జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-09-08T05:52:32+05:30 IST

జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్లు, డీసీపీ

16 నుంచి 18 వరకు ప్రత్యేక కార్యక్రమాలు

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

వరంగల్‌ కలెక్టరేట్‌, సెప్టెంబరు 7: జాతీయ సమైక్యతను చాటే విధంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో బుధవారం అధికారులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్‌ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన సందర్భంలో 75 వసంతాల స్వత్రంత్య భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించడానికి కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. ఈ నెల 16న ప్రతీ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించాలన్నారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పోలీసు, రెవెన్యూ, జిల్లా అధికారులు ప్రజలందరు పాల్గొనాలని అన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 10వేల సాధారణ జాతీయ పతాకాలు, 50 పెద్ద జాతీయ పతాకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. 17న జిల్లా కేంద్రాల్లో ముఖ్య అతిథులచే జాతీయ పతాకావిష్కరణ నిర్వహించాలన్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఎస్టీ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి నాయకులు హైదరాబాద్‌కు చేరుకోవాలని తెలిపారు. 18న  జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, స్వాతంత్య్ర సమరయోధులను, కవులు, కళాకారులను సన్మానించాలని అన్నారు. 14 నుంచి 18 వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలను, విద్యాసంస్థలను లైటింగ్‌తో అందంగా అలంకరించాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ బి.గోపి, అడి షనల్‌ కలెక్టర్లు బి.హరిసింగ్‌, కె.శ్రీవత్స, డీసీపీ వెంకటలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-08T05:52:32+05:30 IST