ఏకాభిప్రాయంతోనే పోడు పట్టాలు

ABN , First Publish Date - 2022-09-19T07:37:18+05:30 IST

పోడు భూముల సమస్య పరిష్కారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఏకాభిప్రాయంతోనే పోడు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా..

ఏకాభిప్రాయంతోనే పోడు పట్టాలు

  • ఐదు నెలల్లోపు కొలిక్కి తెచ్చేలా కార్యాచరణ
  • ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాప్‌ల ఆధారంగా
  • గ్రామసభల్లో ఎంపిక చేసిన జాబితాల పరిశీలన
  • డివిజన్‌, జిల్లా కమిటీల ఆమోదంతో పట్టాలు
  • నేడు జిల్లా కోఆర్డినేషన్‌ కమిటీల సమావేశాలు
  • దరఖాస్తుల పరిశీలనకు యాక్షన్‌ ప్లాన్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పోడు భూముల సమస్య పరిష్కారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఏకాభిప్రాయంతోనే పోడు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ ప్రక్రియను ఐదు నెలల్లోపు పూర్తి చేసే లక్ష్యంతో అధికారులు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోఆర్డినేషన్‌ కమిటీలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో పోడుభూముల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించనున్నారు. అనంతరం జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. దరఖాస్తు చేసుకొన్న వారిలో కొందరు రెవెన్యూ భూములను పోడు భూములుగా పేర్కొంటూ అర్జీలు పెట్టుకున్నారు. మరికొందరు అటవీ భూములు లేకపోయినా దరఖాస్తు చేసుకున్నారు. ఇంకొందరు ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండీ ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇలా అనర్హులకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా ఉండటంతో వీటిని తొలగించేందుకు కోఆర్డినేషన్‌ కమిటీ ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయనున్నట్లు సమాచారం.


 యాక్షన్‌ ప్లాన్‌, దరఖాస్తుల పరిశీలన, అర్హుల గుర్తింపు, పోడు పట్టాల పంపిణీ ఇలా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు దాదాపు ఐదు నెలల సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పోడు పట్టాల పంపిణీ వ్యవహారం మొత్తం గ్రామసభల ఏకాభిప్రాయ తీర్మానంతోనే జరుగనున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల గుర్తింపును అటవీశాఖ అధికారులు ‘ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఐ)’ మ్యాప్‌ ఆధారంగా పరిశీలించనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి ఎఫ్‌ఎ ఐ విడుదల చేసే మ్యాప్‌లతో.. 2005 సంవత్సరానికి ముందు అటవీభూమి విస్తీర్ణం, ఇందులో వ్యవసాయం సాగయిన విస్తీర్ణం, వ్యవసాయం జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించిన ఆధారాలు ఛాయా చిత్రాల రూపంలో అటవీశాఖ అధికారుల వద్ద పక్కాగా ఉన్నాయి. అప్పుడు నమోదైన చిత్రాల్లో చూపిస్తున్న వ్యవసాయం ఆధారంగా దరఖాస్తులను పరిశీలించనున్నారు. అందులో భాగంగా గ్రామకమిటీ తీర్మానంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను సంబంధిత ఫారెస్ట్‌ బీట్‌ అధికారికి పంపించనున్నారు. సదరు అధికారి 2005 నాటికి సంబంధించిన ఫారెస్ట్‌ మ్యాప్‌ల ఆధారంగా పోడుభూములను గుర్తించనున్నారు. లబ్ధిదారుల జాబితాలో నమోదు చేసిన పోడుభూముల వివరాల ఆధారంగా అర్జిదారులు 2005కు ముందునుంచే సాగు చేస్తున్నారా? ఆ తరువాత అడవిని నరికి సాగు చేశారా? ఇందులో గిరిజనులు ఉన్నారా? లేక  గిరిజనేతరులు సాగు చేస్తున్నారా? గతంలో పోడు భూములకు సంబంధించిన హక్కు పత్రాలు పొందినవారు ఎవరైనా ఉన్నారా? అనే అంశాలపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి, నిజమైన లబ్ధిదారులను గుర్తించి నివేదిక రూపొందించనున్నారు. ఈ నివేదికను సబ్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారికి, ఆర్డీవోకు అందజేసిన అనంతరం.. జిల్లా కమిటీ లబ్ధిదారుల తుది జాబితాను రూపొందించనుంది. ఆ తరువాత అర్హులైన పోడు రైతులకు హక్కు పత్రాలను అందజేస్తారు. 


జిల్లా కమిటీలో సభ్యులు వీరే..

