ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వం

ABN , First Publish Date - 2022-09-19T07:34:13+05:30 IST

బియ్యం సేకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఘర్షణను కొందరు రైస్‌మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వం

  • సీఎంఆర్‌ అప్పగింతకు ససేమిరా అంటున్న రైస్‌మిల్లర్లు
  • ‘ఎఫ్‌ఏక్యూ’ నిబంధనలు పాటించేందుకు విముఖత!
  • పౌర సరఫరాల శాఖకైతేనే ఇస్తామంటూ షరతులు
  • ఎఫ్‌సీఐ నిబంధనలు పక్కాగా అమలు చేస్తుండడం వల్లే!
  • యాసంగి ధాన్యం మిల్లింగ్‌ను ఇంకా మొదలుపెట్టని వైనం
  • గత వానాకాలం బియ్యం బకాయిలే 20 లక్షల టన్నులు
  • అధికారుల నుంచి చర్యలు లేకపోవడంతో ఇష్టారాజ్యం

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బియ్యం సేకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఘర్షణను కొందరు రైస్‌మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ)కి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ డెలివరీ ఇవ్వటానికి మొండికేస్తున్నారు. ఎఫ్‌ఏక్యూ (ఫేర్‌ యావరేజ్‌ క్వాలిటీ) నిబంధనలు పాటిస్తూ నాణ్యమైన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వటానికి ససేమిరా అంటూ.. పౌరసరఫరాల సంస్థకైతేనే ఇస్తామంటున్నారు. దీంతో సీఎంఆర్‌ టార్గెట్‌ పూర్తిచేయడానికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆపసోపాలు పడాల్సి వస్తోంది. బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రైస్‌మిల్లర్లు ఇచ్చే కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ ‘ఎఫ్‌ఏక్యూ’ నిబంధనలకు లోబడి ఉంటేనే పాస్‌ చేస్తోంది. బాయిల్డ్‌ రైస్‌ అయితే క్వింటాలు ధాన్యానికి 68 శాతం బియ్యం, రా రైస్‌ అయితే 67 శాతం బియ్యం తీసుకుంటోంది. ఇందులో నూకలకు 25 శాతం వరకు మినహాయింపు ఉంటుంది. అంతకంటే ఎక్కువ నూకలు ఉంటే ఎఫ్‌సీఐ అధికారులు అనుమతించడంలేదు. ఏజ్‌ టెస్ట్‌, కలర్‌ టెస్ట్‌ కూడా తప్పనిసరి చేశారు. ఎక్కువ రోజుల క్రితం మిల్లింగ్‌ చేసిన బియ్యమైనా, రీసైక్లింగ్‌ బియ్యమైనా, రంగు మారినా, చాకీ (పిండిగా మారే బియ్యం) ఎక్కువ ఉన్నా ఎఫ్‌సీఐ తిరస్కరిస్తోంది. 


నిబంధనల పక్కా అమలుతో..

రీసైక్లింగ్‌కు అలవాటు పడిన కొందరు రైస్‌మిల్లర్లకు ఎఫ్‌సీఐ నిబంధనలు మింగుడుపడటంలేదు. పైగా.. ఏ సీజన్‌ ధాన్యాన్ని ఆ సీజన్‌లోనే మిల్లింగ్‌ చేయకుండా ఏడాది, ఏడాదిన్నరకు పైగా జాప్యం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి అప్పగించిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు సొంత వ్యాపారం కోసం వినియోగించుకుంటున్నారు. ఆ తర్వాత దళారుల నుంచి పీడీఎస్‌ బియ్యం కొనుక్కొని ఎఫ్‌సీఐకి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఎఫ్‌సీఐ అధికారులు కఠినంగా ఉండటం, నిబంధనలు పక్కాగా అమలు చేస్తుండటంతో నాణ్యతలేని బియ్యం పాస్‌ కావడంలేదు. ఇందుకు గతేడాది (2021- 22) వానాకాలం సీజన్‌ ముడి(రా) బియ్యం డెలివరీయే నిదర్శనం. ఆ సీజన్‌లో 70.22 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అప్పగించింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసిన 47 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్‌ రూపంలో మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు 26.53 లక్షల టన్నులే సీఎంఆర్‌ డెలివరీ అయింది. ఇంకా 20.51 లక్షల టన్నుల బియ్యం బకాయిలు ఉన్నాయి. గత వానాకాలం సీఎంఆర్‌ అప్పగింతకు ఈ సెప్టెంబరు నెలాఖరు వరకే గడువు ఉంది. అయినా 56.4 శాతం టార్గెట్‌ మాత్రమే పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,623 రా రైస్‌ మిల్లుల్లో ఒక రోజులో ఒక్కో షిఫ్టుకు 38 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ, మిల్లర్లు రోజుకు 10-11 వేల టన్నులు కూడా ఎఫ్‌సీఐకి డెలివరీ ఇవ్వడంలేదు. 


