ఏడేళ్లలో 5,333 టీఎంసీల వినియోగం

ABN , First Publish Date - 2022-09-10T08:51:59+05:30 IST

గత ఏడేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు 5,333.67 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకున్నాయి.

ఏడేళ్లలో 5,333 టీఎంసీల వినియోగం

ఏపీ 69 %.. తెలంగాణ 31% చొప్పున..

ఏపీ వాడుకున్న నీళ్లు 3,695 టీఎంసీలు

తెలంగాణ వాడుకున్నది 1,638 టీఎంసీలు

లెక్కలు వెల్లడించిన కేఆర్‌ఎంబీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గత ఏడేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు 5,333.67 టీఎంసీల  కృష్ణా జలాలను వాడుకున్నాయి. ఇందులో ఏపీ 3,695.01 టీఎంసీలను వాడుకోగా, తెలంగాణ 1,638.75 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. 2014-15 నుంచి 2021-22 దాకా రెండు రాష్ట్రాలు ఏ మేరకు నీటిని వాడుకున్నాయని లెక్కలు తీయగా... ఆంధ్రప్రదేశ్‌ 69.27శాతం, తెలంగాణ 30.73శాతం చొప్పున వినియోగించుకున్నట్లు తేలింది. ఏడేళ్లలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు 8,088.54 టీఎంసీల నీళ్లు రాగా... అందులో తెలుగు రాష్ట్రాలు 5,333.67 టీఎంసీలు వాడుకోగా... 2,754.86 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015లో తాత్కాలిక ప్రాతిపదికన కృష్ణా జలాల్లో 512 టీఎంసీలను ఏపీ, 299 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకునేలా ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం రెండేళ్లు కొనసాగగా... 2017లో 66 శాతం నీటిని ఏపీ, 34 శాతం నీటిని తెలంగాణ వాడుకోవాలని నిర్ణయించాయి. కానీ, గత ఏడాది నుంచీ కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోసం తెలంగాణ పట్టుబడుతోంది. ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు సహా నిర్మాణంలో ఉన్న అనేక ప్రాజెక్టులకు 575 టీఎంసీల నీటి అవసరం ఉందని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఏ మేరకు నీటిని వాడుకున్నాయన్న అంశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) లెక్కలు తీయగా... ఏడేళ్లలో తెలంగాణ కన్నా రెట్టింపు నీటిని ఏపీ వాడుకున్నట్లు గుర్తించారు. 2017 నుంచీ అమల్లో ఉన్న 64 శాతం నిష్పత్తితో పోల్చినా... 5 శాతం అధికంగానే నీటిని వాడుకున్నట్లు తేలింది. ఈ లెక్కలన్నీ మైనర్‌ ఇరిగేషన్‌ వినియోగంతో సంబంధం లేనివే కావడం గమనార్హం. 

Updated Date - 2022-09-10T08:51:59+05:30 IST