పోడు భూముల లబ్ధిదారులకు హక్కులు కల్పించే బాధ్యతలను ప్రభుత్వం జిల్లా కమిటీకి అప్పగించిన విషయం తెలిసిందే. జిల్లా ఇన్‌చార్జి మంత్రి చైౖర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో పోలీస్‌ కమిషనర్‌, జిల్లా ఎస్పీ, జిల్లా అటవీశాఖ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్లు (రెవెన్యూ, లోకల్‌ బాడీస్‌), ఐటీడీఏ పీవో, డీఆర్‌డీవో, డీటీడీవో అధికారిక సభ్యులుగా ఉంటారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉంటారు. కమిటీకి కన్వీనర్‌గా జిల్లా కలెక్టర్‌ బాధ్యత వహిస్తారు. జిల్లా కో ఆర్డినేషన్‌ కమిటీ కూడా ఉంటుంది. లబ్ధిదారుల ఎంపికకు గ్రామసభలో ఏకాభిప్రాయ తీర్మానం చేయాల్సి ఉంటుంది. అనంతరం మండల, జిల్లా స్థాయి కమిటీలు ఆమోదించిన తరువాత లబ్ధిదారులకు హక్కు పత్రాలు పంపిణీ చేస్తారు. వీటితోపాటు అడవుల సంరక్షణ, భూములు ఆక్రమణకు గురికాకుండా చూసే బాధ్యతలను కూడా ఈ కమిటీలకే ప్రభుత్వం అప్పగించింది.

  

అటవీ హక్కుల చట్టం ఏం చెబుతోంది?

అటవీ హక్కుల చట్ట ప్రకారం.. 2005 డిసెంబరు 13 నాటికి సాగులో ఉన్న గిరిజనులకు ఆ భూములపై హక్కులు దక్కుతాయి. గిరిజనేతరులైతే.. 1930 నుంచి (75 ఏళ్లుగా) పోడు వ్యవసాయం చేస్తున్నట్టు సాక్ష్యాధారాలు చూపించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ అటవీ హక్కుల చట్టం-2006 ఆధారంగా 2008లో సుమారు 96,600 మంది లబ్ధిదారులకు 3,08,000 ఎకరాల పోడు భూమిపై హక్కు లభించాయి. అయితే ఈ చట్టం ప్రకారం అర్హులైనప్పటికీ కొందరు గిరిజనులకు ఈ హక్కులు దక్కలేదు. పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 2021 నవంబరు 8 నుంచి డిసెంబరు 8 వరకు దరఖాస్తులు స్వీకరించింది. గడువు సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటి ప్రకారం 12.60 లక్షల ఎకరాల భూమి అవసరమవుతుందని అటవీశాఖ అంచనా వేస్తోంది. 


అప్పట్లో అధికారులు.. ఇప్పుడు ప్రజాప్రతినిధులు 

2008 నాటి పోడుభూముల ఆర్వోఎ్‌ఫఆర్‌ పత్రాల జారీ ప్రక్రియలో అధికారులు కీలకపాత్ర పోషించారు. వీరు గ్రామాల్లోకి వెళ్లి లబ్ధిదారులను గుర్తించే బాధ్యతలను గ్రామస్థులకే అప్పగించారు. తొలుత మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించి.. పోడు రైతుల ఎంపిక, కేంద్రం రూపొందించిన విధి విధానాలు, చట్టంలో పేర్కొన్న పరిమితులు, మార్గదర్శకాలను గ్రామస్థులకు వివరించారు. అనంతరం గ్రామ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామస్థులు ఎంపిక చేసిన ఎఫ్‌ఆర్‌సీ (ఫారెస్టు రైట్స్‌ కమిటీ) లబ్ధిదారులను గుర్తించి జాబితాను రూపొందించింది. అనంతరం ఆ ప్రతిపాదనలను డివిజన్‌ స్థాయి కమిటీకి సిఫారసు చేసింది. దీనిని డివిజన్‌ కమిటీ పరిశీలించి, చేసిన సూచనల మేరకు జిల్లా కమిటీ.. అర్హులైన పోడు రైతులను ఎంపిక చేసిన వారికి హక్కు పత్రాలను జారీ చేసింది. ఇలా పోడు భూముల విషయంలో మూడు కమిటీలు కీలకంగా వ్యవహరించాయి. గ్రామస్థాయి కమిటీలో గ్రామస్థులు ఎన్నుకున్న వారే అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ సభ్యులుగా ఉన్నారు. డివిజన్‌ స్థాయిలో ఆర్డీవో, డివిజన్‌ ఫారెస్టు, గిరిజన సంక్షేమ అధికారులు, జిల్లా స్థాయిలో కలెక్టర్‌, జిల్లా అటవీశాఖ, గిరిజన సంక్షేమశాఖ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఆమోదించాకే లబ్ధిదారులకు హక్కు పత్రాలు జారీచేశారు. అయితే తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల్లో మాత్రం ప్రజాప్రతినిధులు కీలకంగా మారారు. 

Updated Date - 2022-09-19T07:37:18+05:30 IST