అసంతృప్తి చల్లారాకే అభ్యర్థి ప్రకటన!

ABN , First Publish Date - 2022-08-21T08:07:51+05:30 IST

బహిరంగ సభలోనే పార్టీ అభ్యర్థిని సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారని, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే మునుగోడు అభ్యర్థి అని సభా వేదికగానే చెబుతారని టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ప్రచారం జరిగింది.

అసంతృప్తి చల్లారాకే అభ్యర్థి ప్రకటన!

కూసుకుంట్లను ప్రకటిస్తే పోటీ సభ 

అధిష్ఠానానికి అసంతృప్తుల హెచ్చరిక

వ్యూహాత్మకంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, ఆగస్టు 20, (ఆంధ్రజ్యోతి): బహిరంగ సభలోనే పార్టీ అభ్యర్థిని సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారని, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల  ప్రభాకర్‌రెడ్డినే మునుగోడు అభ్యర్థి అని సభా వేదికగానే చెబుతారని టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ప్రచారం జరిగింది. జిల్లా మంత్రి జగదీ్‌షరె డ్డి కూడా గతంలో ఇదే మాట చెప్పారు. బహిరంగసభ అనుకున్నట్లుగానే జరిగినా అభ్యర్థి ప్రకటన మాత్రం చేయలేదు. వాస్తవానికి దీని వెనక పెద్ద కథే నడిచిందని సమాచారం. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే అధిష్ఠానం నిర్ణయించాక... దీనిపై పెద్దఎత్తున అసంతృప్తి వ్యక్తమైంది. ఆ తర్వాత అసంతృప్త నేతలందరితోను మంత్రి జగదీ్‌షరెడ్డి మంత్రుల క్వార్టర్స్‌లోని తన నివాసంలో చర్చలు జరిపారు. అనంతరం ప్రగతి భవన్‌కు వెళ్లి అక్కడ నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఆ జిల్లా పార్టీ ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులతోను మాట్లాడించారు. అనంతరం ఇక అభ్యర్థిపై అసంతృప్లి లేదనే భావనకు వచ్చారు. సీఎం కేసీఆర్‌కు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అసంతృప్తులంతా సర్దుకున్నారని, ఇక కథ సుఖాంతమేనని చెప్పేశారు. ఇలా చెప్పిన కొన్ని రోజులకే అసంతృప్త నేతలు ఏకంగా మునుగోడు నియోజకవర్గంలో ఒక పెద్ద సమావేశాన్నే ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు ఆ సమావేశానికి హాజరయ్యారు. దీంతో అసంతృప్తి చల్లారలేదనే విషయం అధిష్ఠానానికి అర్థమైంది. ఆ తర్వాత సదరు అసంతృప్త నేతల్లో ఒకరిద్దరు బీజేపీలోకి వెళ్లిపోయారు. మిగతా అంతా టీఆర్‌ఎ్‌సలోనే ఉండి తమ వాదనను కూడా పరిగణనలోకి తీసుకుంటారని చెప్తూ వస్తున్నారు. ఒకవేళ తమ అభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకోకుండా బహిరంగ సభలో పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తే... తాము కూడా మళ్లీ ఒక బహిరంగసభను నిర్వహిస్తామంటూ ప్రకటించారు. అయితే ఆ తర్వాత వారిలో కొందరిని టీఆర్‌ఎస్‌ నాయకత్వం బుజ్జగించింది.


అభ్యర్థిత్వం ఆశించిన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డిని పిలిపించి సీఎం కేసీఆర్‌ స్వయంగా చర్చించారు. గంటన్నరసేపు చర్చలు జరపడమే కాకుండా...ఆ తర్వాత బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించిన ఇన్‌ఛార్జిలలో ఒకరిగా భూపాల్‌ రెడ్డిని కూడా వేశారు. అయినా, ఇంకా కొంత అసంతృప్తి ఉంది. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి విషయంలో తమ వ్యతిరేక వైఖరి మారలేదనే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు మునుగోడులో బీసీ అభ్యర్థిని నిలబడితే బాగుండననే వాదన కూడా పెరుగుతోంది. కూసుకుంట్లను అభ్యర్థిగా దాదాపు ప్రకటించేసి, అతనే అభ్యర్థి అని అనధికారికంగా చెప్పేశాక చేసిన సర్వేల్లో కూడా అతను మిగతా వారి కంటే రెండు శాతానికి మించి ముందంజలో లేరని కొన్ని సర్వేల్లో తేలింది. ఈ అంశాలతో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌కు ఇంకా సమయం ఉన్నందున ఇప్పుడే అభ్యర్థిని ప్రకటించడం ఎందుకనే వ్యూహాత్మక వైఖరిని సీఎం కేసీఆర్‌ తీసుకున్నట్లు కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో సానుకూలత సాధించాక, వీలైనంత మేరకు అసంతృప్తులను సర్దుబాటు చేశాక మాత్రమే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారు. దాంతోనే బహిరంగసభలో అభ్యర్థిని ప్రకటించలేదని సమాచారం.


బూర నర్సయ్య గౌడ్‌ తెరపైకి

నియోజకవర్గంలో 60 శాతం ఓట్లు బీసీలవే కావడంతో ఆ సామాజిక వర్గానికి టికెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ అధికార పార్టీలో బలంగా ఉంది. డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ సీఎం కేసీఆర్‌ ఎదుట ఇదే డిమాండ్‌ను ఇటీవల వినిపించారు. తనకు అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరారు. మరో నలుగురు అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరుసటి రోజే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభ ఉండడంతో అభ్యర్థిని ప్రకటిస్తే వెలువడే దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి ప్రకటనపై సీఎం దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. 

Read more