‘ఉస్మానియా’లో మరో అధ్యాయం

ABN , First Publish Date - 2022-10-03T17:59:50+05:30 IST

ఇన్‌ఫెక్షన్‌తో కుళ్లిపోయి, కమిలిపోయి తొలగించే దశకు చేరుకున్న కాలుకు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పునరుజ్జీవం పోశారు. కాలు తీయకుండా మెరుగైన చికిత్స అందించి పూర్వస్థితికి

‘ఉస్మానియా’లో మరో అధ్యాయం

ఇన్‌ఫెక్షన్‌ సోకిన కాలుకు పునరుజ్జీవం

ఒకే దశలో శస్త్రచికిత్స 

రెండు నెలల్లోనే పూర్వస్థితి

కుళ్లిన కాలును తొలగించకుండానే ..

ఇతర శరీర భాగాలకు మెరుగైన వైద్యం

డెర్మటోమ్‌ స్కిన్‌ మెషర్‌ టెక్నాలజీ ఆధునిక చికిత్సలు

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వైద్య ఖర్చు పూర్తిగా ఉచితం

ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం ఘనత


హైదరాబాద్‌ సిటీ: ఇన్‌ఫెక్షన్‌తో కుళ్లిపోయి, కమిలిపోయి తొలగించే దశకు చేరుకున్న కాలుకు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పునరుజ్జీవం పోశారు. కాలు తీయకుండా మెరుగైన చికిత్స అందించి పూర్వస్థితికి తీసుకురావడంలో ఉస్మానియా ప్లాస్టిక్‌ సర్జరీ-2 విభాగం విజయం సాధించింది. మడమ నుంచి తొడ వరకు ఇన్‌ఫెక్షన్‌ సోకిన కాలును తొలగించాలని ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు సూచిస్తుండడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులకు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ధైర్యం చెప్పి మెరుగైన చికిత్సను అందించి సాధారణ జీవనంలో అడుగుపెట్టేలా చేశారు. రూ.5 లక్షల నుంచి రూ. 10లక్షల వరకు వ్యయం అయ్యే వైద్యానికి ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో పూర్తిగా ఉచిత సేవలు అందించి బాధితులకు ఊరటనిచ్చారు.


ఓ బాధితుడికి ఇలా..

సూర్యాపేట జిల్లా కొమ్మాల గ్రామానికి చెందిన అయోధ్య అనే రైతుకు పొలం పనులు చేస్తుండగా.. భూమిలో పాతుకుపోయిన గాజుసీసా కాలి మడిమకు గుచ్చుకొని తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే స్థానిక ఆర్‌ఎంపీ వద్ద యాంటీ సెప్టిక్‌ ఇంజక్షన్‌ చేయించుకున్నాడు. మూడోరోజు కాలు వాపొచ్చి క్రమంగా కదల్లేని స్థితికి చేరాడు. వెంటనే సూర్యాపేటలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళితే ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, కాలును తొలగించకపోతే గుండె, కిడ్నీపై ప్రభావం చూపుతుందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆ నిరుపేద కుటుంబం కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లలేక ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు కాలు మొత్తం సెఫ్టిక్‌ అయినట్లు గుర్తించారు. నాలుగు రోజుల్లోనే కాలు మడిమ భాగం నుంచి తొడ భాగం వరకు చర్మం మొత్తం చచ్చుబడిపోయినట్లు తేల్చారు. ఆ ప్రభావం కిడ్నీలు, గుండెపై పడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని గ్రహించి.. చచ్చుబడిన చర్మాన్ని తొలగించారు. ఆ ప్రాంతంలో ఎప్పటికప్పుడు మెరుగైన చికిత్స అందిస్తూ రోజూ శుభ్రం చేశారు. దీంతో రైతుకు ప్రాణాపాయం తప్పింది. తొలగించిన చర్మం స్థానంలో కొత్త చర్మం కోసం కేసును ప్లాస్టిక్‌ సర్జరీ విభాగానికి రిఫర్‌ చేశారు. ప్లాస్టిక్‌ సర్జరీ-2 విభాగాధిపతి డాక్టర్‌ పలుకూరి లక్ష్మి రోగిని పరిశీలించారు. అత్యాధునిక టెక్నాలజీ డెర్మటోమ్‌ స్కిన్‌ మెషర్‌ ఎక్వి్‌పమెంట్‌తో వేరే కాలు నుంచి తీసిన చర్మాన్ని స్కిన్‌మెషర్‌ ద్వారా ఎక్స్‌పెండ్‌(సాగతీసి) చేసిన డాక్టర్‌ లక్ష్మీ వైద్యుల బృందం తొలగించిన చర్మం స్థానంలో చేర్చి శస్త్ర చికిత్స చేశారు. ఈ అత్యాధునికి ప్లాస్టిక్‌ సర్జరీ ఆపరేషన్‌తో గాయాన్ని పూడ్చి కాలు యథాస్థితికి వచ్చేలా చేశారు. ఇప్పుడా నిరుపేద రైతు కళ్లలో అనందం, బాధిత కుటుంబ సభ్యుల్లో పట్టరాని సంతోషం. 


