రాష్ట్రంలో తగ్గుతున్న జననాలు

ABN , First Publish Date - 2022-09-27T08:59:35+05:30 IST

రాష్ట్రంలో జననాల రేటు గణనీయంగా తగ్గుతోంది. 2015లో జననాల రేటు 17.8 ఉండగా, అది 2020 నాటికి 16.4కు తగ్గింది.

రాష్ట్రంలో తగ్గుతున్న జననాలు

  • రాష్ట్రంలో తగ్గిపోతున్న ఆడ పిల్లల సంఖ్య 
  • ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు 892 మందే..
  • తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు 
  • శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ 2020 నివేదికలో వెల్లడి


హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో  జననాల రేటు గణనీయంగా తగ్గుతోంది. 2015లో జననాల రేటు 17.8 ఉండగా, అది 2020 నాటికి 16.4కు తగ్గింది. పల్లె ప్రాంతాల్లో 2015లో 18.2 ఉండగా, ప్రస్తుతం 16.8కి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో 17.2 నుంచి 15.9కి తగ్గింది. ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు మన రాష్ట్రంలో 2014-15లో 901 మంది ఆడపిల్లలుండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 892కు తగ్గిపోయిందని కేంద్రం విడుదల చేసిన శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ స్టాటిస్టికల్‌ రిపోర్టు 2020 చెబుతోంది. ఇక శిశు మరణాలు రాష్ట్రంలో గణనీయంగా తగ్గాయి. 2015లో ప్రతి 1000 జననాలకు 34 మంది శిశువులు చనిపోతే 2020 నాటికి అది 21కి తగ్గింది. 


సంతానోత్పత్తి రేటు 1.8 నుంచి 1.5కు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక రాష్ట్రంలో 15-29 మధ్య వయసు వారు 33.3 శాతం మంది ఉన్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 15-59 మధ్య వయస్కుల శాతం 72.0గా ఉంది. ఇందులో 71.7 శాతం మంది మగవారు కాగా, 72.3 శాతం మహిళలున్నారు. అలాగే 60 ఏళ్ల పైబడిన వారు 8.1 శాతం ఉండగా, ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో  9.6 శాతం ఉన్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో ఇదే ఏజ్‌ గ్రూప్‌వారు కేవలం 5.9 శాతమే ఉన్నారు.  ఇక  దేశంలో జననాల రేటు తగ్గుముఖం పట్టినట్టుగా శాంపిల్‌ రిజిస్ర్టేషన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌) 2020 నివేదిక పేర్కొంది. 2020 సంవత్సరంలో జాతీయ స్థాయిలో జననాల రేటు 19.5గా నమోదైంది. 2019తో పోల్చితే ఇది 0.2 పాయింట్ల మేర తగ్గింది. బిహార్‌లో జననాల రేటు (ప్రతి వెయ్యి మందికి) 25.5 ఉండగా.. కేరళలో తక్కువ స్థాయిలో 13.2గా ఉంది. దేశంలో 2015 నుంచి 2020 వరకు జననాల రేటు 1.3 పాయింట్లు తగ్గింది. ఇదే కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో జననాల రేటు 1.0 పాయింట్లు, పట్టణాల్లో 0.9 పాయింట్లు తగ్గింది.  ఇక 2020లో దేశంలో మరణాల రేటు 6.0గా ఉంది.


ఛత్తీస్‌గఢ్‌లో గరిష్ఠంగా 7.9, ఢిల్లీలో కనిష్ఠంగా 3.6గా నమోదైంది. గత ఐదేళ్ల కాలంలో జాతీయ జననాల రేటు 0.5 పాయింట్లు తగ్గింది. 2020 సంవత్సరంలో జాతీయ స్థాయిలో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జనాభాకు 28కి తగ్గింది. 2019లో ఇది 30గా ఉంది. మధ్యప్రదేశ్‌లో గరిష్ఠంగా శిశుమరణాల రేటు 43 ఉండగా.. కేరళలో కనిష్ఠంగా 6గా ఉంది. జాతీయ స్థాయిలో 2015లో శిశు మరణాల రేటు 37 ఉండగా.. 2020లో 28కి తగ్గింది. ఐదేళ్ల కాలంలో ఇది 9 పాయింట్లు తగ్గింది. ఐదేళ్ల సగటు తగ్గుదల దాదాపు 1.8 పాయింట్లుగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే 2015లో శిశుమరణాల రేటు 41 ఉండగా.. 2020లో 31కి తగ్గిపోయింది. ఇదే కాలంలో పట్టణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు 25 నుంచి 19 పాయింట్లకు తగ్గింది. 2015-20 కాలంలో ఆడ, మగ పిల్లల శిశు మరణాలు తగ్గాయి. ఈ స్థాయిలో తగ్గుదల నమోదైనప్పటికీ జాతీయ స్థాయిలో ఏడాది జీవిత కాలంలో ప్రతి 35 మంది శిశువుల్లో ఒకరు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 32 మంది శిశువుల్లో ఒకరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 52 మంది శిశువుల్లో ఒకరు మరణిస్తున్నారు. దేశంలో జననాల్లో లింగ నిష్పత్తి 2017-19లో 904 ఉండగా.. 2018-120లో 3 పాయింట్లు పెరిగి 907కు చేరింది. కేరళలో అధికంగా లింగ నిష్పత్తి 974 ఉండగా.. ఉత్తరాఖండ్‌లో కనిష్ఠంగా 844గా ఉంది. ఇక  దేశంలో సంతానోత్పత్తి రేటు 2019లో 2.1 ఉండగా.. 2020లో 2.0కు తగ్గిపోయింది. 2020లో బిహార్‌ అత్యధికంగా సంతానోత్పత్తి రేటు 3.0గా, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో తక్కువ స్థాయిలో 1.4గా నమోదైంది. తెలంగాణలో ఇది 1.5గా ఉంది. 

Read more