డ్రగ్స్‌తో దోబూచులు!

ABN , First Publish Date - 2022-04-24T08:16:25+05:30 IST

నాలుగు రోజులు హడావుడి చేస్తారు! ఆ తర్వాత ‘ఏదో’ జరుగుతుంది! నిందితులు ప్రభుత్వ, పోలీసుల గుప్పిట్లోకి వచ్చేస్తారు! అంతే.

డ్రగ్స్‌తో దోబూచులు!

  • ముందు హడావుడి.. తర్వాత స్తబ్ధత
  • పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
  • ఫుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసు కంచికేనా?
  • అక్కడ దొరికింది కొకైన్‌ అంటూ లీకులు
  • కానీ, అధికారికంగా మాత్రం చెప్పట్లేదు
  • 24 గంటల్లో వచ్చే నివేదికకు 22 రోజులు
  • నాలుగేళ్ల కిందటి తీరు పునరావృతం
  • హైకోర్టు చెప్పినా ఈడీకి వివరాలివ్వని వైనం


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): నాలుగు రోజులు హడావుడి చేస్తారు! ఆ తర్వాత ‘ఏదో’ జరుగుతుంది! నిందితులు ప్రభుత్వ, పోలీసుల గుప్పిట్లోకి వచ్చేస్తారు! అంతే.. ఇక దర్యాప్తునకు చాప చుట్టేస్తారు! డ్రగ్స్‌ దొరికినప్పుడల్లా రాష్ట్రంలో పోలీసుల తీరు ఇది! సాక్షాత్తూ హైకోర్టు ఆదేశించినా దర్యాప్తు ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. దర్యాప్తు వివరాలను ఈడీ వంటి సంస్థలకు ఇవ్వాలని ఆదేశించినా స్పందించరు. తాజాగా, బంజారాహిల్స్‌లోని ఫుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ దొరికినా అదే తీరు! పబ్‌లో కొకైన్‌ దొరికిందని, డ్రగ్స్‌తో నిర్వాహకులకు సంబంధం ఉందంటూ రోజూ లీకులు ఇస్తున్నారు. కానీ, ఘటన జరిగి 22 రోజులు గడిచినా అధికారికంగా ఏమీ తేల్చడం లేదు. ఫుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో మెరుపు దాడులు.. అక్కడ డ్రగ్స్‌ వాడిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. పబ్‌లో చిక్కిన 125 మంది కస్టమర్లు, 20 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు.


చిక్కిన వారిలో కొందరు ప్రముఖులూ ఉన్నారు. ఆ సమయంలో పబ్‌లో లభించిన 4.64 గ్రాముల అనుమానిత తెల్ల పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు జరిగి దాదాపు 22 రోజులు అవుతోంది. అయినా, తెల్ల పొడి గుట్టు తేల్చలేదు. అక్కడ దొరికింది కొకైన్‌ అంటూ లీకులు ఇస్తున్నారు. కానీ, అధికారికంగా ప్రకటించడం లేదు. నిజానికి, అనుమానిత పౌడర్‌ను పరీక్షించి అది కొకైనా? ఇతర మాదక ద్రవ్యమా? అని గుర్తించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ఉందని ఆ సంస్థలో సేవలందించి కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ చేసిన నిపుణులు చెబుతున్నారు. పోలీసులు జాప్యం చేయాలనుకుంటే మాత్రం దశాబ్దాలైనా పట్టవచ్చని వ్యాఖ్యానించారు. ఉన్నతాధికారులు ఆదేశిస్తే అదే రిపోర్టు కొన్ని గంటల వ్యవధిలోనే వచ్చేస్తుందని అన్నారు. ఈ కేసులో తెల్ల పొడిని నిర్ధారించడానికి జాప్యం ఎందుకంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజా వ్యవహారాన్ని కూడా నాలుగేళ్ల కిందటి కేసు తరహాలో నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 


అప్పట్లోనూ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యంత్రాంగం హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలో పలువురు నటులు, దర్శకులు, సహాయ నటులు తదితరులు డ్రగ్స్‌ వాడుతున్నట్లు ఆరోపించారు. ఒకరి తర్వాత ఒకరుగా విచారణకు పిలిచారు. వివరాలు బయటకు వెల్లడించకుండా విచారణ పూర్తి చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. దర్యాప్తు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నట్లుగా మారిపోయింది. టాలీవుడ్‌ను గుప్పిట్లో పెట్టుకోవడానికే హల్‌ చల్‌ చేశారంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కేసును తేల్చేందుకు ఎంతో మంది సుప్రీం కోర్టు దాకా వెళ్లారు. తాజాగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఎక్సైజ్‌ విభాగం సీజ్‌ చేసిన ఆధారాలివ్వాలని కోరినా.. చివరకు హైకోర్టు ఆదేశించినా.. ఆ దిశలో అడుగులు పడ్డ దాఖలాలు లేవు.


