , First Publish Date - 2022-05-30T08:58:22+05:30 IST

సర్కారీ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసర్లే..

మెడికల్‌ కాలేజీల్లో విధులకు డుమ్మా!

  • నెలలో సగం రోజుల పాటు ప్రొఫెసర్ల  గైర్హాజరు
  • ‘నల్లగొండ’ వివాదంతో బట్టబయలైన వ్యవహారం
  • రాష్ట్రవ్యాప్తంగా చాలా కళాశాలల్లో ఇదే పరిస్థితి
  • మింగుడుపడని వ్యవహారంగా.. ‘బయోమెట్రిక్‌’
  • తప్పనిసరి చేయొద్దంటూ ప్రిన్సిపాళ్లకు  హెచ్చరికలు


హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): సర్కారీ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసర్లే.. విధులకు డుమ్మా కొడుతున్నారు. చాలామంది హైదరాబాద్‌ నుంచి జిల్లాల్లోని కాలేజీలకు వచ్చిపోతూ.. వారానికి రెండు, మూడు రోజులే విధులకు హాజరవుతున్నారు. వాస్తవానికి వైద్య విద్యను ఇతర కోర్సులు మాదిరిగా చూడలేం. అధ్యాపకులు తప్పనిసరిగా కాలేజీలకు రావాలి. విద్యార్థులకు నేర్పించాలి. కానీ, రాష్ట్రంలోని చాలా మెడికల్‌ కాలేజీల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మార్చి నుంచి బయోమెట్రిక్‌  హాజరును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అంతేగాక విధులకు హాజరైతేనే వేతనాలు ఇస్తామని స్పష్టం చేయడం సీనియర్‌ అధ్యాపకులు, వైద్యులకు మింగుడుపడడం లేదు. దీంతో  ప్రిన్సిపాళ్లను బెదిరింపులకు గురి చేస్తున్నారు. బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేయొద్దని, మీ బండారం బయటపెడతామంటూ హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాంట్రాక్టు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని వైద్యులతో ఇబ్బందుల్లేకున్నా.. రెగ్యులర్‌ అధ్యాపకులతోనే సమస్యలు ఎదురవుతున్నాయి. 


ఈ మేరకు ఓ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ వారం క్రితం ప్రభుత్వానికి నివేదిక పంపారు. కాగా, ఇటీవల నల్లగొండ మెడికల్‌ కాలేజీలో విధులకు సక్రమంగా హాజరు కావడం లేదంటూ 57 మంది అధ్యాపకులకు ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి మెమోలు జారీ చేయడం వివాదాస్పదమైంది. వారందరూ విధులు బహిష్కరిండమే కాక ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో ప్రభుత్వం వివరణ కోరింది. ప్రిన్సిపాల్‌ బయోమెట్రిక్‌ వివరాలతో నివేదిక పంపగా.. అధ్యాపకుల వ్యవహారం బట్టబయలైంది. 16 మంది నెలలో 11 రోజులు, 9 మంది తొమ్మిది రోజులు, మరో ఏడుగురు 8 రోజుల పాటు, మిగిలిన 25 మంది ఐదు రోజుల పాటు డుమ్మా కొట్టినట్టు తేలింది.  ఇదిలా ఉంటే.. ఎన్‌ఎంసీ బృందాలు ఆకస్మిక తనిఖీలకు వచ్చినప్పుడు కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య రికార్డుల్లో సూచించిన విధంగా ఉండాలని, లేకుంటే కొన్ని సార్లు ఉన్న సీట్లలో కొతపెట్టే ప్రమాదం ఉందన్న వాదన వినిపిస్తోంది.

Updated Date - 2022-05-30T08:58:22+05:30 IST