డయల్ 1930

ABN , First Publish Date - 2022-10-01T09:26:49+05:30 IST

మీ బ్యాంకు ఖాతాలోని సొమ్మును సైబర్‌ నేరగాళ్లు కొట్టేశారాజ....

డయల్ 1930

  • సైబర్‌ నేరగాళ్ల వలలో పడి డబ్బు పోగొట్టుకుంటే..
  • తక్షణ సాయానికి కాల్‌ చెయ్యాల్సిన నంబర్‌ 
  • సైబర్‌ క్రైమ్‌పై ఫిర్యాదులకు ప్రత్యేక కాల్‌సెంటర్‌
  • 24 గంటలు అందుబాటులో సైబర్‌ హెల్ప్‌లైన్‌ 
  • ‘టీ-4సీ’లో ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదుల స్వీకరణ 

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): మీ బ్యాంకు ఖాతాలోని సొమ్మును సైబర్‌ నేరగాళ్లు కొట్టేశారా ? ఆ డబ్బును వెనక్కి రప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే, తక్షణ సాయం కోసం మీరు 1930 నంబర్‌కు ఫోన్‌ చెయ్యాల్సి ఉంటుంది. ఈ ఉచిత కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే... సంబంధిత బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసే వీలుంది. ఇదే కాదు ఆన్‌లైన్‌ మోసాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదునైనా ఈ కాల్‌సెంటర్‌కు నివేదించవచ్చు. సైబర్‌ ఆర్థిక నేరాలు రోజురోజుకి అధికమవుతున్న నేపథ్యంలో గతంలో ఉన్న 155260 నంబర్‌ను మార్చిన  కేంద్ర హోం శాఖ ఈ 1930 కాల్‌ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బాధితులు పోలీసుస్టేషన్లు, బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఈ కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసుకునే వీలు కల్పించింది. ప్రతీ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ కాల్‌ సెంటర్‌ పని చేస్తుంది. తెలంగాణకు సంబంధించి 1930 సేవలను సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని సైబర్‌ క్రైం విభాగంలో ఏర్పాటు చేశారు. కొద్ది నెలలుగా అందుబాటులో ఉన్న ఈ 1930 సేవల ద్వారా ఇప్పటికే పలు సమస్యలను పరిష్కరించారు. ఈ హెల్ప్‌లైన్‌ 24/7 పనిచేస్తుంది. అంతేకాక, సైబర్‌ క్రైమ్‌ బాధితుల నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల స్వీకరణకు టీ-4సీ అనే ప్రత్యేక పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. బాధితులు ఎక్కడి నుంచైనా సరే ఈ పోర్టల్‌లో తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.


1930 హెల్ప్‌లైన్‌ పని తీరు ఇలా.. 

సైబర్‌ మోసగాళ్ల చేతిలో మోసపోయి డబ్బు పొగొట్టుకున్న వారికి 1930 హెల్ప్‌లైన్‌ ద్వారా మెరుగైన సాయం అందే అవకాశముంది. అది ఎలాగంటే.. ఈ కాల్‌సెంటర్‌లో పనిచేసే సిబ్బంది అన్ని బ్యాంకులు, యూపీఐ వ్యాలెట్లకు సంబంధించిన నోడల్‌ అధికారుల(సైబర్‌ ఫిర్యాదులు)ను నేరుగా సంప్రదించేలా ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. డబ్బు పొగొట్టుకున్న బాధితులు హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేస్తే సిబ్బంది జరిగిన మోసానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తారు. బాధితుడు ఏ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు పొగొట్టుకున్నాడో తెలుసుకుని.. ఆ బ్యాంకు నోడల్‌ అధికారికి సమాచారం ఇస్తారు. ఆ అధికారి బాధితుని ఖాతాను పరిశీలించి డబ్బు ఏ ఖాతాకు బదిలీ అయ్యిందో గుర్తించి.. సంబంధిత బ్యాంకు అధికారికి సమాచారం పంపిస్తారు. దీంతొ ఆ అధికారులు సదరు ఖాతాను ఫ్రీజ్‌ చేసేస్తారు. ఈ విధంగా అన్ని బ్యాంకుల నోడల్‌ అధికారులు స్పందించి బాధితుని డబ్బు చివరిగా ఎక్కడికి చేరిందో గుర్తించి ఆయా బ్యాంకుల అధికారులకు సమాచారం చేరవేస్తారు.  ఈ ప్రక్రియలో సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన డబ్బు ఏదో ఒక బ్యాంకులో ఫ్రీజై పోతుంది. ఆ ఖాతా వివరాల ఆధారంగా మోసం చేసిన వారిని గుర్తిస్తారు. ఒకవేళ ఖాతాను ఫ్రీజ్‌ చేసే లోపు నగదును విత్‌ డ్రా చేసేస్తే.. నగదు బదిలీ అయిన విధానం ఆధారంగా సైబర్‌ నేరగాళ్ల ఆచూకీ తెలుకుంటారు. బ్యాంకులు ఇచ్చే సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు నేరస్థులను పట్టుకుంటారు. ఇదంతా జరగాలంటే బాధితులు వీలైనంత త్వరగా కాల్‌సెంటర్‌ను సంప్రదించి ఫిర్యాదు చెయ్యాల్సి ఉంటుంది.  


ఆన్‌లైన్‌లో ఫిర్యాదులకు..

ఆన్‌లైన్‌ మోసానికి గురైన వారిలో చాలామంది పోలీసు స్టేషన్‌ అంటే భయం వల్లనో,  పరువు పోతుందనో, ఇతర కారణాలతోనో పోలీసులను ఆశ్రయించారు. అయితే, సైబర్‌ మోసాలకు గురైన వారు ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలో దీన్ని టి-4సీ (తెలంగాణ సైబర్‌ క్రైం కో ఆర్డినేషన్‌ సెంటర్‌) అని పిలుస్తారు. బాధితులు  www.c-ybercrime.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎక్కడి నుంచైనా సరే తమ ఫిర్యాదును పంపవచ్చు. ఈ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదు.. ఏ ఏరియా సైబర్‌ పోలీసు స్టేషన్‌కు వెళితే.. అక్కడి సిబ్బంది బాధితులకు ఫోన్‌ చేసి వివరాలు సేకరిస్తారు. వాటి ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటారు. 

Read more