సహకారమే శ్రేయస్కరం

ABN , First Publish Date - 2022-10-12T09:03:43+05:30 IST

‘‘సాంకేతికతతో నేడు ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. ప్రతి దేశం వివిధ రంగాల్లో అనేక ఆవిష్కరణలతో సత్తా చాటుతోంది.

సహకారమే శ్రేయస్కరం

  • ప్రపంచానికి కొవిడ్‌ నేర్పిన పాఠమిదే.. 
  • దేశాలు సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవాలి
  • జియోస్పేషియల్‌ టెక్నాలజీలో అవకాశాలు 
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటన

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘‘సాంకేతికతతో నేడు ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. ప్రతి దేశం వివిధ రంగాల్లో అనేక ఆవిష్కరణలతో సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశాల మధ్య పరస్పర సహకారమే ప్రపంచానికి శ్రేయస్కరం. ఒకరికొకరు సహకరించుకోవడంలోనే అందరి శ్రేయస్సు ఉందని కొవిడ్‌ పాఠం నేర్పింది. ప్రపంచమంతా ఈ మహమ్మారి బారిన పడితే.. అనేక దేశాలు వైద్య ఉపకరణాలు, డయాగ్నస్టిక్స్‌, వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి. తమ ఆవిష్కరణలను కేవలం తమ దేశానికే పరిమితం చేయకుండా.. దేశాలన్నీ ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇదే తరహా సహకారం జియోస్పేషియల్‌ టెక్నాలజీలోనూ ఉండాలి’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఐక్యరాజ్య సమితి, భారత ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో రెండవ ప్రపంచ జియోస్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌ కాంగ్రెస్‌ మంగళవారం నగరంలోని హైదరాబాద్‌ ఇంటర్నేషన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో ప్రారంభమైంది.


 మరో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో దాదాపు 120 దేశాల నుండి 700 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు మొత్తం 2వేల మంది పాల్గొంటున్నారు. ప్రారంభ వేడుకలో భాగంగా.. ప్రధాని మోదీ వీడియో సందేశం ఇచ్చారు. జియోస్పేషియల్‌ టెక్నాలజీ డేటాను ప్రపంచమంతా అందిపుచ్చుకోవాలని కోరారు. స్థిరమైన పట్టణ అభివృద్ధి, విపత్తుల నిర్వహణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని గుర్తించడం, అటవీ, నీటి నిర్వహణ, ఆహార భద్రత వంటి రంగాల్లో ఈ టెక్నాలజీ డేటా అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. ఇలాంటి ముఖ్యమైన రంగాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు ఈ సదస్సు వేదిక కావాలని ఆకాంక్షించారు. జియోస్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌ రంగంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 12.8ు వృద్ధి రేటుతో రూ.63,000 కోట్లు దాటుతుందని, 10 లక్షల మందికి పైగా ఉపాధి దొరుకుతుందని అంచనా వేశామన్నారు. భారతదేశం ప్రపంచంలోని అగ్రశ్రేణి స్టార్టప్‌ హబ్‌లలో ఒకటిగా ఉందని, యూనికార్న్‌ స్టార్ట్‌పల సంఖ్య 2021 నుండి దాదాపు రెండింతలు పెరగడం యువ ప్రతిభకు నిదర్శనమని మోదీ తెలిపారు.


దేశంలో 250 స్టార్ట్‌పలు..: జితేంద్ర సింగ్‌

వ్యర్థాల నిర్వహణ, అడవుల పెంపకం, పర్యవేక్షణ, పట్టణ ప్రణాళిక, రోడ్‌ మ్యాపింగ్‌ వంటి అనేక రంగాల్లో భారతదేశంలో 250 కంటే ఎక్కువ జియోస్పేషియల్‌ స్టార్ట్‌పలు పనిచేస్తున్నాయని కేంద్ర సైన్స్‌, టెక్నాలజీ శాఖ సహాయమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా నగరంలోని డీఆర్డీవో కేంద్రంలో జియోస్పేషియల్‌ ఇంక్యుబేటర్‌ కేంద్రాన్ని కేంద్ర మంత్రి ఇక్కడి నుంచి ఆవిష్కరించారు.  


డేటా.. అత్యంత శక్తిమంతమైంది  

ప్రపంచంలో డేటా అత్యంత శక్తిమంతమైనదని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటేరస్‌ అన్నారు. ఆయన తరఫున ప్రసంగాన్ని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి చదివి వినిపించారు. జియోస్పేషియల్‌ డేటా నేడు ప్రభుత్వం, ప్రైవేటు, పౌర సమాజానికి అందుబాటులో ఉందన్నారు. దీంతో ప్రతీ ఒక్కరూ ప్రయోజనం పొందవచ్చని చెప్పారు. 


అంతరిక్షాన్ని కాపాడుకుందాం 

జియోస్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో వర్షాలు, తుఫాన్లు, హరికేన్ల గురించి కచ్చితంగా అంచనా వేయగలుగుతాం. వ్యవసాయం, పరిశ్రమలతో పాటు పలు రంగాల వికాసానిక ఈ టెక్నాలజీ తోడ్పడుతుంది. ఈ పరిజ్ఞానం వల్ల మనం ప్రయోగించే ఉపగ్రహాల సామర్థ్యాన్ని పదింతలు పెంచుకునే వీలుంటుంది.  పదేళ్లలో అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్య లక్షకు పెరుగుతుందని అంచనా. ఈ టెక్నాలజీతో అంతరిక్షం కలుషితం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. 

-  సయ్యద్‌ అక్బరుద్దీన్‌, మాజీ దౌత్యవేత్త


పర్యావరణహితంగా ఉండాలి 

జియో స్పేషియల్‌ టెక్నాలజీ వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందనే అంశంతో పాటు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాన్ని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలి.  పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని విధానాలను రూపొందించడం అవసరం. ప్రపంచ దేశాలన్నింటికీ ఆమోదయోగ్యమైన మోడల్‌ను రూపొందించేందుకు ఈ సదస్సు వేదిక కావాలి. 

- డేవిడ్‌ హెండర్సన్‌, చీఫ్‌ జియోగ్రాఫికల్‌ ఆఫీసర్‌, బ్రిటన్‌ ప్రభుత్వ మ్యాపింగ్‌ సంస్థ

Read more