ఎనిమిదేళ్లలో పెట్టుబడులు.. రూ. 2.5 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-10-03T09:52:25+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేళ్లలో వివిధ రంగాల్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం

ఎనిమిదేళ్లలో పెట్టుబడులు.. రూ. 2.5 లక్షల కోట్లు

16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు

తెలంగాణ ప్రభుత్వ విధానాలే  ఇందుకు కారణం

ప్రపంచంలో వేసే టీకాల్లో 33ు తయారీ ఇక్కడే

 ‘పీటీఐ’ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి


హైదరాబాద్‌, అక్టోబరు 2: తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేళ్లలో వివిధ రంగాల్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వాణిజ్య హిత విధానాలే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ‘‘గత ఎనిమిదేళ్లలో మేం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం (టీఎ్‌సఐపాస్‌) ద్వారా 20 వేల వాణిజ్య ప్రతిపాదనలకు అనుమతులు ఇచ్చాం. ఆ అనుమతుల ద్వారా రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయి’’ అని కేటీఆర్‌ వివరించారు. గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, తయారీ రంగాలు మంచి వృద్ధిని సాధించాయని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణలో ఎన్ని కంపెనీలు ఉన్నాయన్న ప్రశ్నకు.. ‘‘తెలంగాణ.. ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల తయారీ కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే వ్యాక్సిన్లలో 33% తెలంగాణలోనే తయారవుతున్నాయి.


అలాగే.. భారతదేశ ఫార్మాలో 35-40% తయారీ ఇక్కడే జరుగుతోంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి సంబంధించి రాష్ట్రం ప్రత్యేకమైన హబ్‌. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలైన గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, క్వాల్‌కామ్‌.. అన్నీ ఇక్కడ ఉన్నాయి’’ అని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఒక్క ఐటీ రంగంలోనే 8 లక్షల మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు చేస్తున్నారని.. అంతకు రెండు రెట్ల మందికి ఆ రంగం వల్ల పరోక్షంగా ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఐటీ రంగంలో గత ఏడాది నాలుగున్నర లక్షల ఉద్యోగాలు రాగా.. వాటిలో లక్షన్నర ఉద్యోగాలు ఒక్క తెలంగాణలోనే వచ్చాయని, దేశంలో ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలోనే వచ్చిందని చెప్పారు. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించినట్లు తెలిపారు.


వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి ఏ మేరకు పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు? అనే ప్రశ్నకు.. ‘‘నేను నంబర్లు చెప్పను. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చినప్పుడు మాట్లాడుతాం. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు మళ్లీ పెడుతున్నాయి’’ అని బదులిచ్చారు. సులభతర వాణిజ్య నిర్వహణ సూచీలో తెలంగాణ 3వ స్థానంలో ఉందని.. తాము ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే వాతావరణం కూడా కల్పిస్తామని.. అందుకే రూ.2.5 లక్షల కోట్లు పెట్టుబడుల రూపంలో వచ్చాయని, అందులో 24ు పెట్టుబడులు ఇప్పటికే తెలంగాణలో వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థల నుంచి వచ్చినవని వివరించారు. ఉదాహరణకు.. ఇటీవలే ఒక టెక్స్‌టైల్‌ కంపెనీ రాష్ట్రంలో 24 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, ష్నిడెర్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ రాష్ట్రంలో రెండో యూనిట్‌ పెడుతోందని కేటీఆర్‌ వివరించారు. అమెరికా, యూరప్‌, ఆసియా దేశాలకు చెందిన పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయని.. రాష్ట్రానికి రావాల్సిందిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ తాను కోరుతున్నానని కేటీఆర్‌ అన్నారు. వారి ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Read more