ఇప్పటికీ డ్రగ్స్‌ సరఫరా అవుతూనే ఉన్నాయి.  అడపాదడపా చిన్న చేపలను పట్టుకోవడమే తప్ప.. అసలు తిమింగలాల జోలికి వెళ్లిన దాఖలాలు లేవు. డ్రగ్స్‌ పెడ్లర్‌ టోనీ కాల్‌ లిస్ట్‌లో ప్రముఖుల వివరాలు ఉన్నాయంటూ లీకులు ఇచ్చారు. కానీ, ఆ వివరాలూ బయట పెట్టలేదు. ప్రస్తుత దర్యాప్తు తీరును చూస్తే నాలుగేళ్ల కిందటి కథే పునరావృతమవుతోందని స్పష్టమవుతోంది. ప్రస్తుత సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అప్పట్లో హైదరాబాద్‌ పశ్చిమ మండలం డీసీపీ. ఆయ న నేతృత్వంలో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ వెలుగు చూసిం ది. అప్పటి హైదరాబాద్‌ సీపీ ఏకే ఖాన్‌ కూడా టాలీవుడ్‌కు చెందిన 50 మందితో ఆ కేసుకు సంబంధమున్నట్లు ప్రకటించారు. కొందరు నైజీరియన్ల అరెస్టు మినహా.. ఆ కేసు తెరమరుగైపోయింది.  


నిర్వాహకుల పాత్రపైనా సాగతీత

ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ వ్యవహారంలో నిర్వాహకుల పాత్రపైనా పోలీసులు సాగతీత ధోరణినే అనుసరిస్తున్నారు. డ్రగ్స్‌తో తనకెలాంటి సంబంధం లేదని నిర్వాహకుల్లో ఒకరైన అభిషేక్‌ విచారణలో పేర్కొన్నా..  డ్రగ్స్‌తో అతనికి సంబంధం ఉందంటూనే లీకులు ఇస్తున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ భూతం భారీగా విస్తరిస్తోందని, ఇటువంటి పరిస్థితుల్లో ఉదాసీనంగా వ్యవహరించి.. దర్యాప్తును చాప చుట్టేస్తే పరిస్థితి విషమిస్తుందని, ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి.


‘మత్తుమందు’ వ్యసనం పెరుగుతోంది: మాజీ డీజీపీ

పంజాగుట్ట :ప్రపంచం ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నివేదికల ప్రకారం ప్రతి ఏడాది మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారి సంఖ్య 8 నుంచి 10ు వరకు పెరుగుతోందని, ప్రస్తుతం ఆరు కోట్ల మంది మత్తుమందు వ్యసనపరులున్నారని, ఇది ఆందోళన కలిగించే విషయమని మాజీ డీజీపీ దినేశ్‌ రెడ్డి అన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి ‘ఇండియా అగెనెస్ట్‌ డ్రగ్స్‌ జేఏసీ’గా ఏర్పడ్డాయి. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్‌ డ్రగ్‌ కంట్రోల్‌ ఏజెన్సీని ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఏపీలోని విశాఖ ఏజెన్సీల్లో గంజాయి సాగును, తయారీని నియంత్రిస్తే.. ఇక్కడ కూడా దాని ప్రభావం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. జేఏసీ కన్వీనర్‌ డి.శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా మధ్యతరగతిలోనూ డ్రగ్స్‌ కల్చర్‌ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.


‘‘ఆనవాళ్లు ఉంటే.. ఏ రకమైన డ్రగ్స్‌ అనే దాన్ని కొన్ని గంటల్లో తేల్చేయొచ్చు. పోలీసులు కేసులో జాప్యం చేయాలనుకుంటే.. అదే నివేదికకు ఎన్ని దశాబ్దాలైనా పట్టవచ్చు. అనుమానిత పౌడర్‌ను, కనీసం టేబుల్‌, సీసాలు, సిగరెట్‌ పీకలపై దొరికే ఆనవాళ్లను పరీక్షించి.. అది కొకైనా? ఇతర మత్తు పదార్థమా? అని గుర్తించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌)లో ఉంది. ఉన్నతాధికారులు ఆదేశిస్తే.. కొన్ని గంటల వ్యవధిలో నివేదిక వచ్చేస్తుంది’’ 

- ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో సేవలందించి..

పదవీ విరమణ చేసిన నిపుణులు

Updated Date - 2022-04-24T08:16:25+05:30 IST