ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్‌పై బెట్టింగ్‌లు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలుసా..!

ABN , First Publish Date - 2022-09-25T21:24:12+05:30 IST

ఇండియా- ఆస్ట్రేలియా (India- Australia) మ్యాచ్‌పై హైదరాబాద్‌లో భారీ బెట్టింగ్స్‌ (Bettings) పెడుతున్నారు.

ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్‌పై బెట్టింగ్‌లు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలుసా..!

హైదరాబాద్: ఇండియా- ఆస్ట్రేలియా (India- Australia) మ్యాచ్‌పై హైదరాబాద్‌లో భారీ బెట్టింగ్స్‌ (Bettings) పెడుతున్నారు. బాల్‌కు, రన్‌కు, వికెట్‌కు బుకీలు బెట్టింగ్ కడుతున్నారు. టాస్ గెలవడం నుంచి ప్రతి బంతి, ప్రతి ఓవర్‌కు బెట్టింగ్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది, బుకీలు, మినీ బుకీలుగా రెండు రకాల బెట్టింగ్‌లకు దిగుతున్నారు. రూ.వెయ్యి నుంచి రూ.లక్షల వరకు బెట్టింగ్ పెడుతున్నట్లు సమాచారం. సిరీస్‌ (series) ఎవరు గెలుస్తారనే దానిపై కూడా భారీ బెట్టింగ్‌లకు దిగుతున్నారు. ఆన్‌లైన్‌ యాప్‌లో లక్షల మంది బెట్టింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్క ఓవర్‌లో ఎన్ని ఫోర్లు, సిక్స్‌లు కొడతారంటూ కూడా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇండియా గెలుస్తుందని భారీగా బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఆస్ట్రేలియాపై బెట్టింగ్ చేస్తే రూ.వెయ్యికి రూ.4 వేలు బెట్టింగ్ కాస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లపై ఎస్‌టీవో, టాస్క్‌ఫోర్స్ పోలీసుల నిఘా పెడుతున్నారు. 


మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ తెలుగు నేలను పలకరించబోతోంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ఇరు జట్లు చెరో విజయంతో 1-1తో సమానంగా ఉన్నాయి. దీంతో ఉప్పల్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్‌ దక్కుతుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్‌.. నాగ్‌పూర్‌లో అదరగొట్టింది. వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో 91 పరుగుల ఛేదనను మరో నాలుగు బంతులుండగానే ముగించింది. అందుకే ఈ నిర్ణాయక మ్యాచ్‌లో ఇరు జట్ల నుంచి  హోరాహోరీ ప్రదర్శన కనిపించే అవకాశం ఉంది.


చివరిదైన మూడో టీ20 అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌ ప్రేక్షకులకు అసలు సిసలైన మ్యాచ్‌ వినోదం లభించనుంది. టిక్కెట్ల వివాదం ఎలా ఉన్నా.. అభిమానులంతా ఇప్పుడు రోహిత్‌ పుల్‌ షాట్లు, కోహ్లీ కవర్‌ డ్రైవ్స్‌.. సూర్యకుమార్‌ వైవిధ్యభరిత ఆటతీరుతో పాటు బుమ్రా యార్కర్ల కోసం ఆత్రుతగా వేచిచూస్తున్నారు. మరి అంచనాలను నిజం చేస్తూ ఉప్పల్‌లో మనోళ్లు విజయఢంకా మోగిస్తారా.. లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. 


Read more