ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా తెలుగు తేజం

ABN , First Publish Date - 2022-09-24T08:40:48+05:30 IST

ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా తెలుగు తేజం

ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా  తెలుగు తేజం

  • సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ డీన్‌గా 
  • విధులు నిర్వహిస్తున్న డా. శ్రీనివాస్‌
  • నియామకానికి ఏసీసీ ఆమోదం
  • శ్రీనివాస్‌ హయాంలో 
  • ఈఎస్‌ఐసీలో పలు అభివృద్ధి పనులు
  • కొత్త విభాగాల ఏర్పాటు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్టాత్మక ఢిల్లీ ఎయిమ్స్‌ (ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) సంస్థ డైరెక్టర్‌గా తెలంగాణకు చెందిన డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ నియమితులయ్యారు. నియామకాల కేబినెట్‌ కమిటీ (ఏసీసీ) శుక్రవారం ఆయన నియామకాన్ని ఆమోదించింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లుళళ లేదా డాక్టర్‌ శ్రీనివా్‌సకు 65 ఏళ్లు వచ్చేవరకూ లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. 2017 మార్చి 28 నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పదవీకాలాన్ని ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆయన పదవీకాలం శుక్రవారంతో ముగిసినట్టే. డాక్టర్‌ శ్రీనివాస్‌ 2016 నుంచి హైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌ ఈఎ్‌సఐసీ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి డీన్‌గా పనిచేస్తున్నారు. అంతకు ముందు ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో పీడియాట్రిక్‌ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌కు వచ్చి ఈఎ్‌సఐసీ డీన్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా.. ఇప్పటిదాకా ఇద్దరు తెలుగువారు ఎయిమ్స్‌, ఢిల్లీ డైరెక్టర్లుగా వ్యవహరించారు.


 ప్రొఫెసర్‌ వి.రామలింగస్వామి 1969-79 నడుమ, ప్రొఫెసర్‌ పి.వేణుగోపాల్‌ 2003 నుంచి 2008 వరకూ ఆ బాధ్యతల్లో ఉన్నారు. డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆ బాధ్యతలు చేపట్టిన మూడో తెలుగు వ్యక్తి. నిజానికి ఈ పదవి కోసం తొలుత పరిగణించిన పేర్లలో డాక్టర్‌ శ్రీనివాస్‌ పేరు లేదు. ఆయన ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకోనూ లేదు. ఎయిమ్స్‌కే చెందిన డాక్టర్‌ నిఖిల్‌ టాండన్‌ (ఎండోక్రైనాలజీ విభాగాధిపతి), రాజేశ్‌ మల్హోత్రా (ట్రామాసెంటర్‌ చీఫ్‌, ఆర్థోపెడిక్స్‌ విభాగాధిపతి), ప్రమోద్‌ గార్గ్‌ (గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ప్రొఫెసర్‌) పేర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఏసీసీ ఆమోదానికి పంపారు. 


జూన్‌ 20న ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన ఏసీసీ మరిన్ని పేర్లను ఇవ్వాల్సిందిగా సూచించింది. దీంతో ఎయిమ్స్‌కే చెందిన ఎంవీ పద్మ శ్రీవాస్తవ (న్యూరోసైన్సెస్‌ సెంటర్‌ చీఫ్‌), భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ, జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, పుదుచ్చేరి డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ అగర్వాల్‌ పేర్లను ప్రతిపాదించారు. తదుపరి దశలో డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ సంజయ్‌ బిహారీ (డైరెక్టర్‌ ఆఫ్‌ శ్రీ చిత్ర తిరునాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ, త్రివేండ్రం) పేర్లను ప్రతిపాదించగా.. ఏసీసీ డాక్టర్‌ శ్రీనివాస్‌ నియామకానికి ఆమోద ముద్ర వేసింది. 

Updated Date - 2022-09-24T08:40:48+05:30 IST