వారం రోజులుగా బియ్యం ఇవ్వని మిల్లర్లు..

వారం రోజులుగా పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్‌, మంచిర్యాల, మహబూబాబాద్‌, నిర్మల్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి ఒక్క టన్ను బియ్యం కూడా డెలివరీ ఇవ్వడంలేదు. మరోవైపు 2021-22 యాసంగి సీజన్‌కు సంబంధించి ఇప్పటికే 14 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ స్వీకరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కానీ, బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు ఇంతవరకు యాసంగి ధాన్యం మిల్లింగ్‌నే ప్రారంభించలేదు. కొందరు మిల్లింగ్‌ ప్రారంభించినా.. ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. రైస్‌మిల్లర్ల దందాపై రాష్ట్ర పౌరసరఫరాల భవన్‌కు ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనకడుగేస్తున్నారు. ఎఫ్‌సీఐ ఫిజికల్‌ వెరిఫికేషన్‌ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం, పౌరసరఫరాల సంస్థ అధికారులు గగ్గోలు పెట్టారు. కానీ, సీఎంఆర్‌ కోసం అప్పగించిన ధాన్యం రైస్‌మిల్లుల్లో మాయం అవుతుంటే మాత్రం పట్టించుకునేవారే కరువయ్యారు. 

 

పౌరసరఫరాల సంస్థకు ఇచ్చేందుకు పోటీ..

ఎఫ్‌సీఐకి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ ఇవ్వటానికి మొండికేస్తున్న కొందరు రైస్‌మిల్లర్లు.. పౌరసరఫరాల సంస్థకు ఇచ్చేందుకు మాత్రం ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే నూకలు 25 శాతానికి బదులుగా 35, 40 శాతం వరకు ఉన్నా పౌరసరఫరాలసంస్థ అధికారులు బియ్యం కన్సల్‌మెంట్లు పాస్‌ చేస్తున్నారు. బియ్యం రంగు మారినా, తుట్టెలు కట్టినా, తెల్ల పురుగులు ఉన్నా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తున్నారు. వాటిని తీసుకెళ్లి గోదాముల్లో పడేస్తున్నారు. దీంతో ఎఫ్‌సీఐ బియ్యానికి డిమాండ్‌ తగ్గిపోయింది. పౌరసరఫరాల సంస్థకు పోటీ పెరిగింది. రైస్‌మిల్లర్లు, కొందరు అసోసియేషన్‌ నాయకులు పైరవీలు చేస్తూ సివిల్‌ సప్లైస్‌ కోటా(స్టేట్‌ పూల్‌) పెంచుకుంటున్నారు. సెంట్రల్‌ పూల్‌ టార్గెట్‌ తగ్గించి స్టేట్‌ పూల్‌ కోటా పెంచినందుకు అధికారులకు మామూళ్లు ముట్టజెప్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా నల్లగొండ జిల్లాకు 14,500 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని స్టేట్‌ పూల్‌ కేటగిరీలో చేర్చారు.  ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు చర్చ జరుగుతోంది. తరచుగా సెంట్రల్‌ పూల్‌, స్టేట్‌ పూల్‌ టార్గెట్లు, అంకెలు, లెక్కలు మారుస్తుండటంతో.. ఎఫ్‌సీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.


సమీక్ష లేదు... చర్యలు లేవు!

నిర్ణీత సమయంలో రైస్‌మిల్లర్లు సీఎంఆర్‌ ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం గానీ, పౌరసరఫరాల సంస్థ గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. రాష్ట్రంలో మిల్లింగ్‌ కెపాసిటీ ఎంత ఉంది? రోజుకు ఎంత సీఎంఆర్‌ డెలివరీ ఇవ్వొచ్చు? ఎంత ఇస్తున్నారు? జాప్యానికి కారణాలేమిటి? అని సమీక్ష నిర్వహించే నాధుడే కరువయ్యాడు. గతంలో రోజువారీ టార్గెట్‌, వారం, నెలవారీ టార్గెట్లు పెట్టి.. ఎఫ్‌సీఐకి సకాలంలో బియ్యం డెలివరీ చేసేలా చర్యలు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో రైస్‌మిల్లర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. బియ్యం ఎగ్గొట్టిన రైస్‌ మిల్లర్లపై చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదు. 2019-2020 సంవత్సరం బియ్యం లక్ష మెట్రిక్‌ టన్నులు, 2020-21 యాసంగి బియ్యం 1.10 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఎగ్గొట్టారు. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. బియ్యం రికవరీ చేసిన దాఖలాలు కూడా లేవు.

Updated Date - 2022-09-19T07:34:13+05:30 IST