ఈ యంత్రంలో ఇలా..

డెర్మటోమ్‌ స్కిన్‌ మెషర్‌ ఎక్వి్‌పమెంట్‌ ద్వారా చాలా తక్కువ మొత్తంలో ఇతర శరీర భాగాల నుంచి చర్మాన్ని తీసి.. గాయం అయిన ప్రాంతంలో స్కిన్‌ మెషర్‌ ద్వారా ఎక్స్‌పెండ్‌ (సాగతీసి) చేసి శస్త్రచికిత్స చేస్తారు. ఇంతకుముందు ఏదైనా గాయానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయాలంటే గాయం ఎంత ఉంటే అంతే మోతాదులో చర్మాన్ని తీసి సర్జరీతో పూడ్చాల్సి వచ్చేది. అందుకు సుమారు 5, 6 సార్లు విడతల వారీగా సర్జరీలు చేయాల్సి వచ్చేది. దాంతో రోగి కోలుకోవడానికి చాలా ఎక్కువ సమయం పట్టేది. కానీ  డెర్మటోమ్‌ స్కిన్‌ మెషర్‌ టెక్నాలజీ ద్వారా 50 శాతం ఉన్న గాయానికి కూడా కేవలం 5నుంచి 6 శాతం మేరకు మాత్రమే చర్మాన్ని తీసుకొని ఒకే సైకిల్‌లో సర్జరీ చేసి మొత్తం గాయం పూడ్చేలా శస్త్ర చికిత్స చేయొచ్చని డాక్టర్‌ లక్ష్మి వివరించారు. రెండు నెలల్లోనే రోగి పూర్వస్థితికి చేరుకుంటాడని తెలిపారు. ఇప్పటికే 25కు పైగా ఇలాంటి సర్జరీలు చేసినట్లు డాక్టర్‌ లక్ష్మి తెలిపారు. ఈ బృందలో వైద్యులు రాజాకిరణ్‌ కుమార్‌గౌడ్‌, అశ్విన్‌ కిషోర్‌, ప్రణవ్‌రెడ్డి, సానూజిత్‌, మధులిక, సందీ్‌పరెడ్డి, పీజీ వైద్యులు అజో, గీత, స్వాతి పాల్గొన్నట్లు వివరించారు. 


పేదలకు ఉపయోగకరం 

కార్పొరేట్‌కు దీటుగా ఉస్మానియాలో ఆస్పత్రిలో చికిత్సలు అందిస్తున్నాం. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో డెర్మటోమ్‌ స్కిన్‌ మెషర్‌ ఎక్వి్‌పమెంట్‌తో అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాం. దీని ద్వారా సుమారు పదేళ్లపాటు కొన్నివేల మంది పేషంట్స్‌కు శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆస్పత్రులకు అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఎక్వి్‌పమెంట్స్‌ను, ఖరీదైన మిషనరీలు సమకూర్చుతున్న ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు.

- డాక్టర్‌ నాగేంద్ర, సూపరింటెండెంట్‌


భరోసా కల్పిస్తాం

శరీర భాగంలో ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తి ఆరోగ్య వివరాలు, వయస్సును పరిగణనలోకి తీసుకుంటాం. ఇతర జబ్బులు ఏం ఉన్నాయి.. కిడ్నీ, గుండె పనితీరును అంచనా వేస్తాం. అవసరమైన పరీక్షలు చేసి రోగిని సాధారణ స్థితికి తీసుకువస్తాం. ఆ తర్వాత సర్జరీ చేస్తాం. దెబ్బతిన్న భాగంలో ప్టాస్టిక్‌ సర్జరీ ప్రొసీజర్‌ను నిర్వహిస్తాం. ఈ విధానంలో కాలు, చేతుల వంటి భాగాలను తొలగించకుండానే రోగికి స్వస్థత చేకూరుస్తాం. అన్ని సేవలు ఉచితంగా అందిస్తాం.  

- డాక్టర్‌ పలుకూరి శ్రీలక్ష్మి, విభాగాధిపతి, ప్లాస్టిక్‌ సర్జరీ

Updated Date - 2022-10-03T17:59:50+05:30 IST