స్పీకర్‌ రాజకీయ విమర్శలు చేస్తారా?

ABN , First Publish Date - 2022-09-08T09:28:36+05:30 IST

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి కేంద్ర మంత్రిపై రాజకీయ విమర్శలు చేయడమేంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు.

స్పీకర్‌ రాజకీయ విమర్శలు చేస్తారా?

  • ఆయనపైనే చర్యలు తీసుకోవాలి: బండి 
  • క్షమాపణ చెప్పాల్సింది కేసీఆరే: ఈటల
  • మరమనిషి అంటే తప్పేంటి?: రఘునందన్‌
  • ఆయనపైనే చర్యలు తీసుకోవాలి: సంజయ్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి కేంద్ర మంత్రిపై రాజకీయ విమర్శలు చేయడమేంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. సభ్యులందర్నీ సమన్వయం చేస్తూ సభ సజావుగా జరిగేలా పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్‌ అందుకు విరుద్ధంగా, సీఎంకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని, ఆయనపైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ తీరుపై శాసనసభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగా నియమితులైన పార్టీ పార్లమెంట్‌  కన్వీనర్లతోపాటు జిల్లా ఇన్‌చార్జిలతో సంజయ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తమ సభ్యులు నిలదీస్తారనే భయంతోనే సభను రెండు రోజులపాటే నిర్వహించి తూతూ మంత్రంగా ముగించాలని చూస్తున్నారన్నారు. సమస్యలపై సభలో చర్చించే అవకాశం రాకపోతే.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తేల్చుకుంటామని ఆయన హెచ్చరించారు.


 శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి క్షమాపణ చెప్పాల్సింది తాను కాదని సీఎం కేసీఆరేనని ఎమ్మె ల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హుందాగా, ధర్మంగా ఉండే స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ఇష్టం వచ్చినట్లు పని చేయిస్తున్నారని, ఆయన స్థాయి తగ్గిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్‌ను తాను అవమానపర్చలేదని, ఆయన తన తండ్రిలాంటి వారని, ఆయనపై తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. సీఎం తన ముఖం చూడొద్దనుకుంటే బహిరంగంగా చెప్పాలని ఆయన అన్నారు. ‘మరమనిషి అంటే తప్పేముంది? ఈ పదాన్ని ఏమై నా నిషేదించారా? అలా అని ఏ చట్టం, ఏ పుస్తకంలో ఉందో చెప్పాలి’ అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.  స్పీకర్‌కు తాము క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్‌సింగ్‌ అమెరికా, యూకే వెళ్తే కొన్ని ఆంగ్ల పత్రికలు మరమనిషి అంటూ రాశాయని, అప్పుడు ఎందుకు కేసులు నమోదు చేయలేదని నిలదీశారు. 


బెదిరింపులకు భయపడేది లేదు 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌రావులు అన్నారు.  తమకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. నోటీసులు అందిన తర్వాత తాము స్పందిస్తామన్నారు.  

Read more