తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాల్లో అపశ్రుతులు

ABN , First Publish Date - 2022-09-17T08:51:03+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో పలు చోట్ల అపశ్రుతులు చోటు చేసుకున్నాయి.

తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాల్లో అపశ్రుతులు

  • మంచిర్యాలలో ఎండ తీవ్రతతో 30మంది విద్యార్థినులకు అస్వస్థత
  • మారేడుపల్లిలో పాడైపోయిన ఆహారం.. వదిలేసి వెళ్లిన విద్యార్థులు
  • మిర్యాలగూడలో ఎల్‌ఈడీ స్ర్కీన్‌ మీద పడి నలుగురికి గాయాలు
  • సభకు రాకుంటే రూ.500 ఫైన్‌.. నిర్మల్‌లో డ్వాక్రా సంఘాల నిరసన
  • గద్వాల జిల్లాలో గిడ్డంగుల సంస్థ చైర్మన్‌పై దాడి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో పలు చోట్ల అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. ర్యాలీల సందర్భంగా ఎండవేడిమి తట్టుకోలేక విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోవడం కలకలం రేపింది. ఒక చోట పాడైపోయిన భోజనం అందజేయగా, మరో చోట ఎల్‌ఈడీ స్ర్కీన్‌ మీద పడడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్‌ నుంచి మూడు కిలోమీటర్ల  దూరంలో ఉన్న ప్రభుత్వ  డిగ్రీ కళాశాల మైదానానికి ర్యాలీ తలపెట్టగా.. గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. అక్కడ కూడా విద్యార్థుల కోసం ఎలాంటి షామియానాలు, తాగు నీటి  సదుపాయం ఏర్పాటు చేయలేదు. దీంతో సుమారు 30 మంది విద్యార్థులు సొమ్మసిల్లిపడిపోయారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిర్యాలగూడలోని ఎన్నెస్పీ క్యాంపు గ్రౌండ్‌లో సభా వేదికకు కుడివైపున ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్లు కింద పడడంతో నలుగురు విద్యార్థినులు గాయపడ్డారు. ఈ పరిణామంతో ప్రాంగణంలో ఉన్న విద్యార్థులు భయాందోళనతో పరుగులు తీశారు. కంటోన్మెంట్‌ పరిధిలోని మారేడుపల్లిలో ఓ హోటల్‌ నుంచి తీసుకొచ్చిన ఆహారాన్ని విద్యార్థులకు అందజేశారు. అయితే, సదరు ఆహారం పాడైపోయి దుర్వాసన రావడంతో.. తినకుండానే విద్యార్థులు వెళ్లిపోయారు. విషయాన్ని మీడియా గమనించడంతో సదరు హోటల్‌ నిర్వాహకులు ఆహార పొట్లాలన్నింటినీ బయట పడేశారు. 


నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న డ్వాక్రా మహిళలు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ఆందోళనకు దిగారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి రాకుంటే తమకు రూ.500 జరిమానా విధిస్తామని చెప్పడం ఎంతవరకు సబబని ఐకేపీ ఏపీఎం అశోక్‌ను నిలదీశారు. అలాగే నిర్మల్‌ జిల్లా కేంద్రంతోపాటు, ఖానాపూర్‌లో పలువురు విద్యార్థులు ఎండవేడిమి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. వజ్రోత్సవాల వేళ జనగామ జిల్లాలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ప్రిస్టన్‌ గ్రౌండ్‌ సభా ప్రాంగణంలో జాతీయ జెండాలను ఇష్టమున్నట్లుగా పడేసి వెళ్లిపోయారు. ఒకచోట మురుగు కాల్వలోనూ జాతీయ జెండా కనిపించింది. విషయం మీడియా దృష్టికి వెళ్లిందన్న సమాచారం తెలుసుకున్న మునిసిపల్‌ సిబ్బంది ఆ తరువాత వాటిని సేకరించి భద్రపరిచారు. గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గంలోని వడ్డేపల్లిలో నిర్వహించిన వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌పై దాడి జరిగింది. సభ పూర్తయిన తర్వాత అందరూ తిరిగి వెళ్తుండగా స్థానిక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, సాయిచంద్‌ అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులుతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో సాయిచంద్‌తోపాటు అతడి అనుచరులకు దెబ్బలు తగలగా ఇటు స్థానిక టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లోనూ కొంతమందికి గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సాయిచంద్‌, ఆయన అనుచరులను సభా స్థలం నుంచి గద్వాలకు పంపించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మహిళా సంఘం సభ్యులు తిరిగి వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న వాహనం చైన్‌పాక శివారులో బోల్తా పడడంతో ఆరుగురు మహిళలకు గాయాలయ్యాయి. వారిని పరకాలలోని ప్రేవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more