డిజిటల్‌ భూసర్వే ఊసేది?

ABN , First Publish Date - 2022-02-23T07:56:45+05:30 IST

సమగ్రంగా డిజిటల్‌ భూ సర్వే చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించారు.

డిజిటల్‌ భూసర్వే ఊసేది?

భూ సమస్యల పరిష్కారం కోసమంటూ ప్రభుత్వ ప్రకటన

నిధులు కేటాయించి నెలలు గడుస్తున్నా.. మొదలవని పనులు 

రికార్డుల్లోని లెక్కలకు.. వాస్తవంగా ఉన్న భూమికి కుదరని పొంతన

పక్కా మ్యాప్‌లు లేకపేరుకుపోతున్న రెవెన్యూ వివాదాలు

సమస్యలు పరిష్కారంకాక.. ఆత్మహత్యలకు యత్నిస్తున్న బాధితులు


సమగ్రంగా డిజిటల్‌ భూ సర్వే చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇదొక్కటే మార్గమన్నారు. నిధులూ కేటాయించారు. 9 జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌ అన్నారు. ఇందుకోసం గ్రామాల ఎంపికంటూ హడావుడి చేశారు. దీంతో.. ఇక రాష్ట్రంలో భూ సమస్యలకు చెక్‌ పడినట్లేనని అంతా భావించారు. కానీ.. వాస్తవంలో జరిగింది వేరు. ఇదంతా జరిగి 8 నెలలు గడుస్తున్నా.. అడుగు ముందుకు పడలేదు. ఎందుకనో ప్రభుత్వం.. ఆ ఊసే పట్టనట్లు ఉండిపోతోంది. 


హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలో 1,250 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే.. రైతులకు 2,700 ఎకరాల భూమికి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చారు. అంటే.. రికార్డుల్లో 1,450 ఎకరాల భూమి అదనంగా నమోదైంది. ఇందుకు సంబంధించి పూర్వ రికార్డులు (సేత్వార్‌, ఖాస్రా) లేవు. దీంతో.. అక్కడ గందరగోళం ఏర్పడింది. ఇలాంటి భూ సమస్యలు రాష్ట్రంలో కోకొల్లలు. ముఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, ఆదిలాబాద్‌  జిల్లాల్లో అసైన్డ్‌ భూమికి సంబంధించి అక్రమార్కులు సృష్టించిన బోగస్‌ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు వేలల్లో ఉన్నాయి. రికార్డుల్లో ఉన్న లెక్కకు.. వాస్తవంలో ఉన్న భూమికి అసలు పొంతనే లేదు. ఇలాంటి సమస్యల వల్ల అసైన్డ్‌ భూముల యజమానుల వివరాలను ధరణిలో నమోదు చేయడంలేదు.


కొన్ని జిల్లాలో సీలింగ్‌కు మించిన విస్తీర్ణం పట్టా భూమిగా ఉన్నట్లు ధరణిలో నమోదు చేశారు. ఇలాంటివి వివాదాలకు కారణమవుతున్నాయి. వీటికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం.. సమగ్ర భూసర్వే చేపడతామని గత ఏడాది ఘనంగా ప్రకటించింది. ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలంటే.. సమగ్ర భూసర్వే తప్పనిసరంటూ 2021 జూన్‌ 7న జరిగిన మంత్రివర్గ సమావేశం తేల్చింది. ఈ డిజిటల్‌ ల్యాండ్‌ సర్వే కోసం అప్పట్లో రూ.430 కోట్లు కేటాయించారు కూడా. ఇందుకోసం పైలెట్‌ ప్రాజెక్టుగా 9 ఉమ్మడి జిల్లాల నుంచి మూడేసి గ్రామాలను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, ఆ తర్వాత ఈ విషయం మరుగున పడిపోయింది. పట్టా, ప్రభుత్వ, దేవాదాయ, అటవీ, వక్త్ఫ్‌, భూదాన్‌ భూముల వివరాలు రికార్డుల్లో నమోదై ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో వీటికి సంబంధించి హద్దులు, మ్యాప్‌లు లేకపోవడంతో.. భూ వివాదాలు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. రెవెన్యూ రికార్డులకు ‘మదర్‌ ఆఫ్‌ రికార్డ్‌గా’ పేర్కొంటున్న సేత్వార్‌ రికార్డులు ప్రస్తుతం ఏ జిల్లాలోనూ అందుబాటులో లేవు. అనంతరం నమోదు చేసిన ఖాస్రా పహాణీ, చెసాలా రికార్డులు కూడా కొన్ని చోట్ల లేవు. ఇవి లేకుండా యజమానుల దగ్గర ఉన్న పాస్‌పుస్తకాల్లోని వివరాల ప్రకారం ధరణి పోర్టల్‌లో భూమి విస్తీర్ణాన్ని సరిచేయడం సాఽధ్యమయ్యే పని కాదు. తాత్కాలికంగా సరిచేసినా.. క్షేత్ర స్థాయిలో సమస్య అలాగే ఉంటోంది. 


సర్వే సాధ్యం కాదా..?

భూ సర్వే ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తే.. ఇది అసాధ్యమేమీ కాదంటున్నారు విఽశ్లేషకులు. ఎందుకంటే.. భారీ ప్రాజెక్టులు, భవనాలు, రహదారుల నిర్మాణాలకు తక్కువ సమయంలోనే సర్వేలు నిర్వహించి నివేదికలు రూపొందిస్తున్నప్పుడు.. ఈ భూసర్వే పెద్ద విషయమేమీ కాదంటున్నారు. ఒక్కసారి ఈ ప్రక్రియ పూర్తయిందంటే.. అనంతరం రికార్డులను సవరించే పని సులభమవుతుందంటున్నారు. వైఎ్‌సఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు గతంలో ఓసారి సమగ్ర భూసర్వే చేయించేందుకు ప్రయత్నించారు. నిజామాబాద్‌ జిల్లాలోని 11 గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని నిర్వహించగా.. అందులో తప్పులు దొర్లాయి. దీంతో.. ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కేసీఆర్‌ ఈ దిశగా ఆలోచించినా.. అడుగు మాత్రం ముందుకు పడలేదు. ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చి దాదాపు 15 నెలలు అవుతున్నా.. రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా భూ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు.  


కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం కాక..

భూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల గద్వాల జిల్లా వడ్డెపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన రాములు.. తనకున్న 2.50 ఎకరాల పొలం ధరణిలో నమోదు కాలేదు. అందులో 1.30 ఎకరాలు మాత్రమే నమోదైంది. మిగిలిన భూమిని ధరణిలో నమోదు చేయాలంటూ ఏడాదిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారమవలేదు. దీంతో.. జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడేనికి చెందిన ఓ యువకుడు.. తన తండ్రిపేరునా ఉన్న 8 ఎకరాల భూమికి 4 ఎకరాలు మాత్రమే పాస్‌బక్‌లో ఎంట్రీ అయింది. మిగితా నాలుగు ఎకరాలను నమోదు చేయాలంటూ బాధితుడు కొన్ని నెలల పాటు తిరిగినా.. అధికారులు పట్టించుకోలేదు. దీంతో.. గత డిసెంబరు 13న కలెక్టర్‌ చాంబర్‌లో పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అదే వ్యక్తి.. జనవరి 26న మరోసారి ఆత్మహత్యకు యత్నించాడు. ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.

Read more