తెలంగాణపై కఠిన చర్యలు తీసుకోవద్దు

ABN , First Publish Date - 2022-09-29T07:56:55+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్తు బకాయిలు చెల్లించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని తెలంగాణ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

తెలంగాణపై కఠిన చర్యలు తీసుకోవద్దు

  • ‘ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్తు బకాయిల’పై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు ఆదేశం
  • మధ్యంతర ఉత్తర్వులు జారీ.. కౌంటర్ల దాఖలుకు ఏపీ, కేంద్రానికి నోటీసులు
  • ఏపీకి 6756 కోట్లు చెల్లించాలన్న ఆదేశాలు చట్టవిరుద్ధమని ప్రాథమిక నిర్ధారణ!


హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్తు బకాయిలు చెల్లించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని తెలంగాణ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఏపీ విద్యుత్తు సంస్థలకు రూ.6756 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ కేంద్ర విద్యుత్తు శాఖ ఆగస్టు 29న తెలంగాణ సర్కారు, విద్యుత్తు సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. కేంద్ర విద్యుత్తు శాఖ, ఏపీ ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు, నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌, పవర్‌ సిస్టం ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ తదితరులను ప్రతివాదులుగా చేర్చాయి. ఈ పిటిషన్లపై జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ జె.శ్రీనివాసరావుల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం 30 రోజుల్లో ఏపీకి రూ.6756 కోట్లు చెల్లించాలంటూ జారీ చేసిన ఆదేశాలు చట్ట విరుద్ధమైనవన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం వివాదాన్ని సదరన్‌ రీజినల్‌ కౌన్సిల్‌కు సిఫారసు చేయాల్సి ఉండగా, అలా చేయలేదని తెలిపారు.


 కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు వివక్షతో కూడుకుని ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించిందని.. అందుకే ఆ రాష్ట్రానికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. పునర్విభజన సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉండగా.. ఈ అంశంపై మాత్రమే ఎందుకంత వేగంగా నిర్ణయం తీసుకుందని ప్రశ్నించారు. ఏపీ విద్యుత్తు సంస్థల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ఏపీ విద్యుత్తు సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు. ఏపీ డిస్కంలు తీసుకున్న రుణాలు ఎన్‌పీఏలుగా మారాయన్నారు. బకాయిలు చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని.. ఏపీలో కరెంటు సరఫరా, మౌలి క సదుపాయాల అభివృద్ధికి విద్యుత్తు సంస్థలు భారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందే ఏపీలో విద్యుదుత్పత్తి చేసి తెలంగాణకు సరఫరా చేశామని పేర్కొన్నారు. కాబట్టి ఇవి కచ్చితంగా రావాల్సిన బకాయిలన్నారు.


 విభజనకు ముందు జరిగిన విద్యుత్తు సరఫరాకు ఏపీ పునర్విభజన చట్టం వర్తించదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గతంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్లే ఏపీ విద్యుత్తు సంస్థలు తెలంగాణకు కరెంటు సరఫరా చేశాయని గుర్తుచేశారు. అందుకే ఆ బకాయిలు చెల్లించాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని.. ఆ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. కేంద్రం, ఏపీ ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో వివరణ సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీకి బకాయిలు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం జారీచేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కేంద్రానికి మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. విచారణను 18కి వాయిదా వేసింది.

Read more