అంతర్రాష్ట్ర బది‘లీల’ అటూ ఇటూ జాప్యం!

ABN , First Publish Date - 2022-12-12T03:44:48+05:30 IST

తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీల వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఉద్యోగులు దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా రెండు ప్రభుత్వాలు కలిసి మాట్లాడుకోవడంగానీ, సమస్యను పరిష్కరించడంగానీ చేయడం లేదన్న విమర్శలున్నాయి.

అంతర్రాష్ట్ర బది‘లీల’  అటూ ఇటూ   జాప్యం!

ఏపీ నుంచి తెలంగాణకు 1808 అర్జీలు

తెలంగాణ నుంచి ఏపీకి అర్జీలు 1369

ఇప్పటికే రాష్ట్ర సీఎస్‌కు ఏపీ సీఎస్‌ లేఖ

సెప్టెంబరు 25 నుంచి ఫైలు పెండింగ్‌లో..

హౖదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీల వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఉద్యోగులు దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా రెండు ప్రభుత్వాలు కలిసి మాట్లాడుకోవడంగానీ, సమస్యను పరిష్కరించడంగానీ చేయడం లేదన్న విమర్శలున్నాయి. పరస్పర అంగీకారం, మానవతా దృక్పథంతో పరిష్కరించుకునే ఇలాంటి సమస్యలను నెలల తరబడి సాగదీయడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర విభజన పూర్తయ్యాక ఏపీ, తెలంగాణల మధ్య కమలనాథన్‌ కమిటీ ఉద్యోగుల విభజనను చేపట్టింది. ఆ తర్వాత రెండు రాష్ట్రాలు కలిసి భార్యాభర్తల (స్పౌజ్‌) బదిలీ కేసులను పరిష్కరించుకున్నాయి. ఇంకా ఎవరైనా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలనుకుంటే, సదరు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చునంటూ ఇక్కడి ప్రభుత్వం నిరుడు సెప్టెంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా వచ్చిన దరఖాస్తులను విభాగాధిపతులు, శాఖల ముఖ్యకార్యదర్శులు పరిశీలించి, జాబితా సిద్ధం చేసి, ఏపీ సీఎ్‌సకు పంపించి, అక్కడి నుంచి అనుమతి (కాన్సెంట్‌) తీసుకోవాలని ఆదేశించింది. ఇదే తరహా ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం కూడా జారీ చేసి, అక్కడి ఉద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.

ఇలా రెండు తెలుగు ప్రభుత్వాలు అంతర్రాష్ట్ర బదిలీలకు సుముఖత వ్యక్తం చేయడంతో రెండు రాష్ట్రాల్లో ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేందుకు 1808 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు 1369 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు(ఎన్‌ఓసీ) జారీ చేయాల్సి ఉంది. దీనికి ముందు... ఒక రాష్ట్ర సీఎస్‌ నుంచి మరో రాష్ట్ర సీఎస్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈమేరకు ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మ, తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు ఇటీవలే లేఖ రాశారు. తమ రాష్ట్రం నుంచి 1808 మంది ఉద్యోగులు తెలంగాణకు రావడానికి ఇష్టపడుతున్నారని, వారిని తీసుకుంటారో లేదో వివరించాలని లేఖలో ఏపీ సీఎస్‌ కోరారు. ఈ లేఖ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోని ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు వద్దకు చేరింది. దీని గురించి సీఎం కేసీఆర్‌కు వివరించాల్సి ఉంది. ఆయన అనుమతితో ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి అవకాశముంది. అయితే,ఈ ఫైలు సెప్టెంబరు 25 నుంచి పెండింగ్‌లో పడిపోయింది.

తెరపైకి కొత్త డిమాండ్‌

తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను మాత్రమే ఏపీ నుంచి తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఏపీ నుంచి వస్తామంటున్న 1808 మంది ఉద్యోగుల్లో దాదాపు 900 మంది వరకు స్టేట్‌ క్యాడర్‌ అధికారులున్నట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా 120 మంది వరకు సచివాలయ అధికారులే ఉన్నారని సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఇలాంటివారిని తీసుకుంటే... ఇక్కడి పదోన్నతుల్లో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని, సచివాలయంలో మళ్లీ ఏపీ అధికారుల పెత్తనం పెరుగుతుందని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత ఒకరు చెప్పారు. ఇలాంటి డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడిందని అంటున్నారు. ఈ 900 మందిలో కొంతమంది తెలంగాణవారు ఉన్నారని, వారినైనా తీసుకోవాలి కదా అన్న చర్చ కూడా నడుస్తోంది.

3 అంశాలను పరిగణనలోకి తీసుకోండి

ఏపీ నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న 1808 మందిలో కొంత మంది 3 అంశాలను తెరమీదకు తెస్తున్నారు. ‘వన్‌ టైమ్‌ మెజర్‌’ కింద మొత్తం ఉద్యోగులను తీసుకోవాలన్నది మొదటి డిమాండ్‌ కాగా, స్టేట్‌ కేడర్‌ పోస్టులపై అభ్యంతరాలున్నందున... జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ కేడర్లకు చెందిన 900 మంది ఉద్యోగులనైనా తీసుకోవాలన్నది రెండో డిమాండ్‌. అదీ కుదరకపోతే... తెలంగాణ నేటివిటీ ఉన్నవారు, స్పౌజ్‌, పరస్పర బదిలీ కేసులు, మెడికల్‌ గ్రౌండ్‌ కేసులను పరిగణలోకి తీసుకోవాలని మూడో డిమాండ్‌ కింద కోరుతున్నారు. ఈ మూడో డిమాండ్‌కు సంబంధించి దాదాపు 600 మంది వరకు ఉన్నారని వివరిస్తున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవాలని కోరితేనే... అప్లికేషన్‌ పెట్టుకున్నామని, ఇప్పుడు స్థానికత అంశాన్ని తెరమీదకు తేవడం కరెక్ట్‌ కాదని వాదిస్తున్నారు. ఒకవేళ స్టేట్‌ కేడర్‌ పోస్టులు ఎక్కువగా ఉన్నాయని భయపడితే... కనీసం జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ కేడర్‌ పోస్టుల్లోని ఉద్యోగులనైనా తెలంగాణకు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వీరిని తీసుకోగానే... ఇక్కడి నుంచి ఏపీకి వెళ్లాలనుకుంటున్న 1369 మంది విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరిస్తున్నారు. ఏమైనా ఈ సమస్య నెలల తరబడి నానుతుండడం ఉద్యోగుల సహనానికి పరీక్ష పెడుతోంది.

Updated Date - 2022-12-12T03:44:48+05:30 IST

Read more