రాష్ట్రంలో కొవిడ్‌ బీఏ5 వేరియంట్‌ కేసు

ABN , First Publish Date - 2022-05-24T10:04:09+05:30 IST

దేశంలోనే తొలిసారిగా.. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ బీఏ5 కేసు హైదరాబాద్‌లో నమోదైంది.

రాష్ట్రంలో కొవిడ్‌ బీఏ5 వేరియంట్‌ కేసు

  • దేశంలో తొలి పాజిటివ్‌ తెలంగాణలో 
  • హైదరాబాద్‌కు చెందినఓ వృద్ధుడిలో గుర్తింపు
  • బీఏ4 కూడా మొదటిసారి మనదగ్గరే!


హైదరాబాద్‌, మే 22(ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలిసారిగా.. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ బీఏ5 కేసు హైదరాబాద్‌లో నమోదైంది. ఓ వృద్ధుడిలో దీనిని గుర్తించారు. న్యాయ సలహాదారుగా పనిచేస్తున్న ఈయన కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో ఈ నెల 12న ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌ వచ్చింది. అయితే, వైద్య శాఖ.. ర్యాండమ్‌గా కొన్ని నమూనాలను జన్యు విశ్లేషణలకు గాంధీ ఆస్పత్రి ల్యాబ్‌కు పంపింది. అందులో వృద్ధుడి శాంపిల్‌ కూడా ఉంది. జన్యు ఫలితాల్లో బీఏ5 వేరియంట్‌ ఉన్నట్లు తేలింది. ఈయనకు ఎటువంటి ప్రయాణ చరిత్ర లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని డీహెచ్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. వృద్ధుడు హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. ఇద్దరు కాంటాక్టులను గుర్తించామని వెల్లడించారు. వారిని సైతం ఐసొలేట్‌ చేశామని.. నమూనాలను ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కోసం పంపినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం చూస్తున్నామన్నారు. తెలంగాణలో కొవిడ్‌ నాలుగో వేవ్‌ వచ్చే అవకాశం లేదని డాక్టర్‌ గడల వెల్లడించారు. 


ప్రమాదం లేదన్న డీహెచ్‌

నాలుగు రోజుల క్రితం కొవిడ్‌ బీఏ4 వేరియంట్‌ కూడా దేశంలో తొలిసారిగా మనదగ్గరే నమోదైంది. ఈ నేపథ్యంలో డాక్టర్‌ గడల మాట్లాడుతూ.. బీఏ4, బీఏ5 ఒమైక్రాన్‌ సబ్‌ వేరియంట్స్‌ అని, కాబట్టి తీవ్ర ప్రభా వం చూపే అవకాశం ఉండదని చెప్పారు. అయితే, వ్యాపించే గుణం ఉందన్నారు. అందుకే కొన్ని దేశాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు.. సీఎం కేసీఆర్‌, వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో అన్నివిధాల సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Read more