విద్యార్థులతో వంట పనులు

ABN , First Publish Date - 2022-09-25T09:53:53+05:30 IST

వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థులతో వంట పనులు కూడా చేయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

విద్యార్థులతో వంట పనులు

  • వేడి సాంబారు తరలిస్తున్న ముగ్గురు విద్యార్థులపై జారిపడ్డ గిన్నె  
  • వైరా బీసీ వసతి గృహంలో ఘటన
  • సిబ్బందిపై మంత్రి గంగుల ఆగ్రహం

రఘనాథపాలెం, సెప్టెంబరు 24: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థులతో వంట పనులు కూడా చేయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వేడిగా, బరువుగా ఉండే వంట గిన్నెలను వసతి గృహానికి తరలించే పనులను సైతం సిబ్బంది చిన్నారులతో చేయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మంలోని వైరా బీసీ సంక్షేమ వసతి గృహంలో ముగ్గురు విద్యార్థులతో సిబ్బంది శనివారం వంట పనులు చేయించారు. ఆ విద్యార్థులు వేడి సాంబారు గిన్నెను తరలిస్తుండగా అది జారి వారిపై పడింది. ఈ ఘటనలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.. గార్లపాటి జశ్వంత్‌తోపాటు మరో ఇద్దరు విద్యార్థులు వసతి గృహం బయట తయారు చేసిన సాంబారును వసతి గృహంలోకి తరలించే క్రమంలో వేడి సాంబారు గిన్నె వారిపై పడింది. దీంతో జశ్వంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వసతి గృహం ఉపాధ్యాయులు జశ్వంత్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కాగా బీసీ వసతి గృహంలో విద్యార్థులు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న బీఎస్పీ జిల్లా కార్యదర్శి మిరియాల నాగరాజు జిల్లా ఆస్పత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు.


ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ఫోన్‌లో తెలియజేశారు. విద్యార్థులతో వంట పనులు చేయించటంతోనే ప్రమాదం జరిగిందని మంత్రికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి ఫోన్‌లో వసతి గృహం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట సిబ్బంది ఉండగా విద్యార్థులతో ఎందుకు పనులు చేయించారని మండిపడ్డారు. గాయాలైన విద్యార్థి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వార్డెన్‌ వెంటనే హైదరాబాద్‌ వచ్చి తనను కలవాలని మంత్రి ఆదేశించారు. 

Updated Date - 2022-09-25T09:53:53+05:30 IST